పిచ్చికుక్కలకు ‘మెర్సీ కిల్లింగ్‌’! | Telangana Allows Mercy Killing of Rabid Dogs | Sakshi
Sakshi News home page

పిచ్చికుక్కలకు ‘మెర్సీ కిల్లింగ్‌’!

Oct 10 2026 5:31 AM | Updated on Oct 10 2026 5:34 AM

Telangana Allows Mercy Killing of Rabid Dogs

రేబిస్, నయంకాని వ్యాధులు, అత్యంత ప్రమాదకర కుక్కలకే పరిమితం 

ఫిర్యాదుతోనే కారుణ్యమరణం కాదు 

వెటర్నరీ వైద్యుల పరిశీలన, కమిటీ సిఫారసు తప్పనిసరి 

సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మార్గదర్శకాలు 

రాష్ట్రవ్యాప్తంగా అమలుకు ప్రభుత్వ ఉత్తర్వులు 

దేశంలో కేరళ తర్వాత ఇందుకు సిద్ధమైన తెలంగాణ

సాక్షి, హైదరాబాద్‌: వీధికుక్కల దాడులతో ప్రజలు, ముఖ్యంగా చిన్నారుల ప్రాణాలకు ఎదురవుతున్న ముప్పును దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేబిస్‌ సోకిన, నయంకాని ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న, కోలుకునే అవకాశం లేకుండా తీవ్రంగా గాయపడిన, అత్యంత ప్రమాదకరంగా మారిన కుక్కలకు నిబంధనల ప్రకారం కారుణ్యమరణం (మెర్సీ కిల్లింగ్‌) కల్పించేందుకు మార్గదర్శకాలకు ఆమోదం తెలిపింది. అయితే, వీధికుక్కలపై ఫిర్యాదులు వచ్చినంత మాత్రాన వాటిని చంపేందుకు అనుమతి ఉండదు. వైద్యపరమైన పరిశీలన, సంబంధిత ఆధారాలు, ప్రత్యేక కమిటీ లిఖితపూర్వక సిఫారసు ఆధారంగానే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డు తొలి సమావేశంలో ఆమోదించిన తీర్మానాలకు అనుగుణంగా, సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను రూపొందించింది. ప్రజారోగ్యం, చిన్నారుల భద్రతతో పాటు రాజ్యాంగంలోని ఆర్టీకల్‌ 21 కల్పించిన జీవించే హక్కును పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యతగా పేర్కొంది. అదే సమయంలో జంతువుల పట్ల మానవీయంగా వ్యవహరించడం, విచక్షణారహితంగా కుక్కలను చంపకుండా నిరోధించడం కూడా ఈ విధానంలో కీలకాంశాలుగా ఉన్నాయి. దేశంలో కేరళ తర్వాత ఇందుకు సిద్ధమైన రాష్ట్రం మనదే.  

ఫిర్యాదు వస్తే చంపేయరు! 
వీధికుక్కలపై ఫిర్యాదు అందిన వెంటనే వాటిని కారుణ్యమరణానికి గురిచేయడానికి వీల్లేదు. సంబంధిత కుక్కను పట్టుకుని వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలి. దాని ఆరోగ్య పరిస్థితి, ప్రవర్తన, గతంలో దాడులకు పాల్పడిన తీరు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించాలి. కుక్కకు చికిత్స సాధ్యమా? దాని ప్రవర్తన వల్ల ప్రజలకు నిజంగా ప్రమాదం ఉందా? అనే అంశాలను నిర్ధారించాలి. కారుణ్యమరణం అవసరమని సంబంధిత కమిటీ లిఖితపూర్వకంగా సిఫారసు చేసిన తర్వాతే నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టాలి. దీంతో సాధారణ వీధి శునకాలను నిర్మూలించకుండా ఈ నిబంధనలను దురి్వనియోగం చేయకుండా నియంత్రణ విధించినట్లవుతుంది. 

కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీకి బాధ్యతలు 
ప్రభుత్వ మార్గదర్శకాల అమలులో జిల్లా కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ, ఇతర పురపాలక సంస్థలు, సంబంధిత స్థానిక సంస్థలు, పోలీసు శాఖలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రజల భద్రతకు ముప్పుగా మారిన సందర్భాల్లో చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడంతోపాటు, జంతువుల పట్ల క్రూరత్వానికి తావులేకుండా చూడాల్సి ఉంటుంది. వీధికుక్కల సమస్య పరిష్కారంలో ప్రజల ప్రాణరక్షణకు ప్రాధాన్యమిస్తూనే, వైద్యపరమైన నిర్ధారణ, నిపుణుల అభిప్రాయం, పారదర్శక విధానాలకు పెద్దపీట వేయడమే ఈ మార్గదర్శకాల ఉద్దేశం.

ఈ నాలుగు పరిస్థితుల్లోనే
1.    రేబిస్‌ సోకిన కుక్కలు: రేబిస్‌ వ్యాధి నిర్ధారణ అయిన కుక్కలకు నిబంధనల ప్రకారం కారుణ్యమరణానికి అనుమతి ఉంటుంది. 
2.    నయం కాని ప్రాణాంతక వ్యాధులు: బ్లడ్‌ కేన్సర్‌ చివరి దశలో ఉండటం, ప్రాణాంతక కణితులు లేదా చికిత్సతో నయం చేయలేని తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న కుక్కల విషయంలో పరిశీలన అనంతరం నిర్ణయం తీసుకుంటారు. 

3.    కోలుకోలేని తీవ్ర గాయాలు: వాహన ప్రమాదాలు లేదా ఇతర కారణాలతో తీవ్రంగా గాయపడి, కోలుకునే అవకాశం లేకుండా భరించలేని నొప్పితో బాధపడుతున్న కుక్కలకు వైద్యపరమైన నిర్ధారణ ఆధారంగా కారుణ్యమరణం కల్పించవచ్చు. 
4.    అత్యంత ప్రమాదకరమైన కుక్కలు: ఎలాంటి స్పష్టమైన ప్రేరణ లేకుండానే ప్రజలు, చిన్నారులపై తీవ్ర దాడులకు పాల్పడిన చరిత్ర ఉన్న కుక్కల ప్రవర్తనను నిపుణులు పరిశీలించాలి. వాటిని అత్యంత దూకుడుగా, ప్రమాదకరంగా ఉన్నట్లు నిర్ధారించిన తర్వాతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి.

నొప్పి లేకుండా.. రికార్డులు తప్పనిసరి
కారుణ్యమరణ ప్రక్రియలో కుక్కకు నొప్పి, బాధ కలగకుండా చూడడమే లక్ష్యం. ఇందుకోసం మార్గదర్శకాల్లో పేర్కొన్న సోడియం పెంటోబార్బిటాల్‌ ఔషధాన్ని నరాల ద్వారా అందించే విధానాన్ని అనుసరించాలని సూచించారు. ఈ ప్రక్రియను అర్హత కలిగిన వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో, నిర్దేశిత విధానాల ప్రకారమే నిర్వహించాలి. కారుణ్యమరణానికి గురిచేసిన ప్రతి కుక్క వివరాలను స్థానిక సంస్థలు ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేయాలి. కుక్కను ఎక్కడి నుంచి పట్టుకున్నారు? దాని ఫొటో లేదా గుర్తింపు ట్యాగ్‌ వివరాలేమిటి? కారుణ్యమరణానికి కారణాలేమిటి? వ్యాధి తీవ్రతకు సంబంధించిన వైద్య నివేదికలు, ప్రమాదకర ప్రవర్తనకు సంబంధించిన ఆధారాలేమిటి? అనే వివరాలను భద్రపరచాలి. తద్వారా తీసుకున్న చర్యలకు జవాబుదారీతనం ఉండటంతో పాటు నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement