ఒకే రోజు కొలువుదీరిన నలుగురు దేవతలు !
అర్ధరాత్రి 12:28 గంటలకు గద్దెపైకి సారలమ్మ,
12:29 గంటలకు గోవిందరాజులు, పగిడిద్దరాజు..
ఏటూరునాగారం: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. తొలి రోజు బుధవారం సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు కొలువుదీరాల్సి ఉండగా.. పూజారులు సమయపాలన పాటించినప్పటికీ అనివార్య కారణాలతో బుధవారం అర్ధరాత్రి 12:28 గంటల తర్వాత (గురువారం) సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపై ప్రతిష్ఠించారు. గురువారం సాయంత్రం సమ్మక్క గద్దెలపైకి రానుంది. ఈ నేపథ్యంలో నలుగురు దేవతలను ఒకే రోజు (గురువారం) గద్దెలపై ప్రతిష్ఠించినట్లు అయ్యింది.
పగిడిద్దరాజు పెళ్లికొడుకాయెనె..
మేడారం(ఏటూరునాగారం): గంగారం మండలం పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజు పెళ్లికొడుకుగా ముస్తాబై అడవిమార్గంలో కాలినడకన బయల్దేరారు. గోవిందరావుపేట మండలం లక్ష్మీపురంలో వారి ఆడబిడ్డ ఇంటి వద్దకు చేరుకున్నాడు. బుధవారం ఉదయం పస్రా మీదుగా కాలినడకన డప్పుచప్పుళ్లతో మేడారానికి చేరుకున్నారు. మేడారంలోని సమ్మక్క గుడికి సారలమ్మ వచ్చిన తర్వాత పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులు కలిసి ఒకేసారి గద్దెలపై కొలువుదీరారు.

నేడు వరాల తల్లి రాక
ఏటూరునాగారం: కోట్లాది మంది భక్తుల కొంగు బంగారమైన వరాల తల్లి సమ్మక్క గురువారం వనం వీడి జనం మధ్యలోకి రానుంది. సాయంత్రం 6 గంటలకు సమ్మక్క పూజారి కొక్కెర కృష్ణయ్యతోపాటు ప్రధాన పూజారులు చిలకలగుట్టపైన ప్రత్యేకంగా రహస్య పూజలు నిర్వహించి గుట్టమీద నుంచి దిగుతారు. గుట్ట దిగే సమయంలో ఎస్పీ ఏకే 47 తుపాకీతో గాల్లో కాల్పులు జరిపి అమ్మవారి ఆగమనానికి శ్రీకారం చుడతారు. డోలువాయిద్యాలు, కొమ్ము బూర శబ్దాలు, ధూపం, పోలీస్ బందోబస్తు, రోప్‌పార్టీ నడుమ అమ్మవారిని గుట్ట నుంచి మేడారం గద్దెల వైపు తీసుకొస్తారు. గుట్టకు గద్దెలకు మధ్యలో ఉన్న ఎదురుకోళ్ల మండపంలోకి తీసుకొచ్చి అక్కడ ఎదురుకోళ్లు నిర్వహిస్తారు. మేడారం ఆడబిడ్డలు సమ్మక్క తల్లికి ఎదురెళ్లి నీళ్లను ఆరబోసి స్వాగతం పలుకుతారు. సమ్మక్కను మేడారంలోని సమ్మక్క గుడిలోకి శక్తిపీఠం వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. గుడి నుంచి గద్దెల మీదకు తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. ఈ సమయంలో గుడిలోని విద్యుత్ దీపాలను నిలిపివేస్తారు. సమ్మక్క ఆగమనం సమయంలో వేలాది మంది భక్తులు చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెల వరకు మేకపోతులు, కోళ్లను బలిచ్చి స్వాగతం పలుకుతారు. అమ్మవారి నడిచే దారిలో అడుగడుగున రంగులతో ముగ్గులు వేస్తారు.
చిలకలగుట్టపై పూజలు..
సమ్మక్క కొలువై ఉన్న చిలకలగుట్టపై మంగళవారం సమ్మక్క పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. కోళ్లతో గుట్టపైకి వెళ్లి అక్కడ శాంతించే విధంగా పూజలు నిర్వహించారు. సమ్మక్క వచ్చే దారిని గుట్ట నుంచి ప్రధాన గేటు వరకు శుభ్రం చేశారు. సమ్మక్క ఆగమనానికి కావాలి్సన ఏర్పాట్లను సిద్ధం చేశారు.


