దిగంతాలకు తెలంగాణ కీర్తి: కేసీఆర్‌  | Sakshi
Sakshi News home page

దిగంతాలకు తెలంగాణ కీర్తి: కేసీఆర్‌ 

Published Sun, Nov 27 2022 2:03 AM

Telangana CM KCR Hails Startups For Making History In Space Sector - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణకు చెందిన ‘ధ్రువ’స్పేస్‌టెక్‌ అనే స్టార్టప్‌ కంపెనీ రూపొందించిన తైబోల్ట్‌–1, తైబోల్ట్‌– 2 అనే నానో ఉపగ్రహాలను ఇస్రో సంస్థ శ్రీహరికోట నుంచి ‘పీఎస్‌ఎల్వీ–సీ54’ఉపగ్రహ ప్రయోగనౌక ద్వారా శనివారం విజయవంతంగా ప్రయోగించడంపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. టీ–హబ్‌ సభ్యసంస్థ, తెలంగాణకు చెందిన ‘స్కైరూట్‌’స్టార్టప్‌ కంపెనీ ఇటీవలే ‘విక్రమ్‌–ఎస్‌’ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం ద్వారా దేశచరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి స్టార్టప్‌గా నిలిచిందని పేర్కొన్నారు.

ఈ మూడు ఉపగ్రహాల ప్రయోగంతో టీహబ్‌ తెలంగాణ కీర్తిని దిగంతాలకు చాటిందన్నారు. తైబోల్ట్‌–1, తైబోల్ట్‌– 2 ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం కావడం దేశీయ స్టార్టప్‌ల చరిత్రలో చిరస్మరణీయమని, దీని వల్ల స్టార్టప్‌ల నగరంగా హైదరాబాద్‌కు ఉన్న విశిష్టత రెట్టింపు అయిందని పేర్కొన్నారు. ఔత్సాహికుల ప్రతిభను వెలికితీయడంతోపాటు పరిశ్రమలు, శాస్త్ర, సాంకేతిక, సమాచార రంగాల్లో అవకాశాల సృష్టి లక్ష్యంగా ప్రారంభించిన టీ–హబ్‌ భవిష్యత్తులో మరెన్నో మైలురాళ్లు సాధిస్తుందనే నమ్మకం తనకుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

టీ–హబ్‌ ప్రోత్సాహంతో ఉపగ్రహాలను రూపొందించి విజయవంతంగా ప్రయోగించడం ద్వారా తెలంగాణ కీర్తిని చాటిన స్కైరూట్, ‘ధ్రువ’స్పేస్‌ స్టార్టప్‌ సంస్థల ప్రతినిధులను అభినందించారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణ యువత తమ మేధో సంపదను దేశ ప్రగతికి వెచ్చించి పనిచేయాలని, అద్భుత ఆలోచనలను స్టార్టప్‌లుగా కార్యరూపమిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. శాస్త్ర, సాంకేతిక, ఐటీ రంగాల్లో ప్రతిభను వెలికితీసేందుకు కృషి చేస్తున్న పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు, ఉన్నతాధికారులు, టీ–హబ్‌ సిబ్బందిని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ అభినందించారు.    

Advertisement
 
Advertisement
 
Advertisement