వ్యాధుల నివారణ, చికిత్స హెల్త్‌ ప్రొఫైల్‌తోనే సాధ్యం 

Telangana Government Take Up Health Profile Project Two Districts Pilot Basis - Sakshi

ప్రాజెక్టు పురోగతిపై కేటీఆర్‌ నేతృత్వంలోని మంత్రుల బృందం సమీక్ష 

ప్రయోగాత్మకంగా ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో అమలు 

ఇళ్ల వద్దే మూత్ర, రక్త పరీక్షలు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజలకు సంబంధించి కనీస ఆరోగ్య సమాచారాన్ని సేకరించడం ద్వారా వివిధ శాఖల పరిధిలో మెరుగైన ప్రణాళికలు రూపొందించే అవకాశం ఉంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రాజెక్టు ద్వారా ప్రజల ఆరోగ్య సమాచారాన్ని సేకరించి, విశ్లేషించడం ద్వారా వివిధ జిల్లాల్లో ఉన్న వ్యాధులు, సీజనల్‌ వ్యాధుల తీరుతెన్నులను గుర్తించే వీలు కలుగుతుందని చెప్పారు. హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రాజెక్టును ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపడుతున్న నేపథ్యంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌తో కలసి గురువారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ సమీక్షించారు. వైద్య, ఆరోగ్య, ఐటీ శాఖల ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రాజెక్టు ద్వారా సేకరించే సమాచారం ఆధారంగా చికిత్స, నివారణకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టే వెసులుబాటు కలుగుతుందని చెప్పారు.

రోడ్డు ప్రమాదాల వంటి అత్యవసర సమయాల్లో చికిత్స అందించేందుకు ప్రజారోగ్యంపై సేకరించే ప్రాథమిక సమాచారం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ రెండు జిల్లాల్లోని వైద్య, ఆరోగ్య సిబ్బంది సహకారంతో ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని ముఖ్యంగా రక్తపోటు, మూత్ర, రక్త పరీక్షలను ప్రజల ఇళ్ల వద్దే నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎవరికైనా అదనంగా ఇతర వైద్య పరీక్షలు అవసరమైతే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తెలంగాణ డయాగ్నొస్టిక్‌ సెంటర్ల సేవలను వినియోగించుకుంటామని వెల్లడించారు. ఆరోగ్య పరీక్షల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన సిబ్బంది, పరికరాలను అందుబాటులోకి తెస్తామన్నారు. హెల్త్‌ ప్రొఫైల్‌ను రికార్డు చేసిన ఈస్టోనియా వంటి దేశాల నమూనాలను కూడా అధ్యయనం చేయాలని కేటీఆర్‌ సూచించారు. హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రాజెక్టు కోసం మారుమూల ములుగు జిల్లాను ప్రయోగాత్మకంగా ఎంపిక చేయడంపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ హర్షం వ్యక్తం చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top