ఇప్పటివరకు ఉల్లంఘనదారులపై జరిమానాలకే పరిమితం
ఇక నుంచి ఫుట్‌పాత్ ఆక్రమణదారులపై ఈ–పెట్టీ కేసులు
ఒకట్రెండు రోజులు జైలు లేదా సోషల్ సర్వీస్ చేసేలా శిక్షలు
మల్కాజ్‌గిరి కమిషనరేట్‌లో అమలుకు చర్యలు
సాక్షి, హైదరాబాద్: ‘ఫుట్‌పాత్‌లపై నడవడం పౌరులందరికీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు’అన్న సుప్రీంకోర్టు తీర్పును మల్కాజ్‌గిరి కమిషనరేట్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. పాదచారులకు నడిచే దారి లేక రోడ్లపై వేగంగా వెళ్లే వాహనాల మధ్య రోడ్డును దాటే పరిస్థితి ఏర్పడింది. దీంతో పాదచారులు తరచూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మల్కాజ్‌గిరి పోలీసులు కాలిబాట జోలికెళితే తాట తీయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకు ఫుట్‌పాత్‌లను ఆక్రమించే వారిపై జరిమానాలను విధిస్తుండగా, ఇక నుంచి ఈ–పెట్టీ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. ఉల్లంఘనదారులకు ఒకట్రెండు రోజులు జైలు లేదా సోషల్ సర్వీస్ శిక్షలు వంటివి ఉంటాయి.
అడుగడుగునా ఆక్రమణలే..
మల్కాజ్‌గిరి పోలీసు కమిషనరేట్ పరిధిలో దుకాణదారులు, వీధి వ్యాపారులు, అక్రమ వాహన పార్కింగ్‌లు, తాత్కాలిక నిర్మాణాలన్నీ ఫుట్‌పాత్‌లపైనే దర్శనమిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి ఆక్రమణలు తొలగిస్తున్నా.. కొద్ది రోజుల్లోనే కబ్జాలు పునరావృతమవుతున్నాయి. ఈ కమిషనరేట్‌లో ఫుట్‌పాత్‌ల అక్రమణలు అత్యధికంగా మల్కాజ్‌గిరి, గోపాలపురం, జవహర్‌నగర్, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట, ఎల్బీనగర్, వనస్థలిపురం, ఉప్పల్, కుషాయిగూడ, ఘట్‌కేసర్ ప్రాంతాల్లో జరుగుతున్నాయి.

ఫుట్‌పాత్‌లను వీధి వ్యాపారులే కాదు ప్రభుత్వ శాఖలే ఆక్రమించడం విడ్డూరం. బస్టాప్‌లు, టాయిలెట్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, జీహెచ్‌ఎంసీ ఇందిరమ్మ క్యాంటీన్లు వంటివి ఆయా ప్రభుత్వ విభాగాలు ఏర్పాటు చేశాయి. దీంతో నడిచే దారిలేక పాదచారులు రోడ్లపై నడుస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఎల్బీనగర్, ఉప్పల్ వంటి ప్రాంతాల్లో ఉదయం, రాత్రి వేళ్లలో ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి బస్సుల్లో వచ్చే కొరియర్లు, పార్సిళ్లను బస్ స్టాప్‌లు, ఫుట్‌పాత్‌లపై పెడుతున్నారు. దీంతో పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బీఎన్‌ఎస్ కింద కేసులు..
ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు ఫుట్‌పాత్‌లను ఆక్రమించే వారిపై 39 (బీ) సీపీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. అలాగే కాలిబాట మార్గాలకు అవరోధం కలిగించే వాహనదారులపై మోటార్ వెహికిల్ యాక్ట్ 122/177 కింద కేసులు నమోదు చేస్తున్నారు. గరిష్టంగా రూ.1,000 వరకు జరిమానాలు విధిస్తున్నారు. అయితే జరిమానా తక్కువగా ఉండటంతో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు పునరావృతమవుతున్నాయి. దీంతో ఆక్రమణదారులపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయనున్నారు. ఇటీవల రాంగోపాలపురం స్టేషన్ పరిధిలోని బ్లూ సీ హోటల్ నిర్వాహకులు పదేపదే ఫుట్‌పాత్ ఆక్రమణలకు పాల్పడుతుండటంతో బీఎన్‌ఎస్ సెక్షన్ 223 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. న్యాయస్థానంలో చార్జిïÙట్ కూడా దాఖలు చేశారు.
కాలిబాట ఆక్రమణలు సామాజిక బాధ్యతారాహిత్యం: బి.సుమతి, కమిషనర్, మల్కాజ్‌గిరి కమిషనరేట్
చాలా కాలనీల వద్ద పెద్దలు, పిల్లలు ఉదయం, సాయంత్రం వేళల్లో నడిచేందుకు, దుకాణాలకు వెళ్లేందుకు ఫుట్‌పాత్‌లపై జాగా ఉండటంలేదు. ఈ ఆక్రమణల్ని తొలగించాలని పెద్ద సంఖ్యలో వినతులు వస్తున్నాయి. ప్రతి వారం స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నాం. ఫుట్‌పాత్ ఆక్రమణలనేవి సామాజిక బాధ్యతారాహిత్యం. మార్కెట్లు, వాణిజ్య సముదాయాలు ఉన్న ప్రాంతాల్లో కొంతమందికి ఐదారు షాప్‌లు ఫుట్‌పాత్‌ల మీదే ఉంటున్నాయి. ఇలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఠాణా అధికారులకు ఆదేశాలు జారీ చేశాం.


