విదేశీ విద్య ఆశలకు ‘అంబేద్కర్‌ విద్యానిధి’ అండ.. ఏటా రూ.20 లక్షల ఆర్థిక సాయం

Telangana: Govt Encourages Overseas ScholarShip Ambedkar Vidhyanidhi To Students - Sakshi

నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో చదువుకునేందుకు ఎస్సీ విద్యార్థులు మక్కువ చూపుతున్నారు. షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదివేందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015 నుంచి అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం ద్వారా ఆర్థికసాయం అందిస్తోంది. మన రాష్ట్రంలో డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ విద్యార్థులకు విదేశీ యూనివర్సిటీల్లో సీట్‌ వస్తే చాలు ప్రభుత్వం ఈ ఆర్థికసాయం చేస్తుంది. 

దీంతో విద్యానిధి పథకానికి జిల్లా ఎస్సీ విద్యార్థుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మొదట్లో రూ.10లక్షలు.. ఈ పథకం కింద ఒక్కో ఎస్సీ విద్యార్థి విదేశీ యూనివర్సిటీల్లో పీజీ చదివేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం విద్యానిధి పథకం కింద మొదట్లో రూ.10లక్షల ఆర్థికసాయం అందించింది. అయితే రూ.10లక్షలు సరిపోక అప్పులు చేయాల్సి వచ్చిన పరిస్థితి రావడంతో పెద్దగా విదేశాల్లో చదివేందుకు ఎస్సీ విద్యార్థులు పెద్దగా ముందుకు రాలేదు. 

అయితే ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం మళ్లీ పథకం నిబంధనలు సడలించింది. కుటుంబ ఆదాయం రూ.5లక్షలకు పెంచడంతోపాటు విదేశీ విద్యకు అందించే ఆర్థికసాయాన్ని రూ.20లక్షలు చేసింది. దీంతో జిల్లాకు చెందిన ఎస్సీ విద్యార్థులు విదేశీ విద్యకోసం వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

మార్కుల ఆధారంగా దరఖాస్తులు.. 
విదేశాల్లో ఉన్నత చదువులు చదివేందుకు పరీక్షలు రాసి సీటు పొందితే ఆ మార్కుల ఆధారంగా షెడ్యూల్డ్‌ కులాల శాఖలో దరఖాస్తు చేసుకున్నవారిని అన్ని ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రభుత్వం విదేశీ విద్యనభ్యసించేందుకు ఆర్థికసాయం అందిస్తుంది. ప్రధానంగా యూఎస్‌ఏ, యూకే, ఆస్ట్రేలియా దేశాల్లోని యూనివర్సిటీల్లో చదివేందుకు ఎక్కువ మొగ్గుచూపుతున్నారు. 

ఇప్పటి వరకు 35 మందికి.. 
ప్రభుత్వం 2015లో విదేశీ విద్యకోసం అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎస్సీ విద్యార్థులు 65 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరి అర్హతలు పరిశీలించి ఇంటర్వ్యూలు నిర్వహించి 35 మందిని ఎంపిక చేసి ఆర్థికసాయం అందించారు. ప్రస్తుతం వారంతా వివిధ దేశాల యూనివర్సిటీల్లో ఉన్నత చదువులు చదువుతున్నారు. కాగా 2021లో అత్యధికంగా తొమ్మిది మంది విద్యార్థులు విదేశీ విద్యకు ఎంపిక కావడం గమనార్హం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top