తెలంగాణలో సీబీఐకి ‘నో ఎంట్రీ’.. కేసీఆర్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం | Sakshi
Sakshi News home page

తెలంగాణలో సీబీఐకి ‘నో ఎంట్రీ’.. కేసీఆర్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం

Published Mon, Oct 31 2022 1:13 AM

Telangana Govt sensational decision denying authority of CBI - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు తెలంగాణలో దా­డు­లు, దర్యాప్తు చేసే అధికా­రాన్ని ని­రా­కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీ­ఐ దాడులు, దర్యాప్తునకు వీలు కల్పించే ‘సా­దారణ సమ్మతి (జనరల్‌ కన్సెంట్‌)’ని ఉప సంహరించుకుంది. ఈ మేరకు రహస్యంగా రెండు నెలల కిందే జీవో 51ను జారీ చేసింది. ఎలాంటి నేరాల విషయంలోనైనా తెలంగా­ణలో దర్యాప్తు చేసేందుకు ప్రతి కేసుకు రాష్ట్ర ప్ర­భు­త్వం నుంచి ముందస్తుగా సమ్మతి తీసు­కోవాల్సి ఉంటుందని అందులో స్పష్టం చేసింది. ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు­లో సీబీఐ విచారణ జరపాలన్న బీజేపీ విజ్ఞప్తిౖ­పె హైకోర్టు విచారణ నేపథ్యంలో ఈ జీవో బహిర్గతం కావడం గమనార్హం.

దాడులపై ఊహాగానాల నేపథ్యంలో..
విపక్షాల నేతలు లక్ష్యంగా సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దాడులు చేయిస్తోందని దేశవ్యాప్తంగా పలు పార్టీలు, ముఖ్యనేతలు ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానంగా విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై అత్యధిక శాతం దాడులు జరుగుతున్నాయని మండిపడుతు­న్నారు. తెలంగాణలోనూ అదే తరహాలో కేంద్రం దాడులు చేయించనుందని కొన్ని నెలలు­గా ఆరోపణలు, ఊహాగానాలు వెల్లువెత్తుతు­న్నాయి.

టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు సైతం ఈ దిశగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌–1946’కి సంబంధించిన సభ్యులందరికీ గతంలో జారీ చేసిన సాధారణ సమ్మతిని ఉప సంహరించుకుంటూ రాష్ట్ర హోంశాఖ ఆగస్టు 30న రహస్యంగా జీవో 51 జారీ చేసింది.

ఈ చట్టం కిందే సీబీఐ ఏర్పాటైంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణలో సీబీఐకి ప్రవేశాన్ని నిరాకరించినట్టు అయింది. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులపై దర్యాప్తు చేసే అధికారాన్ని సైతం సీబీఐ కోల్పోయినట్టే. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ శాఖలు/సంస్థల ఉద్యోగులపై దర్యాప్తు విషయంలో సీబీఐ పాత్రను రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పోషించాల్సి ఉండనుంది. విపక్షాల నేతలను వేధించడానికి సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుండడంతోనే రాష్ట్రంలో సీబీఐకి సమ్మతిని ఉపసంహరించుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

ఎమ్మెల్యేలకు ఎర కేసు నేపథ్యంలో..
నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు భారీగా డబ్బు, పదవులు ఇస్తామని ఎర వేసి కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన ముగ్గురిని ఇటీవల సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ముగ్గురి వెనక బీజేపీ పెద్దలున్నట్టు టీఆర్‌ఎస్‌ ఆరోపణలు చేయగా.. అదంతా టీఆర్‌ఎస్‌ కుట్ర అని బీజేపీ ప్రత్యారోపణలు చేసింది.

ఈ క్రమంలో కేసు దర్యాప్తును సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జి నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్‌కు అప్పగించాలంటూ బీజేపీ వేసిన పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టు శనివారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో సీబీఐకి సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంటూ జీవో నం.51 జారీ చేశామని.. సీబీఐ ప్రవేశానికి అనుమతి లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. దీనితో రెండు నెలల కింద రహస్యంగా జారీ అయిన జీవో తాజాగా బహిర్గతమైంది.

రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి ఎందుకు?
కేంద్రం ‘ఢిల్లీ స్పెషల్‌ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం–1946’ కింద సీబీఐని ఏర్పాటు చేసింది. సీబీఐ ఢిల్లీ భూభాగం పరిధిలో తమ అధికారాలను వినియోగించుకోవడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుంది. సీబీఐ ఇతర రాష్ట్రాల్లో తమ అధికారాలను అమలు చేసి దాడులు, దర్యాప్తు చేపట్టాలంటే.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ భూభాగంలో సీబీఐకి అనుమతిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేయాలి.

అవినీతి నిరోధక చట్టం–1998, ఐపీసీలోని కొన్ని సెక్షన్లతోపాటు 63కి పైగా కేంద్ర ప్రభుత్వ చట్టాల్లోని సెక్షన్ల కింద సీబీఐ ఆయా రాష్ట్రాల భూభాగంలో నేరాలపై దర్యాప్తు చేసేందుకు సాధారణ సమ్మతి అవసరం. ఈ సాధారణ సమ్మతిని వెనక్కి తీసుకునే అధికారాన్ని సైతం రాష్ట్రాలకు ఉంటుంది.

చివరిసారిగా తెలంగాణ ప్రభుత్వం 2016లో సెప్టెంబర్‌ 23న సీబీఐకి సాధారణ సమ్మతి నోటిఫికేషన్‌ను జారీ చేస్తూ జీవో 160 జారీ చేసింది. ప్రస్తుతం ఆ జీవోతో పాటు గతంలో జారీ చేసిన అన్ని సాధారణ సమ్మతులను ఉపసంహరించుకుంటున్నట్టు జీవో 51లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే దేశంలో 8 రాష్ట్రాలు సీబీఐకి సాధారణ సమ్మతిని ఉపసంహరించుకోగా.. తెలంగాణ 9వ రాష్ట్రంగా మారింది.  

Advertisement
Advertisement