ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత | Telangana cabinet decides to lift ban on two child cap to contest local body polls | Sakshi
Sakshi News home page

ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత

Oct 17 2025 6:08 AM | Updated on Oct 17 2025 6:08 AM

 Telangana cabinet decides to lift ban on two child cap to contest local body polls

పంచాయతీ ఎన్నికల్లో పోటీపై రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం

వానాకాలంలో 80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు ఓకే 

మెట్రోరైల్‌ టేకోవర్‌పై సీఎస్‌ అధ్యక్షతన అధికారుల కమిటీ 

నల్సార్‌ వర్సిటీలో స్థానికులకు ప్రవేశాలు 50 శాతానికి పెంపు 

మన్ననూరు–శ్రీశైలం వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌కు రూ.7,500 కోట్లు  

రెండేళ్ల ప్రజా ప్రభుత్వ పాలన ఉత్సవాల కోసం కేబినెట్‌ సబ్‌ కమిటీ  

వికారాబాద్‌–కృష్ణా రైల్వే లైన్‌కు 448 హెక్టార్ల భూసేకరణకు నిర్ణయం 

23న మళ్లీ కేబినెట్‌.. ఆ సమావేశంలో స్థానిక ఎన్నికలపై స్పష్టత

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలున్నవారు అనర్హులన్న నిబంధనను ఎత్తివేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో జనాభా నియంత్రణ కట్టుదిట్టంగా అమలవుతున్న తరుణంలో ఈ గరిష్ట నిబంధనను అమలు చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సీఎం, మంత్రులు జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు ఈ నిబంధనను తొలగించాలన్న డిమాండ్లు రావడంతో అందుకనుగుణంగా కేబినెట్‌ సూచనప్రాయంగా అంగీకరించింది.

ఈ మేరకు గురువారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సడలింపుతోనే స్థానిక ఎన్నికలను నిర్వహించనున్నారు. మంత్రివర్గ వివరాలను రెవెన్యూ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. పశు సంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి మీడియాకు వెల్లడించారు.  

సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా.. 
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచి్చన స్టేను సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసిన అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు పొంగులేటి చెప్పారు. తీర్పు ప్రతిని పరిశీలించాకే దీనిపై ఒక ని ర్ణయం తీసుకోవాలని కేబినెట్‌ నిర్ణయించిందన్నారు. ఈలో గా న్యాయ నిపుణులు నివేదిక ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి ఈనెల 23న మళ్లీ కేబినెట్‌ సమావేశం కావాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈలోగా బీసీ సంఘాలతో చర్చించి ప్రభుత్వం వచ్చే మంత్రివర్గంలో ఒక నిర్ణయం తీసుకుంటుందని మంత్రి వెల్లడించారు.  

మెట్రోపై సీఎస్‌ అధ్యక్షతన అధికారుల కమిటీ.. 
మెట్రో రైలు విస్తరణ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని పొంగులేటి చెప్పారు. రూ.36 వేల కోట్లతో మెట్రో 2ఏ, 2బీ విస్తరణకు అడ్డంకిగా మారిన మొదటి దశను పీపీపీ విధానంలో నిర్వహిస్తున్న ఎల్‌ అండ్‌ టీ నుంచి స్వా«దీనం చేసుకునే విషయంపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించిందన్నారు. మెట్రో రైలును ఎల్‌ అండ్‌ టీ నుంచి స్వా«దీనం చేసుకునే విషయంలో సాధ్యాసాధ్యాలు, అందులో ముడిపడి ఉన్న అంశాలన్నింటినీ లోతుగా అధ్యయ నం చేసేందుకు సీఎస్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని నిర్ణయించామన్నారు.

ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, పురపాలక శాఖ కార్యదర్శి, న్యాయశాఖ కార్య దర్శి, మెట్రో రైలు ఎండీ, పట్టణ రవాణా సలహాదారుతో కమిటీ నియమించాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. ఇప్పటికే కేంద్రానికి సవివర నివేదిక అందించినా మొదటి దశకు అడ్డంకిగా కేంద్రం కొర్రీలు వేసిందని చెప్పారు. సీఎస్‌ అధ్యక్షతన కమిటీ తమ నివేదికను డిప్యూటీ సీఎం నేతృత్వంలోని కేబినెట్‌ సబ్‌ కమిటీకి అందిస్తుందన్నారు. కేబినేట్‌ సబ్‌ కమిటీ సిఫారసుల ఆధారంగా మెట్రోను ఎల్‌ అండ్‌ టీ నుంచి స్వా«దీనం చేసుకునే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం తీర్మానించినట్లు చెప్పారు.  

ప్రతీ గింజా కొంటాం.. 
ఈసారి వానాకాలంలో దాదాపు 80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించడానికి కేబినెట్‌ నిర్ణయించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 50 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచి్చందని, అయితే అదనంగా మరో 15 నుంచి 20 లక్షల మెట్రిక్‌ టన్ను లు తీసుకోవాలని హైకోర్టు నిర్ణయం తీసుకుందన్నారు. కేంద్రం అంగీకరించినా, అంగీకరించకోయినా ప్రభుత్వం ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామన్నారు. ఎస్‌ఎస్‌పీతోపాటు సన్నాలకు అదనంగా క్వింటాల్‌కు రూ. 500 బోనస్‌ చెల్లిస్తామన్నారు. వ్యవసాయ, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ సంయుక్తంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ చేయాలని నిర్ణయించామన్నారు. 

శ్రీశైలం ఎలివేటెడ్‌ రహదారికి ఓకే.. 
మన్ననూరు నుంచి శ్రీశైలం వెళ్లడానికి నల్లమల్ల అటవీ ప్రాంతంలో హైలెవల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 75 కి.మీకు రూ. 7500 కోట్ల వ్యయమవుతుందని, దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించడానికి మంత్రివర్గం ఆమోదించింది. ప్యారడైజ్‌ జంక్షన్‌ నుంచి శామీర్‌ పేట ఓఆర్‌ఆర్, ప్యారడైజ్‌ జంక్షన్‌ నుంచి డెయిరీ ఫాం రోడ్‌ వరకు నిర్మించే ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ భూములు వినియోగించుకుంటున్నందున వారికి ప్రత్యామ్నాయంగా 435.08 ఎకరాల భూములను అప్పగిస్తూ కేబినెట్‌ తీర్మానం చేసింది. 

మూడు కొత్త వ్యవసాయ కళాశాలలు 
కొత్తగా మూడు వ్యవసాయ కళాశాలలు ఏర్పాటుకు మంత్రి మండలి గ్రీన్‌సిగ్నల్‌ ఇచి్చంది. హుజూర్‌నగర్, కొడంగల్, నిజామాబాద్‌లో వీటిని ఏర్పాటు చేస్తారు. నల్సర్‌ యూనివర్సిటీకి ఇప్పుడున్న చోట అదనంగా ఏడు ఎకరాల కేటాయించడానికి ఆమోదం తెలిపింది. నల్సార్‌ ప్రవేశాల్లో ప్రస్తుతం తెలంగాణ స్థానికులకు కేటాయించిన 25 శాతం సీట్ల కోటాను 50 శాతానికి పెంచాలని కేబినెట్‌ తీర్మానించింది. 

రెండేళ్ల ఉత్సవాలకు కేబినెట్‌ కమిటీ 
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రజా పాలన –ప్రజా విజయోత్సవాలను నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయించింది. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఉత్సవాల నిర్వహణ.. సంబంధిత ఏర్పాట్లపై కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

ఆర్‌ అండ్‌ బీ హ్యామ్‌ రోడ్లకు ఓకే.. 
మండలం–జిల్లా–రాజధాని వరకు ఆర్‌ అండ్‌ డీ ఆధ్వర్యంలో నిర్మించనున్న 5566 కి.మీ. రహదారులకు రూ. 10,547 కోట్లతో నిర్మించడానికి వీలుగా టెండర్లు పిలవడానికి మంత్రివర్గ సమావేశం ఆమోద ముద్ర వేసింది. అలాగే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియోజకవర్గం నుంచి వెళ్లేలా వికారాబాద్‌–కృష్ణా రైలు మార్గానికి అవసరమైన భూ సేకరణ చేయాలని కేబినెట్‌ ఆదేశించింది. మొత్తం 845 హెక్టార్ల కోసం రూ. 438 కోట్లు మంజూరు చేసింది.

సురేఖ వ్యవహారం టీకప్పులో తుపాను 
మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి మీడియాతో చిట్‌చాట్‌ చేస్తూ.. సురేఖ వ్యవహారంపై స్పందించారు. రాజకీయాల్లో ఇలాంటివి సహజంగా జరుగుతుంటాయని, ఇది టీకప్పులో తుపాను లాంటిదన్నారు. అయితే, మీరు దాన్ని సముద్రంలో తుపానుగా మార్చారని, త్వరలో అన్నీ సర్దుకుంటాయని వ్యాఖ్యానించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement