121 మున్సిపల్ చైర్మన్ పదవుల్లో 38 బీసీలకు కేటాయింపు
కార్పొరేషన్లలో 30 శాతం సీట్లు రిజర్వుడు
పది మేయర్ పదవుల్లో బీసీలకు మూడు సీట్లు
చైర్‌పర్సన్లు, మేయర్లు, వార్డుల రిజర్వేషన్ల సంఖ్య ఖరారు
నోటిఫికేషన్ విడుదల చేసిన పురపాలక శాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి వార్డుల రిజర్వేషన్లు, చైర్‌పర్సన్, మేయర్ల పదవుల రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, మహిళల వారీగావార్డులు, డివిజన్లు, చైర్మన్, మేయర్ పదవులు ఏ కేటగిరీకి ఎన్ని దక్కుతాయో వెల్లడించింది. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు సంబంధించి పురపాలక శాఖ కార్యదర్శి డాక్టర్ టీకే శ్రీదేవి బుధవారం జీవో నంబర్ 14 జారీ చేశారు. 
మున్సిపల్ వార్డులు, డివిజన్లలో ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ స్థానాలు కేటాయించారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు, 2019 తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారం జనరల్ మహిళలకు రిజర్వుడు స్థానాల సంఖ్యను ఖరారు చేశారు. బీసీలకు మున్సిపాలిటీల్లో 31.4 శాతం, కార్పొరేషన్లలో 30 శాతం సీట్లు రిజర్వు చేశారు. 121 మున్సిపాలిటీల్లో బీసీలకు 38 చైర్మన్ పదవులు రిజర్వు చేయగా, ఇందులో బీసీ జనరల్‌కు 19, బీసీ మహిళకు 19 చొప్పున ఖరారయ్యాయి. 10 కార్పొరేషన్లకు గాను బీసీలకు మూడు మేయర్ పదవులు రిజర్వు చేయగా, ఇందులో బీసీ మహిళలకు ఒకటి, బీసీ జనరల్‌కు రెండు మేయర్ పదవులు దక్కనున్నాయి. 


