కన్నులపండువగా ప్రారంభంకానున్న జాతర
సాక్షి, హైదరాబాద్: మేడారం మహా జాతర నేటి నుంచే ప్రారంభం కానుంది. నాలుగు రోజులపాటు సాగే సంరంభంలో.. ఇవాళ పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులను గద్దెల ప్రాంగణంలో ప్రతిష్టించడంతో అంకురార్పణ జరగనుంది. రేపు సాయంత్రం సమక్క గద్దె మీదకు చేరనుంది. జాతర నేపథ్యంలో మొక్కులు చెల్లించుకునేందుకే లక్షల మంది జాతరకు తరలి వస్తున్నారు.

మేడారం పరిసర ప్రాంతాలు భక్త జనంతో కిక్కిరిసిపోయింది. జాతర మొదలు కావడంతో ఒక్కసారిగా పోటెత్తారు. ట్రాక్టర్లు, కార్లు, ఆటోలు, బస్సులు.. ఇలా వాహనాల్లో తరలి వస్తున్నారు. దీంతో బుధవారం వేకువ జామున సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నెలకొంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా.. పోలీసులు రంగంలోకి దిగారు. ఇటు జంపన్న వాగు వద్ద ఇసుకేస్తే రాలని జనం కనిపిస్తున్నారు.
మేడారానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని కన్నెపల్లి గుడి నుంచి సారలమ్మ, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజును తీసుకువచ్చి బుధవారం మేడారం గద్దెల ప్రాంగణంలో ప్రతిష్ఠిస్తారు. గురువారం సాయంత్రం మేడారం సమీపంలోని చిలుకలగుట్ట నుంచి కుంకుమభరిణె రూపంలో సమ్మక్కను తీసుకువచ్చి మేడారంలోని గద్దెపై ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం వనదేవతలు సమ్మక్క-సారలమ్మను భక్తకోటి దర్శించుకుంటారు. శనివారం సాయంత్రం జనదేవతల వనప్రవేశంతో మహాజాతర పరిసమాప్తి అవుతుంది.

నేటి నుంచి శనివారం వరకు నాలుగు రోజులపాటు సమ్మక్క-సారలమ్మకు మొక్కులు చెల్లించేందుకు భారీ సంఖ్యలో మేడారం వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గట్లే.. మహోత్తర ఘట్టానికి తగ్గట్లు పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. మహా జాతర నేపథ్యంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు జాతర శుభాకాంక్షలు తెలియజేశారు. 13వేల మంది పోలీసులు, 42వేల మంది వివిధ శాఖల అధికారులతో జాతర నిర్వహణ జరగనుంది.

రాత్రి వేళ ఇబ్బందులు లేకుండా చుట్టుపక్కల పదికిలోమిర్ల పరిధిలో తాత్కాలిక విద్యుత్ స్తంభాలు, వీధిదీపాల ఏర్పాటు ఏర్పాటు చేశారు. రాష్ట్ర పండుగైన మేడారం గిరిజన జాతరను మంత్రి సీతక్క దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఇటు వీవీఐపీల పర్యటనల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈసారి జాతరకు సుమారు రెండు కోట్ల మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనాలు వేస్తున్నారు.
👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


