సీఐడీకి హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసు.. | Telangana Govt Orders Transfer Of Kidney Racket Case To CID | Sakshi
Sakshi News home page

సీఐడీకి హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసు..

Jan 24 2025 8:11 PM | Updated on Jan 24 2025 8:23 PM

Telangana Govt Orders Transfer Of Kidney Racket Case To CID

కిడ్నీ రాకెట్‌ కేసును తెలంగాణ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: కిడ్నీ రాకెట్‌ కేసును తెలంగాణ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలన్నారు. కేసు పూర్వపరాలను సమీక్షించిన మంత్రి.. తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రభుత్వాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

హైదరాబాద్‌లోని అలకనంద ఆసుపత్రిలో జరిగిన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ వ్యవహారంపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం తన నివాసంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. డాక్టర్ల కమిటీ ఇచ్చిన ప్రిలిమినరీ రిపోర్ట్‌ను మంత్రి పరిశీలించారు. అలకనంద హాస్పిటల్‌లో ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలకు ఎటువంటి అనుమతి లేదని, నిబంధనలకు విరుద్ధంగా సర్జరీలు జరిగాయని అధికారులు మంత్రికి వివరించారు.

మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు ఈ అక్రమ వ్యవహారంతో సంబంధం ఉందన్నారు. అమాయకులు, అత్యంత నిరుపేదల ఆర్థిక దుస్థితిని ఆసరాగా తీసుకుని, వారిని మభ్యపెట్టి కిడ్నీల డొనేషన్‌కు ఒప్పిస్తున్నారన్నారు. అలకనంద హాస్పిటల్‌లో తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళల నుంచి కిడ్నీలు తీసుకుని, కర్ణాటకకు చెందిన వారికి అమర్చారని అధికారులు తెలిపారు. అలకనంద ఆసుపత్రిని సీజ్ చేశామని, ఆసుపత్రి ఓనర్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారని మంత్రికి తెలిపారు. ఈ కేసులో లోతైన విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను సహించేది లేదన్నారు. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా పరిగణిస్తున్నామని తెలిపారు. కేసుతో సంబంధం ఉన్నవాళ్లందరిని కఠినంగా శిక్షించాలని, ఇందుకు అవసరమైన అన్ని ఆధారాలను సేకరించాలన్నారు. పూర్తిస్థాయి విచారణ కోసం కేసును సీఐడీకి అప్పగించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలని హెల్త్ సెక్రటరీకి మంత్రి సూచించారు.

ఇదీ చదవండి: మీర్‌పేట్‌ హత్య కేసులో సంచలన విషయాలు.. రెండు ఎవిడెన్స్‌ లభ్యం?

కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ వ్యవహారం గురించి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. గతంలో ఇలాంటి కేసు కేరళలో నమోదైన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. గతంలో జరిగిన వ్యవహారాలకు, ప్రస్తుత కేసుకు ఏమైనా సంబంధం ఉందా? అనే దానిపై ఆరా తీయాలన్నారు. ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అక్రమాలలో ప్రైవేట్‌ అంబులెన్స్‌ డ్రైవర్ల పాత్ర ఉన్నట్టు గతంలో వచ్చిన ఆరోపణలను గుర్తు చేసిన మంత్రి, ఆ దిశగా కూడా ఎంక్వైరీ జరిపించాలని ఆదేశించారు.

ప్రైవేట్, కార్పొరేట్‌ ఆసుపత్రిల్లో జరుగుతున్న శస్త్ర చికిత్సలపై నిఘా ఉంచాలన్నారు. గర్భిణుల వివరాలను నమోదు చేస్తున్నట్టుగానే, ఇతర‌ సర్జరీలకు సంబంధించిన వివరాలను నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చేటప్పుడు, రిజిస్ట్రేషన్ రెన్యువల్‌ చేసేటప్పుడు అన్ని వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించాలని సూచించారు. అనుమతుల జారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని ఆదేశించారు. ప్రైవేట్‌ ఆసుపత్రిలో జరుగుతున్న ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్లపై ఆడిట్‌ నిర్వహించాలని గతంలో మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement