Telangana TET: టెట్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌! ఒక్కసారి రాస్తే చాలు..

Telangana Government Approved TET Certificate Valid For Lifetime - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టెట్‌కు సంబంధించి ఇటీవల మంత్రుల కమిటీ చేసిన కొన్ని సవరణలను ప్రభుత్వం ఆమోదించింది. గతం లో టెట్‌లో సాధించిన అర్హత కాలపరిమితి ఏడేళ్లుగా ఉండేది. దీన్ని ఇప్పుడు జీవితకాలానికి పొడిగించారు. జాతీయ ఉపాధ్యాయ మండలి (ఎన్‌సీటీఈ) రెండేళ్ళ క్రితం ఈ మేరకు మార్పులు చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అనుగుణంగా మార్పులు చేసింది. దీని ప్రకారం 2011 ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఆ మార్పు వర్తిస్తుంది. అంటే అప్పటినుంచి జరిగిన టెట్‌లో అర్హత సాధించిన వారి ధ్రువపత్రం ఇప్పుడూ చెల్లుబాటు కానుంది. రాష్ట్రంలో ఇప్పటికే టెట్‌ పాసైనవారు సుమారు 3 లక్షల మంది ఉంటారని అంచనా. 

జూన్‌ 12న టెట్‌
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ను జూన్‌ 12వ తేదీన నిర్వహించనున్నట్టు ప్రభుత్వం గురువారం తెలిపింది. ఇందుకు సంబంధించిన నోటి ఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకూ ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్య (ఎస్‌సీఈఆర్‌టీ) డైరెక్టర్‌ రాధారెడ్డి సంబంధిత ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సమగ్ర వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ను ఈ నెల 25వ తేదీన ‘టీఎస్‌టెట్‌. సీజీజీ.జీవోవీ.ఇన్‌’వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. 

కాగా టెట్‌ను 150 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు 90 మార్కులు (60 శాతం), బీసీలకు 75 మార్కులు (50 శాతం), ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు 60 మార్కులు (40 శాతం) వస్తే అర్హత సాధించినట్లుగా పరిగణిస్తారు. పేపర్‌–1 పరీక్ష ఉదయం 9.30 నుంచి 12.00 వరకు, పేపర్‌–2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు జరుగుతుంది. 
(చదవండి: వరంగల్ ఎన్ఐటీకి ఉద్యోగాల పంట.. అత్యధిక ప్యాకేజీ 62.5 లక్షలు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top