సాయుధ పోరాట యోధుడు నర్సింహులు కన్నుమూత

Telangana Armed Combat Warrior Narasimhulu Passed Away - Sakshi

తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకపాత్ర 

గెరిల్లా దళ కమాండర్‌గా పోరాటం  

నర్సింహులు చిన్నకూతురే అరుణోదయ విమలక్క

సాక్షి, యాదాద్రి/అంబర్‌పేట: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీపీఐ (ఎం ఎల్‌) జనశక్తి నేత, ప్రజా విమోచన సంపాదకుడు బండ్రు నర్సింహులు (104) తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొంది ఈ నెల 21న డిశ్చార్జ్‌ అయ్యారు. డిశ్చార్జ్‌ అనంతరం బాగ్‌ అంబర్‌పేట డీడీ కాలనీ లోని కుమారుడు ప్రభాకర్‌ నివాసంలో ఉం టున్నారు. శనివారం బండ్రు నర్సింహులు గుండెపోటు రావడంతో మృతి చెందాడు.

ఆయనకు ఇద్దరు కుమారులు ప్రభాకర్, భాస్కర్, కుమార్తెలు విమలక్క (అరుణోదయ, విప్లవ గాయకురాలు), జయమ్మ ఉన్నారు. ఆయన పార్ధివ దేహాన్ని గాంధీ వైద్య కళాశాలకు కుటుంబ సభ్యులు దానం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్య దర్శి చాడ వెంకట్‌రెడ్డి, వామపక్ష నేతలు గోవర్ధన్, ఎన్‌.శ్రీనివాస్, పరశురామ్, డీడీ కాలనీకి వచ్చి బండ్రు నర్సింహులు మృతదేహానికి నివాళులర్పించారు.  

ఆలేరులో నక్సల్‌ ఉద్యమానికి శ్రీకారం 
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెంది న కొమురవ్వ, బుచ్చి రాములు దంపతు లకు జన్మించిన బండ్రు నర్సింహులు ఆలేరు ప్రాంతంలో నక్సలైట్‌ ఉద్యమానికి పురుడు పోశాడు. చిన్నతనంలో తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం మీద పడి నర్సింహులు ఆలేరులో కొంతకాలం హమాలీగా పనిచేశారు. ఆ సమయంలోనే ఆంధ్ర మహాసభ ద్వారా ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ లో చేరారు. తెలంగాణ సాయుధ పోరాటంలో గెరిల్లా దళ కమాండర్‌గా పోరాటం నడుపుతూ రాయగిరి వద్ద అరెస్టయ్యారు.

జనగామ మిలటరీ క్యాంపు, నల్లగొండ జైలులో చిత్రహింసలు అనుభవించారు. 1964లో డిఫెన్స్‌ ఆఫ్‌ ఇండియా రూల్, మీసా చట్టం కింద అరెస్ట్‌ అయి పన్నెండేళ్లు జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత సీపీఐ (ఎంఎల్‌) పార్టీలో చేరి తరిమెల నాగిరెడ్డి నాయకత్వంలో పనిచేశారు. అనంతరం చండ్ర పుల్లారెడ్డి గ్రూపులో.. అనంతరం జనశక్తి పార్టీ రాజన్న వర్గంలో పనిచేశారు.  

సికింద్రాబాద్‌ కుట్ర కేసులో అరెస్ట్‌  
1971 నుంచి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మెదక్‌ ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సమావేశాలు, సభలు, ఊరేగింపులు, వాటికి ముందు జరిగిన హింసాత్మక ఘటనల ఆధారంగా సికింద్రాబాద్‌ కుట్ర కేసు నమోదు చేశారు. ఇందులో బండ్రు నర్సింహులు తదితరులను అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు. సికింద్రాబాద్‌ కుట్ర కేసులో ప్రాసిక్యూషన్‌ సరైన సాక్ష్యాలు సేకరించలేదని సెషన్స్‌ కోర్టు అభిప్రాయపడుతూ 1989 ఫిబ్రవరి 27న అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. 

2015లో నూరేళ్ల పండుగ  
బండ్రు నర్సింహులు ‘నూరేళ్ళ సభ–నూటొక్క పాట’కార్యక్రమం 2015 అక్టోబర్‌ 1న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేం ద్రంలో జరిగింది. అప్పుడే నర్సింహులు 100వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కాగా, నర్సింహులు మృతికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సంతాపం తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top