పరిశ్రమకు ‘ప్రోత్సాహం’

Telangana Budget 2023: Rs.4037 Crore Allocated For Industrial Sector - Sakshi

కేటాయింపులు రూ.4,037 కోట్లు 

సాక్షి, హైదరాబాద్‌: పారిశ్రా మికాభివృద్ధి ప్రోత్సాహకాల కు పెద్దపీట వేస్తూ పారిశ్రా మిక రంగానికి 2023–24 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో రూ.4,037 కోట్లు ప్రతిపాదించారు. ప్రస్తుత (2022–23) బడ్జెట్‌తో పోలిస్తే రూ.817 కోట్లు అదనంగా కేటాయించారు. నిర్వహణ పద్దు కింద రూ.254.77 కోట్లు, ప్రగతి పద్దు కింద వివిధ అవసరాల కోసం రూ.2,235.29 కోట్లు కేటాయించారు.

వీటితో పాటు ఎస్సీ అభివృద్ధి నిధి నుంచి రూ.834.67 కోట్లు, ఎస్టీ అభివృద్ధి నిధి నుంచి రూ.717.25 కోట్లు కేటాయించారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రూ.2,937.20 కోట్లు (సుమారు 72 శాతం) కేటాయించారు. విద్యుత్‌ సబ్సిడీకి రూ.316.39 కోట్లు, చిన్న, సూక్ష్మ పరిశ్రమలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు పావలావడ్డీని వర్తింప చేస్తూ రూ.266.20 కోట్లు ప్రతిపాదించారు. 

నేత కార్మికుల బీమాకు రూ.50 కోట్లు
నేత కార్మికుల బీమాకు రూ.50 కోట్లు, పరిశ్రమల శాఖకు అనుబంధంగా ఉన్న చేనేత, జౌళి పరిశ్రమల అభివృద్ధి కోసం రూ.2 కోట్లు చొప్పున కేటాయించారు. ఇసుక తవ్వకానికి టీఎస్‌ఎండీసీ వెచ్చిస్తున్న ఖర్చులను తిరిగి చెల్లించేందుకు రూ.120 కోట్లు ప్రతిపాదించారు. వాణిజ్యం, ఎగుమతులు, చెరుకు, గనులు, భూగర్భ వనరులు, హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్, టీఎస్‌ లిప్కో తదితరాలకు నామమాత్ర కేటాయింపులే దక్కాయి.

ఐటీ రంగానికి రూ.366 కోట్లు
ఐటీ రంగానికి నిర్వహణ, ప్రగతి పద్దులను కలుపుకుని రూ.366 కోట్లను తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుత ఏడాదితో పోలిస్తే ప్రగతిపద్దు కింద రూ.6 కోట్ల మేర స్వల్ప పెంపుదల కనిపించింది. టీ హబ్‌ ఫౌండేషన్‌కు రూ.177.61 కోట్లు, వీ హబ్‌కు రూ.7.95 కోట్లు కేటాయించింది. ఓఎఫ్‌సీ టెక్నాలజీతో అన్ని మండలాల్లోని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల్లో వీడియో సమావేశ సదుపాయాల కోసం రూ.18.14 కోట్లు కేటాయించారు. స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌కు రూ.8.88 కోట్లు, టీ ఎలక్ట్రానిక్స్‌కు రూ.8 కోట్లు కేటాయించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top