సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రతినిధి బృందం ఇవాళ సోమవారం (జనవరి 19, సోమవారం) స్విట్జర్లాండ్‌లోని దావోస్ పర్యటనకు బయలుదేరింది. ఈ నెల 19 నుంచి 23 వరకు దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)–2026 సదస్సులో పాల్గొని రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేయనుంది.
సదస్సులో తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్–2047 ఉద్దేశాలు, లక్ష్యాలకు విస్తృత ప్రచారం కలి్పంచనుంది. సీఎం రేవంత్ 20న తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ, తెలంగాణ ఏఐ హబ్‌ను అక్కడ ఆవిష్కరించనున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ఆవిష్కరించిన విజన్ డాక్యుమెంట్ దార్శనికత, రాష్ట్రాభివృద్ధికి క్యూర్, ప్యూర్, రేర్ పేరుతో రూపొందించిన ప్రణాళికలు, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను దావోస్ సదస్సులో రాష్ట్ర బృందం వివరించనుంది.
జీఎస్డీపీ వృద్ధికి అవలంబిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, మౌలిక సదుపాయాలు, 2047 నాటికి సాధించాల్సిన అభివృద్ధి లక్ష్యాల ప్రణాళికలను పెట్టుబడిదారుల సమక్షంలో ఆవిష్కరించనుంది. దావోస్‌లో ఏర్పాటు చేసే తెలంగాణ పెవిలియన్ వేదికగా గూగుల్, సేల్స్‌ఫోర్స్, హనీవెల్, ఎల్–ఓరియల్, నోవార్డిస్, టాటా గ్రూప్, డీపీ వరల్డ్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి ప్రముఖ కంపెనీల సీఈవోలతో సీఎం రేవంత్ భేటీ అవుతారు. కొన్ని రౌండ్‌టేబుల్ సమావేశాల్లో పాల్గొంటారు.


