
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్ర్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మూడు నెలల్లోగా ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అనే పరిస్థితిని అంగీకరించమని ధర్మాసనం స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ బి ఆర్. గవాయి ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ.. తెలంగాణ హైకోర్టు తీర్పును కొట్టివేసింది.
పదో షెడ్యూల్ కింద స్పీకర్‌కురాజ్యాంగ రక్షణ లేదు. ఎమ్మెల్యేలు ఈ ప్రక్రియను సాగదీసే ప్రయత్నం చేయొద్దు. పార్టీ ఫిరాయింపులకు ఫుల్ స్టాప్ పెట్టే అంశంపై పార్లమెంట్ ఆలోచించాలి. మేము జోక్యం చేసుకునేంత వరకు స్పీకర్ నోటీసులు ఇవ్వకపోవడం సమంజసం కాదు. పదో షెడ్యూల్ ఉద్దేశాలు నెరవేరుతున్నాయా ? లేదా అని ఆలోచించాలి. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేసే ఎత్తుగడలు మంచివి కాదు’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకునేలా గడువు విధించాలని బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికే పూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్‌లు పార్టీ ఫిరాయించారు.