Groups Exams Marks: గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 కు ఇంటర్వ్యూ మార్కులూ తొలగింపు!

Telangana Government Plans To Reduce Marks In Group 1, Group 2 Exams - Sakshi

ఇంటర్వ్యూ రద్దుతో ఆ మేర మార్కులు తగ్గించే యోచన

900 మార్కులతో గ్రూప్‌–1,  600 మార్కులతో గ్రూప్‌–2 పరీక్షలు 

పరీక్ష విధానంలో మార్పులు కొలిక్కి 

గురుకుల కొలువుల్లో డెమో విధానానికీ స్వస్తి 

సాక్షి, హైదరాబాద్‌:  ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలకు స్వస్తి పలికిన రాష్ట్ర ప్రభుత్వం.. పరీక్షల్లో ఆ మేర మార్కులనూ తగ్గించాలని భావిస్తోంది. ఇప్పటివరకు అన్ని పేపర్లతోపాటు ఇంటర్వ్యూ మార్కులు కలిపి ఉండే గరిష్ట మార్కులు ఉండగా.. ఇక ముందు కేవలం రాతపరీక్షల మొత్తమే గరిష్ట మార్కులు కానున్నాయి. ఈ క్రమంలో గ్రూప్‌–1 పరీక్ష మొత్తంగా 900 మార్కులకు, గ్రూప్‌–2 పరీక్ష మొత్తంగా 600 మార్కులకే ఉండనున్నాయి. ఈ మేరకు నియామక సంస్థలు పరీక్షా విధానానికి సంబంధించిన ప్రక్రియను దాదాపు కొలిక్కి తీసుకువచ్చాయి. 
చదవండి👉వీఆర్‌ఏల ఆగం బతుకులు.. కార్లు కడుగుడు.. బట్టలు ఉతుకుడు

రాతపరీక్షే ఆధారం.. 
గ్రూప్‌–1, గ్రూప్‌–2 కొలువులకు, వైద్యారోగ్య సంస్థల్లో మెడికల్‌ ఆఫీసర్, ఆపైస్థాయిలో నేరుగా చేపట్టే నియామకాలకు ఇంటర్వ్యూలు, గురుకుల విద్యాసంస్థల్లో బోధన పోస్టులకు సంబంధించి డెమో రౌండ్‌ ఇప్పటివరకు కీలకంగా ఉండేవి. నియామకాల్లో జాప్యాన్ని నివారించడం, అవకతవకలకు అవకాశం లేకుండా చేయడం కోసం వీటిని రద్దుచేసి, రాతపరీక్షల ఆధారంగానే నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆయా ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష విధానంలో మార్పులపై నియామక సంస్థలు దృష్టి సారించాయి. ఇంటర్వ్యూలను రద్దు చేయడంతోపాటు వాటికి సంబంధించిన మార్కులను కూడా తొలగిస్తేనే మంచిదన్న ప్రతిపాదన చేశాయి. దీనిపై తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. 

తగ్గనున్న మార్కులు 
► ఇదివరకు గ్రూప్‌–1 పరీక్షను మొత్తంగా 1000 మార్కులకు నిర్వహించేవారు. అందులో 900 మార్కులకు వివిధ రాతపరీక్షలు, ఇంటర్వ్యూకు 100 మార్కులు ఉండేవి. ఇక గ్రూప్‌–2 పరీక్షను 675 మార్కులకు నిర్వహించగా.. అందులో 75 మార్కులు ఇంటర్వ్యూలకు ఉండేవి. ఇప్పుడు ఇంటర్వ్యూల మార్కులను తొలగిస్తే.. గ్రూప్‌–1 పరీక్ష 900 మార్కులకు, గ్రూప్‌–2 పరీక్షను 600 మార్కులకే నిర్వహించే అవకాశం ఉంది. 
► ప్రస్తుతం గురుకుల విద్యాసంస్థల్లో పీజీటీ, జూనియర్‌ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్‌ నియామకాల్లో రాతపరీక్షలతోపాటు డెమో (ప్రత్యక్ష బోధన పరీక్ష) ఉంది. ప్రభుత్వం గ్రూప్స్‌ పరీక్షలకు ఇంటర్వ్యూలను తొలగించడంతో డెమో విధానానికి స్వస్తి పలకాలని అధికారులు భావిస్తున్నారు. 
► ఇప్పటివరకు వైద్యారోగ్య విభాగంలోని కొన్నిపోస్టులకు కేవలం ఇంటర్వ్యూల ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేస్తూ వచ్చారు. ఈసారి ఆయా పోస్టుల నియామకాలకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టడంపై బోర్డు కసరత్తు చేస్తోంది. 

సిలబస్‌లో మార్పులు లేనట్టే! 
ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూల రద్దుతో పరీక్ష విధానంలో మార్పులు అనివార్యమయ్యాయి. అయితే పరీక్షల సిలబస్‌లో మార్పులు అవసరం లేదని నియామక సంస్థలు భావిస్తున్నాయి. అయితే ఇంటర్వ్యూలు తొలగించినందున.. ఆయా సామర్థ్యాలకు సంబంధించిన అంశాలను రాతపరీక్షలో చేర్చే ప్రతిపాదన కూడా ఉంది. 
చదవండి👉 ఇంటర్వ్యూ రద్దుతో ‘రాత’ మారేనా!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top