
9న రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. 15న సీట్ల కేటాయింపు
11 నుంచి బైపీసీ విభాగం తొలి విడత కౌన్సెలింగ్
21న తుది సీట్లు కేటాయింపు
24 నుంచి రెండో దశ కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: ఈఏపీసెట్(ఎంపీసీ) మూడో విడత (తుది) కౌన్సెలింగ్‌కు సోమవారం ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. మంగళవారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు రిజి్రస్టేషన్లు, 12 వరకు ధ్రువీకరణపత్రాల పరిశీలన, 13న వెబ్ ఆప్షన్ల ఎంపిక, 14న ఆప్షన్ల మార్పులు, 15న సీట్ల కేటాయింపు ఉంటాయని తెలిపింది. విద్యార్థులు ఈ నెల 15–17 మధ్య కళాశాలల్లో రిపోర్టు చేయాలని పేర్కొంది.
11 నుంచి ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ తొలి దశ కౌన్సెలింగ్..
ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ తొలి విడత కౌన్సెలింగ్ ఈ నెల 11వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ నెల 11 నుంచి 16 వరకు రిజిస్ట్రేషన్లు, 12 నుంచి 17 వరకు ధ్రువీకరణపత్రాల పరిశీలన, 13 నుంచి 18 వరకు వెబ్ ఆష్షన్ల ఎంపిక, 19న వెబ్ ఆప్షన్ల మార్పులు, చేర్పులు, 21న సీట్ల కేటాయింపు ప్రక్రియ ఉంటాయని వెల్లడించింది.
విద్యార్థులు ఈ నెల 21–23 మధ్య కాలేజీల్లో రిపోర్టు చేయాలని పేర్కొంది. రెండో దశ తుది కౌన్సెలింగ్ కోసం ఈ నెల 24 నుంచి 25 వరకు రిజిస్ట్రేషన్లు, ధ్రువపత్రాల పరిశీలన, ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ ఉంటాయని తెలిపింది. 26న ఆప్షన్ల మార్పులకు అవకాశం ఉంటుందని, 28న సీట్లు కేటాయిస్తామని, విద్యార్థులు ఈ నెల 29 నుంచి అక్టోబర్ 8వ తేదీలోపు కాలేజీల్లో రిపోర్టు చేయాలని వివరించింది. బైపీసీ విభాగం కౌన్సెలింగ్‌ను రెండు దశల్లోనే పూర్తి చేస్తున్నట్టు స్పష్టం చేసింది.
ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ సాగదీత
రాష్ట్రంలో ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ సాగదీత ధోరణిలో సాగుతోంది. కనీ్వనర్ కోటాలో 1,53,964 సీట్లు ఉండగా, మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌లలో 1,19,666 సీట్లు భర్తీ అయ్యాయి. రెండో దశ కౌన్సెలింగ్ గత నెల 14న ముగియగా, ఇప్పుడు మూడో దశ (తుది)కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. వాస్తవానికి రెండో దశలో కొత్తగా ప్రవేశాలు పొందినవారి సంఖ్య తక్కువగా ఉంది. తొలి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు వచి్చన వారికి సంబంధించి మార్పులు, స్లైడింగ్స్ మాత్రమే ఎక్కువగా రెండో విడతలో జరిగాయి.
కానీ, ప్రైవేటు కళాశాలల కోసం మూడో దశ కౌన్సెలింగ్‌కు సోమవారం ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. వాస్తవానికి ఇంజినీరింగ్ కేటగిరీ బీ, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ రావాల్సి ఉండగా.. ఇప్పటికే కళాశాలలు
రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేసి విద్యార్థులను చేర్చుకోవడం గమనార్హం.