ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి
శాస్త్రిపురం నుంచి చింతల్‌మెట్ వరకు వంతెన
రూ.319 కోట్ల నిర్మాణ వ్యయం అంచనా
పర్యాటక కేంద్రంగా మీరాలం అభివృద్ధికి ప్రణాళికలు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలోని మీరాలం చెరువును మిలమిలలాడే పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారీ అభివృద్ధి ప్రణాళికలతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా మీరాలం ట్యాంక్‌పై ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. బెంగళూరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్–44) వద్ద శాస్త్రిపురం నుంచి చింతల్‌మెట్ వరకు ఐకానిక్ బ్రిడ్జ్‌ను నిర్మించనున్నారు. 2.5 కిలో మీటర్ల మేర నాలుగు లైన్ల మేర ఈ బ్రిడ్జి ఉంటుంది. వంతెన నిర్మాణ పనులను కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్ బిడ్డింగ్ దక్కించుకుంది. రూ.319 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జ్‌ను నిరి్మంచనున్నారు. ఈ మేరకు ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) విధానంలో చేపట్టనున్న ఈ బ్రిడ్జ్ టెండర్‌కు మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్‌డీసీఎల్) ఆమోదించింది.
గార్డెన్ ఆఫ్ బే తరహాలో..
మీరాలం ట్యాంక్‌పైన నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జ్‌ను సింగపూర్‌లోని గార్డెన్స్ ఆఫ్ బే తరహాలో నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. వంతెన సందర్శకులకు భద్రతతో పాటు దృశ్యపరంగా ఆకర్షణీయంగా నిర్మించనున్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు పక్కనే ఉన్న రెండు దీవులను అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో బర్డ్ ప్యారడైజ్, వాటర్‌ఫాల్స్, అనువైన కన్వెన్షన్ సెంటర్లు, అడ్వెంచర్ పార్క్, థీమ్ పార్క్, యాంపీ థియేటర్‌లతో ఈ దీవులను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. మీరాలం ట్యాంక్‌లో ఒకటి 5 ఎకరాలు, మరోటి 2.5 ఎకరాల విస్తీర్ణంలో రెండు దీవులు ఉన్నాయి. గతంలో ఇందులో రాష్ట్ర పర్యాటక శాఖ బోట్‌లను సైతం నడిపేది. మీరాలం ట్యాంక్‌ను నెహ్రూ జులాజికల్ పార్క్‌తో అనుసంధానించి..జూ గుండా మీరాలం ట్యాంక్‌కు మళ్లీ బోట్లను నడపాలని, దీవులను అభివృద్ధి చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఇదీ మీరాలం చరిత్ర
జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లను నిర్మించక ముందు భాగ్యనగరవాసుల దాహార్తిని మీరాలం ట్యాంక్ రిజర్వాయర్ తీర్చేది. హైదరాబాద్ రాష్ట్ర మూడో నిజాం అసఫ్ జాహీ–2 హయాంలో అప్పటి హైదరాబాద్ పాలకుడు (1804–1808) మీర్ ఆలం బహదూర్ పేరును ఈ రిజర్వాయర్‌కు పెట్టారు. 1804 జులై 20న మీర్ ఆలం రిజర్వాయర్ నిర్మాణానికి పునాది వేశారు. దాదాపు రెండేళ్లలో 1806 జూన్ 8న నిర్మాణం పూర్తయింది.
ఐకానిక్ బ్రిడ్జి ఇలా.. పొడవు: 2.5 కిలో మీటర్లు
వెడల్పు: 16.5 మీటర్లు (నాలుగు లైన్లు) ఎక్కడి నుంచి ఎక్కడికి: బెంగళూరు జాతీయ రహ దారి వద్ద శాస్త్రిపురం నుంచి చింతల్‌మెట్ వరకు.. ఎవరికి ప్రయోజనం: ఈ వంతెనతో దక్షిణ హైదరాబాద్ వైపు ప్రయాణం సులువవుతుంది. సుమారు లక్ష మంది ప్రయాణికులకు ఈ వంతెన ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఎంఆర్‌డీసీఎల్ అధికారులు అంచనా వేస్తున్నారు.


