మారుతున్న ప్రవేశ పరీక్షల తీరు
జేఈఈ మెయిన్స్‌లో వెల్లడైన వైనం..
ఏప్‌సెట్ ప్రశ్నల్లో కొత్త ట్రెండ్
2026 ఇంటర్ విద్యార్థులకు అగ్ని పరీక్ష
తెలుగు అకాడమీ కసరత్తు..గుణాత్మక విశ్లేషణ దిశగా ప్రశ్నావళి
కొత్త ట్రెండ్‌ను పసిగట్టని ఆన్‌లైన్ సిస్టమ్
జేఈఈలో తలనొప్పికి ఇదే కారణం
సాక్షి, హైదరాబాద్ : ప్రవేశ పరీక్షల తీరు మారుతోంది. ఈ ఏడాది నుంచే జేఈఈ మెయిన్స్‌లో ఇది కనిపిస్తోంది. రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ (ఏప్‌సెట్) ఉమ్మడి ప్రవేశ పరీక్షకు కొత్త సిలబస్ రాబోతోంది. 2026లో ఇంటర్ అడ్మిషన్ పొందినవారు కొత్త సిలబస్‌తోనే ఏప్‌సెట్ రాయాల్సి ఉంటుంది. తెలుగు అకాడమీ ఈ దిశగా కసరత్తు చేస్తోంది. ప్రవేశ పరీక్షల తీరుపై జాతీ య విద్యావిధానం (ఎన్‌ఈపీ) కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. ఈ నేపథ్యంలోనే జేఈఈ సిలబస్‌లో మార్పులు చేశారు. అన్ని రాష్ట్రాలూ ప్రవేశ పరీక్షల సిలబస్‌ను మారుస్తున్నాయి. విద్యార్థులకు సబ్జెక్టుపై పట్టు పెంచడం దీని ఉద్దేశమని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ స్పష్టం చేస్తోంది.
మూలం తెలిస్తేనే మార్కులు
పరీక్ష విద్యార్థి ఆలోచన విధానానికి అద్దం పట్టేలా ఉండాలన్నది ఎన్‌ఈపీ అభిప్రాయం. విద్యార్థిలో శోధనాశక్తి పెంచేలా ప్రశ్నలు ఉండాలని పేర్కొంది. దీన్ని అనుసరించే జేఈఈ ప్రశ్నావళిలో ప్యాటర్న్, మార్కింగ్, సెక్షన్లు, ప్రశ్నల రకంలో మార్పులు తెచ్చారు. మల్టీపుల్ చాయిస్ క్వశ్చన్స్ (ఎంసీక్యూ)లో ఆప్షన్లలో అనేక మార్పులు చేశా రు. ఆప్షన్లన్నీ ఒకే రకంగా ఉండేలా చూస్తున్నారు. దీంతో చాప్టర్ మూల సిద్ధాంతంతోపాటు, అనుబంధ సమా చా రం తెలిసి ఉంటేనే తేలికగా అసలైన ఆన్సర్ గుర్తించేలా చేస్తున్నారు. ప్రతీ సబ్జెక్టును విశ్లేషణాత్మకంగా తెలుసుకునే వారికి మార్కులు ఎక్కువగా వస్తాయి.
ఉదాహరణకు ఫిజిక్స్‌లో ఫోలో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ చాప్టర్ నుంచి ప్రశ్నలను ఇంటర్ పాఠంలోంచే ఇవ్వరు. ఫొటో ఎలక్ట్రిక్ ద్వారా వివిధ పరిశోధనలు, వస్తున్న మార్పుల నుంచి కూడా ప్రశ్నలు ఉంటాయి. కచ్చితమైన సమాధానం రావాలంటే విద్యార్థి పాఠం వరకే పరిమితం కాకుండా, సరికొత్త ట్రెండ్, పారిశ్రామికంగా దాన్ని వాడే విధానం, మార్పులను గుర్తించాల్సి ఉంటుంది. మేథ్స్‌లోనే క్యాలుక్యులస్ వంటి సబ్జెక్టులను ఇప్పుడున్న మూస విధానంలో కాకుండా, ఐటీలో వాడుతున్న లాంగ్వేజ్ లెరి్నంగ్ మాడ్యూల్స్‌ను రూపొందించే స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
ఏప్ సెట్ కూడా టఫ్..
రాష్ట్రంలో ఏప్‌సెట్‌కు ఏటా 3 లక్షల మంది హాజరవుతున్నారు. వీరిలో 80శాతానికిపైగానే అర్హత పొందుతున్నారు. ఏటా1.16 లక్షల మంది అన్ని కేటగిరీలు కలిపి ఇంజనీరింగ్‌లో ప్రవేశాలు పొందుతు న్నారు. అయితే ఇంజనీరింగ్ పూర్తయిన విద్యార్థుల్లో 8% మంది మాత్రమే స్కిల్డ్ ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. ఇంటర్ నుంచి సబ్జెక్టుపై పట్టు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని కేంద్ర విద్యాశాఖ విశ్లేషణల ద్వారా వెల్లడైంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇంటర్ సిలబస్‌ను పూర్తిగా మారుస్తున్నారు. 2026లో ఇంటర్‌లో ప్రవేశం పొందినవారు 2028లో మారిన కొత్త సిలబస్‌తో ఏప్‌సెట్ రాయాల్సి ఉంటుంది.
తెలుగు అకాడమీ నేతృత్వంలో నిపుణుల కమిటీ ఈ దిశగా కసరత్తు మొదలు పెట్టింది. ఎన్‌సీఈఆర్‌టీని అనుసరించి సిలబస్‌లో మార్పులు చేస్తున్నారు. ప్రతీ సబ్జెక్టులోనూ అనుబంధ సమాచారం సేకరించాల్సి ఉంటుంది. దీన్ని ప్రయోగాత్మకంగా నిరూపించాలి. ప్రస్తుతం కేవలం ప్రవేశ పరీక్షల కోణంలో విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. దీనివల్ల సబ్జెక్టుకు దూరమవుతున్నారు. ప్రశ్నించే విధానంలో మార్పులు వస్తే, అధ్యయనం లోతుగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
దెబ్బకొట్టిన ఆన్‌లైన్..
జేఈఈ మెయిన్స్‌లో ఈ ఏడాది వచ్చిన ప్రశ్నలన్నీ విశ్లేషణాత్మకంగా ఉన్నాయి. సబ్జెక్టుపై పట్టున్న వారే ఎక్కువ మార్కులు పొందేలా ఉన్నాయి. అయితే, చాలామంది విద్యార్థులు మారిన ట్రెండ్‌ను గుర్తించలేదు. ఫిజిక్స్ విషయంలో గతంలో మాదిరిగానే సన్నద్ధమయ్యారు. ఆన్‌లైన్ విధానం అనుసరిస్తున్న విద్యార్థులంతా ఈసారి బోల్తా కొట్టారు. కొన్నేళ్ల క్రితం ప్రశ్నావళి సరళిని ఆన్‌లైన్ ఎడ్యు సంస్థలు అనుసరించాయి.
మ్యాట్రిక్స్, క్యాల్యుక్యులేషన్స్‌లో ఏఐ ఆధారిత మ్యాథ్స్ విధానం నుంచి ఈసారి ప్రశ్నలు వచ్చాయి. దీన్ని ఎడ్యు సంస్థలు ముందుగా గుర్తించలేదు. ఫిజిక్స్‌లో గందరగోళంగా అనిపించే మల్టీపుల్ చాయిస్ ఆన్స ర్లున్నాయి. దాదాపు 40% ప్రశ్నలు కొన్నేళ్లుగా జేఈఈ ప్రశ్నపత్రానికి భిన్నంగా ఉన్నాయి. దీంతో విద్యార్థులు సరిగా సమాధా నం ఇవ్వలేకపోయారు. ఏదేమైనా సబ్జెక్టులో రాటు దేలితేనే విద్యార్థులు ప్రవేశ పరీక్షల పోటీని తట్టుకోగలరని నిపుణులు అంటున్నారు.


