
ఫైలుపై తొలి సంతకం చేస్తున్న మంత్రి తుమ్మల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పామాయిల్ సాగుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని.. ఆయిల్ పామ్ సాగు రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతాంగం ఆయిల్ పామ్ సాగువైపు మొగ్గుచూపేలా అధికార యంత్రాంగం దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం ఆయన సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మూడు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొత్తం 5 ఆయిల్ పామ్ పరిశ్రమలు నెలకొల్పే ఫైలుపై తొలి సంతకం చేశారు.
రూ. 1,050 కోట్లతో ఈ పరిశ్రమలను స్థాపించనున్నారు. తర్వాత రాష్ట్రంలోని 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేలా రూ. 4.07 కోట్లతో సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని తీర్చిదిద్దేందుకు అవసరమైన రెండో ఫైలుపై సంతకం చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తలతో రైతులకు తరచూ అవగాహన సదస్సులు నిర్వహించేందుకు వీలుగా రైతు వేదికలను తీర్చిదిద్దుతామన్నారు.
సహకార వ్యవస్థలో పారదర్శకమైన పాలన అందించేందుకు వివిధ విభాగాలను పూర్తిగా కంప్యూటరీకరణ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకునేలా.. మంత్రి మూడో ఫైలుపై సంతకం చేశారు. ఈ సందర్భంగా గద్వాలకు చెందిన పట్టు పరిశ్రమశాఖ అధికారి జగన్నాథ్ కుమారుడు ఆశిష్ కుమార్‌కు కారుణ్య నియామకం కింద ఉద్యోగం కలి్పస్తూ నియామక పత్రం అందజేశారు.
తర్వాత అధికారులతో తుమ్మల మాట్లాడుతూ.. రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో ఏడాదికి ఒకటి చొప్పున పామాయిల్ పరిశ్రమలను ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో నెలకొల్పుతామన్నారు. పామాయిల్ సాగు విస్తరణకు ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లుల స్థాపన ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పామాయిల్ ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాటుతో రైతులకు ఎళ్లవేళలా మార్కెట్ అందుబాటులోకి వస్తుందన్నారు.
సంప్రదాయ పంటలతో పోలిస్తే పామాయిల్ సాగుతో రైతులకు ఎకరాకు రూ. లక్ష వరకు ఆదాయం సమకూరుతుందన్నారు. అలాగే అంతరపంటలతో అదనపు ఆదా యం లభిస్తుందన్నారు. ఆయిల్ ఫెడ్ ఏటా 40 వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు పెంచేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తుమ్మల తెలిపారు.