జస్టిస్‌ సీతారాంరెడ్డి కన్నుమూత

Telangana: Former Justice Adduri Seetharam Reddy Passed Away - Sakshi

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌)/ఉండవెల్లి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్త, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అద్దూరి సీతారాంరెడ్డి (94) గురువారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. బుధవారం రాత్రి అస్వస్థత కారణంగా ఆయనను ఆస్పత్రికి తరలించారు. కొంత కాలంగా ఆయన వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపూర్‌లో 1928 మార్చి 20వ తేదీన చిన్నారెడ్డి, వెంకట్రామమ్మ దంపతులకు జన్మించిన సీతారాంరెడ్డికి భార్య మనోరమాదేవి, నలుగురు కుమార్తెలు ఉన్నారు. నిజాం కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ చేసిన ఆయన లండన్‌లో న్యాయవాద విద్యను అభ్యసించారు. 1978 నుంచి 90 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందించారు. 1990 నుంచి 95 వరకు లోకాయుక్తగా పనిచేశారు.

అలాగే 1989 నుంచి 96 వరకు ఆర్‌బీవీఆర్‌ఆర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ప్రముఖ న్యాయవేత్త పాల్కీవాలా వద్ద ఆయన జూనియర్‌గా వృత్తిని ప్రారంభించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం లా కాలేజీలో లెక్చరర్‌గా కూడా పని చేశారు. 1968లో ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడిగా కొనసాగిన ఆయన 1974లో హైకోర్టులో ప్రభుత్వ ప్లీడర్‌గా పని చేశారు.

ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య, జస్టిస్‌ సుభాష్‌ రెడ్డి, మాజీ మంత్రి సమరసింహారెడ్డి, జస్టిస్‌ యతిరాజులు, జస్టిస్‌ వెంకట్రామిరెడ్డి, విశ్రాంత అడ్వకేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా వీ.ఆర్‌.రెడ్డి, జస్టిస్‌ జీవన్‌రెడ్డి ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. గురువారం సాయంత్రం మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top