ఎంసెట్‌లో ముందుగా ఏ పరీక్ష?

Telangana EAMCET 2021: Which Exam Conducted First - Sakshi

అగ్రికల్చర్‌ నిర్వహిద్దామా?

ఇంజనీరింగ్‌ నిర్వహిద్దామా? 

ఉన్నత విద్యా మండలి ఆలోచనలు

సాక్షి, హైదరాబాద్‌: ఎంసెట్‌లో ముందుగా అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించాలా? ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు పరీక్షను నిర్వహించాలా? అన్న విషయంలో ఉన్నత విద్యా మండలి ఆలోచనలు చేస్తోంది. ఐఐటీల్లో ప్రవేశాల కోసం జూలై 3న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్‌ చర్యలు చేపట్టింది. మరోవైపు రాష్ట్రంలో ఎంసెట్‌ పరీక్షలను జూలై 5 నుంచి 9 వరకు నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి తేదీలను ఖరారు చేసింది. 

సాధారణంగా అందులో ముందు 3 రోజుల పాటు (5, 6, 7 తేదీల్లో) ఆన్‌లైన్‌లో ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ను ఆరు సెషన్లలో (రోజుకు రెండు సెషన్లు) నిర్వహిస్తారు. విద్యార్థుల సంఖ్యను బట్టి అవసరమైతే 8న కూడా ఒక సెషన్‌ నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ ఎంసెట్‌ను 8, 9 తేదీల్లో నాలుగు సెషన్లలో నిర్వహిస్తారు. అయితే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు, ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ పరీక్షల ప్రారంభ తేదీకి మధ్య ఒక రోజు గడువే ఉంటోంది. దీంతో మ్యాథమెటిక్స్‌ విద్యార్థుల వెసులుబాటు కోసం ముందుగా ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ కాకుండా అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల కోసం ఎంసెట్‌ను నిర్వహించాలనే ఆలోచనలు చేస్తోంది ఉన్నత విద్యామండలి. 

అయితే నీట్‌ తేదీలను ప్రకటించాక తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. అప్పుడే అగ్రికల్చర్‌ ఎంసెట్‌ను ముందుగా నిర్వహించాలా? ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ను ముందుగా నిర్వహించాలా? అన్న విషయంలో ఎంసెట్‌ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. 

జూన్‌లో పాలీసెట్‌! 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలీసెట్‌ను ఈసారి జూన్‌లో నిర్వహించే అవకాశం ఉంది. సాధారణంగా పదో తరగతి పరీక్షలు పూర్తికాగానే ఏప్రిల్‌ చివరలో పాలీసెట్‌ను రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్‌బీటీఈటీ) నిర్వహిస్తోంది. అయితే ఈసారి పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ మే 17 నుంచి 26వ తేదీ వరకు ఉండటంతో పాలీసెట్‌ను జూన్‌లో నిర్వహించేలా ఎస్‌బీటీఈటీ కసరత్తు చేస్తోంది.   

చదవండి: 
తెలంగాణ ఎంసెట్ 2021‌ షెడ్యూల్‌ విడుదల

సింగరేణిలో 2087 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్‌...

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top