భూముల డిజిటల్‌ సర్వేకు ప్రత్యేక నెట్‌వర్క్‌

Telangana Government Apply Gps And Vrs For Digital Land Survey - Sakshi

భూముల హద్దులతోపాటు విస్తీర్ణం ఖరారు చేసేందుకే... 

భూ సమస్యలకు పరిష్కారం..
రెవెన్యూ శాఖ ప్రతిపాదించిన విధంగా  ప్రత్యేక నెట్‌ వర్క్‌ ఏర్పాటు చేసి భూమి పార్శిళ్ల విస్తీర్ణాన్ని నిర్ధారిస్తే చాలా వరకు భూముల సర్వేకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కావడంతోపాటు నిజాం కాలం నాటి రికార్డుల సవరణ కూడా చేయాల్సి ఉంటుంది.

పక్కాగా వివరాలు..
 ఇలా చేస్తే సర్వే నంబర్ల వారీగా సబ్‌ డివిజన్ల పరిధిలోని భూముల విస్తీర్ణం నిర్ధారణ అవుతుంది. ఏ సర్వే నంబర్‌లో ఎంత భూమి ఉందో తేలి పోనుంది. దీని ఆధారంగానే కొత్త రికార్డులు తయారు చేయాల్సి ఉంటుంది. అంటే భూములకు టైటిల్‌ గ్యారంటీ ఇవ్వడమే.

చిక్కుముళ్లూ ఉన్నాయి..
ఒకవేళ ప్రభుత్వం ప్రత్యేక నెట్‌వర్క్‌ ఏర్పాటు ద్వారా భూముల విస్తీర్ణాన్ని తేలిస్తే క్షేత్రస్థాయిలో సమస్యలు వస్తాయి. తన పాస్‌ పుస్తకంలో ఉన్న వివరాల మేరకు గుంట భూమి తగ్గినా రైతు అంగీ కరించడు. పెరిగిన విస్తీర్ణం మేరకు జరి గేందుకు సరిహద్దు రైతులు ఒప్పుకోరు.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో భూవివాదాల సమస్యకు శాశ్వతంగా తెరదించడంతోపాటు భూ రికార్డుల తారుమారుకు వీల్లేని విధంగా భూముల డిజిటల్‌ సర్వే చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం... ఇందులో భాగంగా భూముల హద్దులే కాకుండా వాటి విస్తీర్ణాన్నీ ఖరారు చేయాలనే యోచనతో ముందుకెళ్తోంది. ఇందుకోసం రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక కసరత్తు చేస్తోంది. డిజిటల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ (డీజీపీఎస్‌) విధానంలో కేవలం భూముల హద్దులు (బౌండరీలు) మాత్రమే నిర్ధారించగలమని, ఆయా భూముల విస్తీర్ణం తేల్చలేమని భావిస్తున్న రెవెన్యూ శాఖ... ఇందుకోసం ప్రత్యేక నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. విజువల్‌ రిఫరెన్స్‌ స్టేషన్స్‌ (వీఆర్‌ఎస్‌)–గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ (జీపీఎస్‌) పరిజ్ఞానాలను ఉపయోగించి రూపొందించే ఈ నెట్‌వర్క్‌తో గ్రౌండ్‌ కంట్రోల్‌ పాయింట్ల (జీసీపీ)ను అనుసంధానించాల్సి ఉంటుందని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇందుకోసం డ్రోన్లను ఉపయోగించి తీసిన భూముల చిత్రాలను వాడాలని నివేదికలో పేర్కొంది. 

ప్రస్తుత విధానంలో సాధ్యం కాదు... 
డిజిటల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ (డీజీపీఎస్‌) విధానంలో ప్రస్తుతమున్న భూమి హద్దులను అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా గుర్తించగలమని రెవెన్యూ (సర్వే) శాఖ అంటోంది. వాటి ఆధారంగా భూముల విస్తీర్ణం తేల్చడం సాధ్యం కాదని, ఇందుకోసం 2డీ సాంకేతిక పరిజ్ఞానంతో అక్షాంశ, రేఖాంశాల ఉపరితల కొలతలను లెక్కకట్టాల్సి ఉంటుందని చెబుతోంది. ఇలా లెక్క కట్టేందుకు అనుభవం, నైపుణ్యంగల సర్వేయర్లు పెద్ద సంఖ్యలో అవసరం అవుతారని, అంత మంది సర్వేయర్లను సమకూర్చుకోవడం సాధ్యం కాదని తేల్చింది. ఒకవేళ అలా లెక్కకట్టినా నిజాం కాలంలో తయారైన రికార్డుల్లో ఉన్న భూ విస్తీర్ణం కంటే ఈ కొలతల ద్వారా తేల్చే విస్తీర్ణం తక్కువ వస్తుందని అంచనా వేస్తోంది. అప్పుడు రికార్డులన్నింటినీ సవరించాల్సి ఉంటుందని, ఇందుకు చాలా ఖర్చు అవడంతోపాటు సమయం వృథా అవుతుందని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వివరించింది. 

తరుణోపాయం ఏమిటి?   
ఈ నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై తర్జనభర్జనలు పడిన రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి 3డీ డిజిటల్‌ టెర్రయిన్‌ మోడల్‌ను తయారు చేసింది. ఈ పద్ధతిలో ఉపయోగపడేలా 10 సెంటీమీటర్ల ప్రాదేశిక స్పష్టత వచ్చే విధంగా డ్రోన్‌ల ద్వారా భూముల చిత్రాలను సేకరించింది. ఈ చిత్రాలను వర్చువల్‌ గ్రౌండ్‌ పాయింట్లుగా పరిగణనలోకి తీసుకోనుంది. ఈ చిత్రాల జియో రిఫరెన్స్‌ ద్వారా భూముల సరిహద్దు పాయింట్లను 5 సెంటీమీటర్లకు అటుఇటుగా నిర్ధారించనుంది. ప్రతి గ్రామంలోని భూముల విస్తీర్ణ హద్దులు చెరిగిపోకుండా ట్రై, బై జంక్షన్లను తయారు చేసి వాటిని జీసీపీలుగా, రెఫరెన్స్‌ స్టేషన్లుగా ఉపయోగించుకోనుంది. ఇప్పటికే డిజిటల్‌ సర్వే కోసం ఎంపిక చేసిన పైలట్‌ గ్రామాల్లో ఈ విధానం ద్వారా గ్రౌండ్‌ కంట్రోల్‌ పాయింట్ల (జీసీపీ) కోఆర్డినేట్లను నిర్ధారించింది. ఇప్పుడు ఈ జీసీపీలను ప్రత్యేక నెట్‌వర్క్‌తో అనుసంధానించడం ద్వారా హద్దుల అక్షాంశ, రేఖాంశాలను గుర్తించడమే కాక భూ విస్తీర్ణం లెక్కలను కూడా తేల్చనుంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top