మద్యం తాగించి.. చెవిలో గడ్డి మందుపోసి | Suspicious death of a person | Sakshi
Sakshi News home page

మద్యం తాగించి.. చెవిలో గడ్డి మందుపోసి

Aug 6 2025 4:37 AM | Updated on Aug 6 2025 4:37 AM

Suspicious death of a person

భర్తను హత్య చేయించిన భార్య 

ప్రియుడు మరో వ్యక్తితో కలిసి పథకం 

ముగ్గురిని అరెస్టుచేసిన పోలీసులు 

కరీంనగర్‌రూరల్‌: నిత్యం తనపై అనుమానంతో తాగొచ్చి కొడుతున్నాడని, ప్రియుడు, మరోవ్యక్తితో కలిసి భర్తను ఓ భార్య హత్య చేయించింది. ఈ ఘటన జూలై 29న కరీంనగర్‌ శివారులో చోటు చేసుకుంది. కేసును ఛేదించిన పోలీసులు మంగళవారం ఆ వివరాలు వెల్లడించారు. సీపీ గౌస్‌ ఆలం కథనం ప్రకారం.. కరీంనగర్‌లోని సుభాశ్‌నగర్‌కు చెందిన ఐలవేణి సంపత్‌ (45) జిల్లా గ్రంథాలయంలో స్వీపర్‌గా పని చేస్తున్నాడు. జూలై 29న కరీంనగర్‌ శివారులోని రైల్వేట్రాక్‌పై అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నాడు. 

కరీంనగర్‌ రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి భార్య రమాదేవిపై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రమాదేవికి కిసాన్‌నగర్‌కు  చెందిన కర్రె రాజయ్యతో వివాహేతర సంబంధం ఉంది. సంపత్‌ మద్యానికి బానిసై తరచూ కొడుతుండటంతో భర్తను హత్య చేసేందుకు రాజయ్యతోపాటు దూరపు బంధువు అయిన ఖాదర్‌గూడేనికి చెందిన కీసరి శ్రీనివాస్‌ను రమాదేవి సంప్రదించింది. 

ప్రణాళిక ప్రకారం రాజయ్య, శ్రీనివాస్‌ కలిసి సంపత్‌ను జూలై 29న బొమ్మకల్‌ ఫ్లై ఓవర్‌బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగించారు. రమాదేవి ఆదేశాల మేరకు మద్యం మత్తులో ఉన్న సంపత్‌ చెవిలో రాజయ్య, శ్రీనివాస్‌ గడ్డిమందు పోసి హత్య చేశారు. అనంతరం సమీపంలోని రైల్వేట్రాక్‌ వద్ద మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. 

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న రూరల్‌ పోలీసులు సంపత్‌ భార్యను విచారించారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని గుర్తించారు. నిందితులు కర్రె రాజయ్య, కీసరి శ్రీనివాస్, ఐలవేణి రమాదేవిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన కరీంనగర్‌ రూరల్‌ సీఐ నిరంజన్‌రెడ్డి, ఎస్సైలు టి.నరేశ్, లక్ష్మారెడ్డిని సీపీ అభినందించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement