ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌పైనే తొలి సంతకం | Telangana: 12 Per Cent Reservation For Muslims | Sakshi
Sakshi News home page

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌పైనే తొలి సంతకం

Aug 15 2021 2:12 AM | Updated on Aug 15 2021 2:37 AM

Telangana: 12 Per Cent Reservation For Muslims - Sakshi

కవాడిగూడ: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం ఖాయమని, ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లపైనే కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలి సంతకం పెడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌లో టీపీసీసీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు అబ్దుల్‌ సోహైల్‌ ఆధ్వర్యంలో మైనార్టీ గర్జన సభ జరిగింది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ కల్పించారని గుర్తు చేశారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తానని హామీ ఇచ్చిన టీఆర్‌ఎస్‌.. ఏడేళ్లుగా మోసం చేస్తూనే ఉందని మండిపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్‌ పార్టీనే ముస్లింలకు అండగా నిలబడుతోందని.. వారికి రాష్ట్రపతి, ముఖ్యమంత్రి పదవులను కూడా ఇచ్చిందని రేవంత్‌ చెప్పారు.

త్రిపుల్‌ తలాక్, ఎన్నార్సీ, సీఏఏ వంటి చట్టాలను కాంగ్రెస్‌ వ్యతిరేకించిందని.. కానీ టీఆర్‌ఎస్‌ మాత్రం ప్రధాని నరేంద్ర మోదీకి సంపూర్ణ మద్దతు పలుకుతోందని విమర్శించారు. మోదీకి వ్యతిరేకంగా పోరాడే శక్తి ఒక్క కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే ఉందన్నారు. దళితబంధు పథకం తరహాలోనే ముస్లింలకు కూడా రూ.10 లక్షలు ఇవ్వాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో ముస్లింలకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇస్తామని టీఆర్‌ఎస్‌ హామీ ఇచ్చిందని.. కానీ ఇప్పటికీ అమలు చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీతోనే అన్నివర్గాల ప్రజలకు లాభం చేకూరుతుందని, నిరుద్యోగుల సమస్యలు తీరుతాయని పేర్కొన్నారు. 

కాంగ్రెస్‌తోనే మైనార్టీల సంక్షేమం 
అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీల సంక్షేమం కోసం పోరాడుతోందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు అంజన్‌కుమార్‌ యాదవ్, గీతారెడ్డి, జగ్గారెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ చెప్పారు. ప్రధాని మోదీ మతం పేరుతో లబ్ధి పొందుతున్నారని.. ఆయనకు సీఎం కేసీఆర్‌ గులాంగిరీ చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు దగాపడ్డారని మండిపడ్డారు. దళితబంధు తరహాలో రాష్ట్రంలో ముస్లింలకు కూడా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అన్నివర్గాల సంక్షేమానికి కాంగ్రెస్‌ పార్టీనే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షబ్బీర్‌ ఆలీ, ఫిరోజ్‌ ఖాన్, దాసోజ్‌ శ్రవణ్, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement