
జాబ్ క్యాలెండర్‌లో పేర్కొన్న ప్రకారం వెలువడని నోటిఫికేషన్లు
ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పెండింగ్‌తో నిలిచిన నోటిఫికేషన్ల జారీ
ప్రస్తుతం వర్గీకరణ ప్రక్రియ పూర్తయినా ఇప్పటికీ వెలువడని వైనం
గతేడాది క్యాలెండర్ ప్రకటనల గడువు
ముగిసి 4 నెలలు కావొస్తున్నా కొత్త క్యాలెండర్ ఊసేలేదు
ఉద్యోగ ప్రకటనలు ఎప్పుడో తెలియక నిరుద్యోగుల్లో నిరాశ, అయోమయం
రెండేళ్లుగా ఎదురుచూస్తున్నా...
దాదాపు రెండేళ్లుగా ఫుడ్ ఇన్‌స్పెక్టర్, ఇతర అర్హతగల ఉద్యోగాలకు సిద్ధమవుతున్నా. కోచింగ్, పుస్తకాల కోసం ఇప్పటివరకు రూ. లక్ష ఖర్చు చేశా. కానీ ఇప్పటివరకు తగిన ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల కాలేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ప్రారంభం అయ్యాయి. తప్పని పరిస్థితుల్లో ప్రిపరేషన్ ఆపేసి ప్రైవేటు ఉద్యోగం కోసం ప్రయత్నం మొదలు పెట్టా. – ఎం. సతీశ్, ఎంఎస్సీ ఫుడ్ టెక్నాలజీ, మహబూబాబాద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియను నిర్దిష్ట విధానంలో చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలనుకున్న జాబ్ క్యాలెండర్ అమలు జాడలేదు. ఏడాది కాలంలో భర్తీ చేయనున్న ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లను ఏ సమయంలో విడుదల చేస్తారు... పరీక్షల నిర్వహణ ఎప్పుడు తదితర అంశాలపై అభ్యర్థులకు ముందస్తుగా స్పష్టత ఇవ్వడమే జాబ్ క్యాలెండర్ ముఖ్య ఉద్దేశం.
ఈ క్యాలెండర్‌ను ఏటా ప్రకటిస్తే అభ్యర్థులు వ్యూహాత్మక లక్ష్యంతో ముందుకు పోవచ్చనే ఆలోచనతో ప్రజాప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగా గతేడాది ఆగస్టులో తొలి జాబ్ క్యాలెండర్‌ను విడు దల చేసింది. అందులో గ్రూప్–1 ఉద్యోగాలతోపాటు ఇతర కేటగిరీ లకు చెందిన 15 రకాల ఉద్యో గాల భర్తీకి సంబంధించి నోటి ఫికేషన్ల విడుదల, పరీక్షల నిర్వహణకు తేదీలు ప్రకటించింది. కానీ ఎస్సీ వర్గీ కరణకు సంబంధించి అత్యున్నత న్యాయ స్థానం తీర్పు ఇవ్వడం.. ఆ తీర్పునకు అనుగుణంగా రిజర్వేషన్లు విభజించాల్సి రావడంతో ఉద్యోగ ప్రకటనలకు అంతరాయం ఏర్పడింది.
వెలువడకపోవడంతో నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారు. తొలిజాబ్ క్యాలెండర్ గడువు సైతం ముగియడంతో కొత్త జాబ్ క్యాలెండర్ ఇస్తారా లేక గత క్యాలెండర్‌లో నిర్దేశించిన నోటిఫికేషన్లకు సంబంధించి తేదీలు మార్చి విడుదల చేస్తారా? అనే విషయం తెలియక నిరుద్యోగులు అయోమయానికి గురవుతున్నారు.

రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పూర్తి...
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఎస్సీ వర్గీకరణ తీర్పుతో బ్రేక్ పడటంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా వర్గీకరణ తీర్పును స్వాగతిస్తూ... ఈ ప్రక్రియ పూర్తయ్యాకే కొత్త ఉద్యోగ ప్రకటనలు జారీ చేస్తామని స్పష్టం చేశారు. దీంతో గతేడాది ఆగస్టు నుంచి ఎలాంటి ఉద్యోగ ప్రకటన వెలువడలేదు. ప్రభుత్వం ప్రకటించిన తొలి జాబ్ క్యాలెండర్ ప్రకారం గతేడాది సెప్టెంబర్ నుంచి ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడాలి. కానీ వర్గీకరణ అంశంతో నోటిఫికేషన్ల విడుదల ఎక్కడికక్కడ నిలిచిపోయింది.
మరోవైపు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి అభిప్రాయాల స్వీకరణ, అమలుకు సంబంధించిన అధ్యయనాన్ని ప్రభుత్వం మొదలుపెట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి వర్గీకరణకు సంబంధించిన ప్రక్రియ పూర్తవగా ఏప్రిల్ 14న ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. ఆ రోజు నుంచి రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించి అమలు చేస్తున్నారు. ఉద్యోగ నియామకాలకు అడ్డంకిగా మారిన వర్గీకరణ సమస్య తొలగిపోవడంతో ఉద్యోగ నియామకాల ప్రకటనల జారీకి మార్గం సుగమమైనప్పటికీ ఆ తర్వాత కూడా ఒక్క ఉద్యోగ ప్రకటన వెలువడలేదు.
కొత్త జాబ్ క్యాలెండర్ ఏమైంది?
రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఏప్రిల్‌లో జాబ్ క్యాలెండర్ జారీ చేస్తామని ప్రకటించింది. గతేడాది కాస్త ఆలస్యమైనప్పటికీ ఈ ఏడాది నుంచి వార్షిక సంవత్సరం బడ్జెట్ సమావేశాల అనంతరం ఈ జాబ్ క్యాలెండర్ జారీ చేస్తామని పలు సందర్భాల్లో సీఎంతోపాటు మంత్రులు ప్రకటించారు. ఈ లెక్కన ఈ ఏడాది ఏప్రిల్ నాటికి కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాల్సి ఉంది. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో గత జాబ్ క్యాలెండర్‌లో నిర్దేశించిన ప్రకటనలు వెలువడకపోవడంతో ఆయా ఉద్యోగాలతోపాటు కొత్తగా గుర్తించిన ఖాళీలతో కూడిన ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన అంశాలను కొత్త జాబ్ క్యాలెండర్‌లో వస్తాయని నిరుద్యోగులు భావించారు.
కానీ కొత్త వార్షిక సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడిచినా ఇప్పటివరకు నూతన జాబ్ క్యాలెండర్ ఊసే లేదు. ఏయే ఉద్యోగాల భర్తీ ఎప్పుడు జరుగుతుందా? అనే సందిగ్ధంలో నిరుద్యోగ అభ్యర్థులు సతమతమవుతున్నారు. ఉద్యోగ ప్రకటనల జారీలో జాప్యంతో వయోపరిమితి దాటిపోతుందనే ఆందోళన కొందరిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత జాబ్ క్యాలెండర్‌తో తాత్కాలిక కొలువులను వదిలేసి ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారు ఇప్పటికీ నోటిఫికేషన్లు విడుద కాకపోవడంతో లబోదిబోమంటున్నారు.
గ్రూప్స్ కోసం ప్రయత్నిస్తున్నా...
గ్రూప్స్ ఉద్యోగమే లక్ష్యంగా ఏడాదిన్నరగా ప్రయత్నం చేస్తున్నా. ఇతర ప్రైవేటు కొలువులేవీ చేయకుండా ఉద్యోగ సాధన కోసం ప్రిపేరవుతున్నా. గతేడాది గ్రూప్–1 నోటిఫికేషన్ మినహా మిగిలిని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల కాలేదు. ఏడాదిన్నర నుంచి లైబ్రరీకి వెళ్లి చదువుకుంటున్నా. నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో మరికొంత కాలం ప్రిపేర్ కావాలా లేక ప్రైవేటు కొలువు కోసం ప్రయత్నించాలా అనే సందిగ్ధం నెలకొంది. – మారపాక కిషోర్, బీకాం, ఎంసీజే
అయోమయంలో ఉన్నా..
నేను బీబీఏతోపాటు ఎం.కామ్ చేశా. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది నా లక్ష్యం. కానీ రెండేళ్లుగా ఉద్యోగ ప్రకటనలు విడుదల కాలేదు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అయ్యే వాడిని. కానీ క్యాలెండర్ ఇవ్వకపోవడంతో అయోమయంలో ఉన్నా. – అల్లం సాయిరాం, బోథ్, అదిలాబాద్ జిల్లా
ఎంతకాలం ప్రిపేరవ్వాలి?
రెండేళ్లుగా హాస్టల్‌లో ఉంటూ ప్రైవేటు కోచింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటున్నా. కానీ నోటిఫికేషన్లు వెలువడకపోవడంతో ఎన్ని రోజులు సిద్ధం కావాలో అర్థంకావట్లేదు. నెలనెలా రూ. 5 వేలకుపైగా ఖర్చవుతుండగా తల్లిదండ్రులకు భారమవుతున్నాననే బాధ ఉంది. – ´పాక ప్రవీణ్, పుల్లెంల, నల్లగొండ జిల్లా