పిచ్చికుక్కలు స్వైరవిహారం...20 మంది పై దాడి | Street Dogs Were Injured 20 Members In Old Alwal Presidency Colony | Sakshi
Sakshi News home page

పిచ్చికుక్కలు స్వైరవిహారం...20 మంది పై దాడి

Jun 24 2022 7:38 AM | Updated on Jun 24 2022 10:39 AM

Street Dogs Were Injured 20 Members In Old Alwal Presidency Colony - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/అల్వాల్‌: ఓల్డ్‌ అల్వాల్‌ ప్రెసిడెన్సీ కాలనీలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. కుక్కల దాడిలో దాదాపు 20 మందికి పైగా కాలనీ వాసులు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. బుధవారం రాత్రి కాలనీలో పాదచారులు, బయట ఆడుకుంటున్న చిన్నారులపై దాదాపు మూడు పిచ్చి కుక్కలు దాడి చేశాయి. ఫలితంగా కాలనీలో నివసించే వారితో పాటు  అటుగా వెళ్తున్న పాదచారులు సైతం తీవ్ర గాయాల పాలయ్యారు. దాదాపు 20 మందికి పైగా  కుక్కల దాడిలో గాయపడ్డారు. గాయత్రి అనే అయిదేళ్ల చిన్నారిపై పిచ్చి కుక్క విచుకుపడటంతో ఆమె ముఖంపై తీవ్ర గాయమై పెద్ద ఎత్తున రక్తస్రావం జరిగింది. కాలనీలో గురువారం ఉదయం వరకు పిచ్చికుక్కలు వీరంగం చేశాయి. దీంతో జీహెచ్‌ఎంసి సిబ్బంది కుక్కలను పట్టుకువెళ్లారు.

కుక్కల బెడద తప్పేదెప్పుడు..? 
కుక్కల సంతాన నియంత్రణకు, ప్రజలు కుక్కకాట్ల బారిన పడకుండా ఉండేందుకు ఏటా దాదాపు రూ.10 కోట్లు జీహెచ్‌ఎంసీ ఖర్చు చేస్తున్నప్పటికీ, నగరంలో పిచ్చి కుక్కల బెడద తప్పడం లేదు. తాజాగా అల్వాల్‌ సర్కిల్‌ పరిధిలో కుక్కలు 20 మందిని కరవడంతో నగర ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రెండేళ్ల క్రితం సైతం అమీర్‌పేటలో ఓ కుక్క దాదాపు 50 మందిని కరవడం తెలిసిందే. అప్పట్లో ఆ కుక్కకు రేబిస్‌ వ్యాధి ఉన్నట్లు బెంగళూర్‌లోని పరిశోధన సంస్థ వెల్లడించింది. తాజా ఘటనలోనూ పరీక్ష ఫలితాలు వెలువడితే కానీ దానికి రేబిస్‌ ఉందో, లేదో తెలియదు. కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు, రేబిస్‌ సోకకుండా వ్యాక్సిన్లు  జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నప్పటికీ, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అనుమానాలకు తావిస్తోంది.

కుక్కల సంఖ్యను తగ్గించేందుకు ఏడాది క్రితం కొన్ని వార్డులను ఎంపిక చేసి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రకటించిన అధికారులు దాని ఫలితాలేమిటో వెల్లడించలేదు. వీధి కుక్కలను పట్టుకురావడం.. సంరక్షణ బాధ్యతల్ని సైతం ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించినట్లు పేర్కొన్నారు. అయినా నగరంలో కుక్కల బెడద తప్పడం లేదు.  ఏటా ఎన్నో ఆపరేషన్లు చేసినట్లు చెబుతున్నా ఇప్పటికీ  నగరంలో పది లక్షలపైనే వీధి కుక్కలున్నట్లు అంచనా. ప్రతినెలా నగరంలో 2వేల నుంచి 4వేల మంది వరకు కుక్కకాట్ల బారిన పడుతున్నారు.  

(చదవండి: ప్రాపర్టీ ట్యాక్స్‌ విషయంలో మజాక్‌ చేస్తే ఇట్లనే ఉంటది)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement