
మార్కెటింగ్‌తో పాటు ఉపాధి.. ఆదాయం
ఎస్‌హెచ్‌జీ సభ్యులకు ఊతం ఇస్తున్న వేదిక
నాణ్యమైన ఉత్పత్తులతో రెండు నెలల్లో లాభాల బాట
రాష్ట్రంలోనే తొలి మహిళా మార్ట్ ఖమ్మంలో ఏర్పాటు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన నాణ్యమైన ఉత్పత్తుల అమ్మకానికి ఖమ్మంలోని మహిళామార్ట్ వేదికగా నిలుస్తోంది. ఏళ్లుగా సభ్యులు ఉత్పత్తులను తయారుచేస్తున్నా.. సరైన మార్కెటింగ్ లేక నష్టపోయారు. వివిధ ప్రాంతాల్లో స్టాళ్లు ఏర్పాటుచేసినా ప్రదర్శనకే పరిమితమయ్యారు. కానీ కార్పొరేట్ తరహాలో ఖమ్మంలో మహిళా మార్ట్ ఏర్పాటవడంతో వారి కష్టాలు తీరాయి.
జిల్లాలోని అన్ని స్వయంసహాయక సంఘాల సభ్యుల ఉత్పత్తులను ఒకే చోట విక్రయించేలా ఈ మార్ట్‌ను తీర్చిదిద్దారు. రాష్ట్రంలో ఈ తరహా మార్ట్ ఏర్పాటు కావడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది మే 28న ఈ మార్ట్ మొదలుకాగా.. రెండు నెలల్లోనే వ్యాపారం దాదాపు రూ.17 లక్షలు దాటింది. దీని ద్వారా ఆరు ఎస్‌హెచ్‌జీల సభ్యులకు ఉపాధి లభించడమే కాక మిగతా సంఘాల సభ్యులు తయారుచేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సులువవుతోంది.
గత కలెక్టర్ ఆలోచనతో..
జిల్లాలోని ఎస్‌హెచ్‌జీల సభ్యులు గ్రామీణ ప్రాంతా ల్లో లభ్యమయ్యే ముడిసరుకుతో ఉత్పత్తులను తయా రు చేస్తుండగా మార్కెటింగ్ లేక, పెట్టుబడి కూడా రాక నిరాశకు లోనయ్యారు. ఇదే అదనుగా కొందరు వీరి నుంచి తక్కువ ధరకు ఉత్పత్తులను కొనుగోలు చేసి హైదరాబాద్ వంటి నగరాల్లో అధిక ధరకు విక్రయించే వారు. ఈనేపథ్యంలో గత కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్.. మహిళామార్ట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రూ.30 లక్షల సెర్ప్ నిధులతో పాత భవనాన్ని ఆధునికీకరించి మహిళా మార్ట్ ఏర్పాటు చేయించడంతో వీరి వ్యాపారాలకు ఆదరణ లభిస్తోంది.
15 రోజులకోసారి చెల్లింపులు
స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులు తమ ఉత్పత్తులను ఇక్కడికి తీసుకొస్తే.. వాటిని పరిశీలించి నాణ్యత ఆధారంగా ధర నిర్ణయిస్తారు. ఆపై మహిళా మార్ట్ స్టిక్కర్‌తో విక్రయాలు చేస్తున్నారు. ఈ లావాదేవీలకు సంబంధించిన సొమ్ము జిల్లా సమాఖ్య ఖాతాలోకి వెళ్తుంది. ప్రతీ 15 రోజులకోసారి లెక్కలు తీసి.. మండల సమాఖ్యలకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఇచ్చేస్తారు. ఈ మహిళా మార్ట్‌లో ప్రస్తుతం 200కు పైగా ఉత్పత్తులను అమ్ముతున్నారు.
వందలాది కుటుంబాలకు ఊతం..
మహిళా మార్ట్ .. జిల్లాలోని వందలాది కుటుంబాలకు ఊతంగా మారింది. ఉత్పత్తులు నాణ్యంగా ఉన్నాయనే ప్రశంసలు వస్తుండటంతో మరిన్ని ఉత్పత్తులను అమ్మకానికి ఉంచాలని వినియోగదారులు కోరుతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మార్ట్‌లో ప్రతిరోజు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు విక్రయాలు జరుగుతున్నాయి. జూన్ నెలలో రూ.8 లక్షలు, జూలైలో రూ.8.50 లక్షల అమ్మకాలు జరగడం విశేషం.
శిక్షణ ఇచ్చి ఉద్యోగంలోకి
నేను ఇంటర్ చదవడంతో వ్యాపార నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. కంప్యూటర్‌లో వివరాల నమోదు, బిల్లుల జారీ, ప్యాకింగ్‌పై అవగాహన రావడంతో మహిళా మార్ట్ ప్రారంభమయ్యాక పిలిపించారు. ఇక్కడ కూడా మరికొంత శిక్షణ ఇచ్చి ఉద్యోగంలో చేర్చుకున్నారు. – అరవికట్ల వసంత, వేపకుంట్ల, రఘునాథపాలెం మండలం
మహిళలకు మంచి అవకాశం
చదువుకుని ఇంట్లో ఖాళీగా ఉంటున్న నాకు ఉద్యోగం లభించింది. డిగ్రీ వరకు చదివిన నేను స్టాక్ రిసీవర్‌గా పని చేస్తున్నా. విక్రయాలు మరింత పెరిగితే ఇంకా ఎక్కువ మంది మహిళలు ఉపాధి పొందుతారు. – తుడుం త్రివేణి, నేలపట్ల, కూసుమంచి మండలం
నెలకు రూ.50 వేల సరుకులు ఇస్తున్నా
జొన్న మురుకులు, మిక్చర్, సజ్జ బూరెలు, జొన్న లడ్డూ, రాగి లడ్డూ్డ, కారప్పూస, అరిసెలు, రాగిచెక్కలు, సకినాలు, చేపలు, చికెన్ పచ్చళ్లు వంటి ఉత్పత్తులతో రూ.50 వేల విలువైన సరుకులు నెలనెలా మార్టుకు ఇస్తున్నా. గతంలో గిరాకీ ఉన్న చోటకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు తిరిగే ఇక్కట్లు తప్పాయి. – మద్దినేని పద్మ, తులశమ్మ సంఘం, గోపారం, కొణిజర్ల మండలం