‘స్వగృహ’కు స్వస్తి | Telangana Govt Decision to sell unfinished houses and lands | Sakshi
Sakshi News home page

‘స్వగృహ’కు స్వస్తి

Feb 7 2024 5:56 AM | Updated on Feb 7 2024 5:56 AM

Telangana Govt Decision to sell unfinished houses and lands - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజీవ్‌ స్వగృహకు స్వస్తి చెప్పే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది.  కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో వివిధ దశల్లో ఉన్న గృహ నిర్మాణ ప్రాజెక్టులు, భూములను అమ్మేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని అమ్మితే రూ.3500 కోట్లు సమకూర్చుకునే అవకాశముందని ప్రభుత్వం తేల్చినట్టు తెలిసింది. కొన్ని ఖాళీ భూములు వివాదంలో ఉండగా, మిగతావి అమ్మ కానికి సిద్ధంగా ఉన్నాయి. బండ్లగూడ, పోచారం ప్రాజెక్టులు సహా మరికొన్ని చోట్ల ఉన్న అసంపూర్తి ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా వ్యక్తులకుగానీ, గంపగుత్తగా సంస్థలకు గానీ అమ్మేయనున్నారు. వివిధ దశల్లో అసంపూర్తిగా ఉన్నందున ప్రస్తుతం ఆ ఇళ్లకు, ఖాళీగా ఉన్న భూములకు ప్రస్తుత మార్కెట్‌ ప్రకారం ఏ ధర నిర్ణయించాలో తేల్చేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదిక తర్వాత విక్రయ ప్రక్రియ ప్రారంభమవుతుంది.  

అప్పుడే అమ్మిఉంటే.. 
బండ్లగూడ, పోచారంలలో 6 వేలకుపైగా ఇళ్లను ఫ్లాట్ల రూపంలో గతంలో రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ విక్రయించింది. పూర్తిస్థాయిలో సిద్ధమైన ఇళ్లు అప్పట్లో హాట్‌కేకులుగా అమ్ముడుపోయాయి. కానీ, నాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఆ కార్పొరేషన్‌ పూర్తిగా గతి తప్పింది. రాజకీయ నేతలు, కొందరు ఉన్నతాధికారులు కుమ్మక్కయి అక్రమాలకు పాల్పడి నిధులు దారి మళ్లించారు. ఫలితంగా చేతిలో డబ్బు లేక మిగతా ఇళ్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేయలేకపోయారు. ఈ నెపాన్ని నాటి స్వగృహ కార్పొరేషన్‌ అధికారులపై నెట్టేసి ఉన్నతాధికారులు, నేతలు చేతులు దులుపుకున్నారు. తర్వాతి ప్రభుత్వాలు ఆ ఇళ్లను పట్టించుకోలేదు.

అన్నింటిని సిద్ధం చేసి ఉంటే మంచి ధరలకు అమ్ముడుపోయి, కార్పొరేషన్‌కు నిధులు సమకూరి ఉండేవి. వాటితో మిగతా చోట్ల పనులు జరిపితే అవి కూడా అమ్ముడుపోయేవి. కానీ ఆ చొరవ లేక కార్పొరేషనే దివాలా తీసింది. ఏడాదిన్నర క్రితం ఉన్నవి ఉన్నట్టుగా హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో విక్రయించారు. బండ్లగూడ, పోచారంలలో మూడు వేల ఫ్లాట్ల విక్రయం ద్వారా రూ.700 కోట్లు సమకూరాయి. తొర్రూరు, బహదూర్‌పల్లిలతో పాటు ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్‌లాంటి కొన్ని జిల్లాల్లో  లేఔట్ల రూపంలో ప్లాట్లు, నల్లగొండ లాంటి ప్రాంతాల్లో కొన్ని అసంపూర్తి ఇళ్లు విక్రయించడం ద్వారా మరో రూ.1300 కోట్లు వచ్చాయి.   

► ఇప్పుడు బండ్లగూడ, పోచారంలలో ఇంకా 700 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. బండ్లగూడలో సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు 80,  పోచారంలో సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు 300, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు 280 వరకు ఉన్నాయి. కొన్ని ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కూడా ఉన్నాయి. వీటిని ఉన్నవి ఉన్నట్టుగా విక్రయించనున్నారు. 
► రాష్ట్రవ్యాప్తంగా పది ప్రాంతాల్లో ఖాళీ స్థలాలున్నాయి. వీటిని గతంలోలాగా లేఔట్లుగా అభివృద్ధి చేసి విక్రయించాలా, గంపగుత్తగా ఎకరాలుగా విక్రయించాలా అన్న విషయాన్ని కమిటీ పరిశీలిస్తోంది. 
► గాజులరామారం, బహదూర్‌పల్లి, జవహర్‌నగర్‌లాంటి ప్రాంతాల్లో భారీ భవన సముదాయాలు అసంపూర్తిగా ఉన్నాయి. వాటిని పూర్తిచేస్తే కొనేందుకు జనం సిద్ధంగా ఉన్నారు.  
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీ స్థలాల్లో కాలనీలు నిర్మించినా డిమాండ్‌ ఏర్పడే పరిస్థితి ఉంది. ఇటీవల ఇదే విషయాన్ని కొందరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయితే పెట్టుబడి సమకూర్చటమే ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. దీంతో ఇళ్లను నిర్మించి విక్రయించాలన్న స్వగృహ కార్పొరేషన్‌ ప్రాథమిక విధానానికి విరుద్ధంగా ఉన్న భూములను అమ్మి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం దాదాపు ఓ నిర్ణయానికి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌కు ఇది మంగళం పాడే నిర్ణయంగానే ఉన్నట్టు కనిపిస్తోంది.      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement