అవసరమైన చోట ఎక్కువమంది ఉద్యోగులు | Sakshi
Sakshi News home page

అవసరమైన చోట ఎక్కువమంది ఉద్యోగులు

Published Fri, Aug 25 2023 1:24 AM

Telangana Health department strengthens Primary Healthcare - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే ప్రజారోగ్య సంచాలకుల విభాగాన్ని బలోపేతం చేయాలనే ఆలోచనతో హేతుబద్దికరణ చేపట్టాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. దీనిపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఏర్పాటు చేసిన కమిటీ ప్రతిపాదనల మేరకు గురువారం మార్గదర్శకాలు విడుదల చేస్తూ ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీచేశారు.

ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని ఉద్యోగుల హేతుబద్దికరణ ప్రక్రియకు అనుమతించారు. రోగుల తాకిడికి అనుగుణంగా తగిన వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసుకునేలా మార్గదర్శకాలు రూపొందించారు. కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో ఇప్పటివరకు ఒక్క డీఎంహెచ్‌వో మాత్రమే ఉన్నారు. 

హైదరాబాద్‌లో ఇక ఆరుగురు డీఎంహెచ్‌వోలు 
పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత, భవిష్యత్‌ వైద్య అవసరాలు గుర్తించిన ప్రభుత్వం అదనంగా 5 డీఎంహెచ్‌వోలను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. చార్మినార్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కూకట్‌ పల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్‌ జీహెచ్‌ఎంసీ జోన్ల వారీగా వీటి ఏర్పాటుకు అంగీకరించింది. దీంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం ఆరుగురు డీఎంహెచ్‌వోలు ఉంటారు.

కొత్త డీఎంహెచ్‌వోలను కలుపుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 38 మంది ఉంటారు. ఇక రాష్ట్రంలో 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా, అందులో సిబ్బంది ఏకరీతిగా లేదు. వైద్యాధికారి, పర్యవేక్షక సిబ్బంది పోస్టులు ఏకరీతిగా పంపిణీ జరగలేదు. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది ఏకరీతిగా ఉండేలా ప్రస్తుతం పునర్వ్యవస్థీకరించారు. 

కొత్తగా 40 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 
కొత్తగా ఏర్పడిన 40 మండలాల్లో పీహెచ్‌సీలు లేవు. వీటిలో 40 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. గతంలో 30 మండలాల్లో ఉన్న పీహెచ్‌సీలను ఆసుపత్రులుగా అప్‌గ్రేడ్‌ చేశారు. ఈ ప్రదేశాలలో ఔట్‌రీచ్‌ కార్యకలాపాలు సీహెచ్‌సీలతో నిర్వహి స్తున్నారు. అయితే అన్ని సీహెచ్‌సీలను తెలంగాణ వైద్య విధాన పరిషత్‌కు బదిలీ చేయడం వల్ల, ఔట్‌రీచ్‌ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఈ ప్రదేశాలలో పీహెచ్‌సీల అవసరం ఏర్పడింది.

ఈ నేపథ్యంలో 30 మండలాల్లో పీహెచ్‌సీలను మంజూరు చేశారు. రాష్ట్రంలోని 235 అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ (యూపీహెచ్‌సీ)లను బలోపేతం చేయడానికి, తగిన సిబ్బందిని నియమించాలని నిర్ణయించింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల సేవలు వినియోగించేందుకు వీలుగా, డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్లను టీవీవీపీ ఆసుపత్రుల పరిధిలోకి తీసుకొచ్చారు. వికారాబాద్‌ జిల్లా అనంతగిరిలో ఉన్న ప్రభుత్వ టీబీ ఆసుపత్రిని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోకి తీసుకువచ్చారు. 

4,246 ఎంపీహెచ్‌ఏ పోస్టులు మంజూరు 
1,712 పోస్ట్‌లను సూపర్‌న్యూమరరీ పోస్ట్‌లుగా మార్చారు. మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (మహిళ) కేడర్‌ ఈ హేతుబద్ధీకరణలో కవర్‌ చేయలేదు. దాంతో పీహెచ్‌సీలు, ఇతర సంస్థలలో మంజూరు చేసిన ఎంపీహెచ్‌ఏ (ఎఫ్‌) పోస్టుల స్థానం మారదు. దాంతో 4,246 ఎంపీహెచ్‌ఏ (మహిళ) పోస్టులను మంజూరు చేశారు.

అయితే ఈ పోస్టులకు సంబంధించిన స్పష్టతను వైద్య, ఆరోగ్యశాఖ ఇవ్వలేదు. మార్గదర్శకాల్లో కొంత గందరగోళం ఉందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. కాగా, ఈ హేతుబద్ధీకరణ ప్రక్రియలో రోగుల తాకిడికి అనుగుణంగా, అవసరాల మేరకు సిబ్బందిని స్థానచలనం చేయడానికి ప్రభుత్వం వీలు కలి్పంచింది. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి మూడు నెలల గడువు విధించింది.   

 
Advertisement
 
Advertisement