పర్యాటక ప్రాంతంగా ‘రామానుజుల విగ్రహం’

Statue Of Equality Will Be Major Tourist Attraction: Srinivas Goud And Ministers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే నెలలో ముచ్చింతల్‌లోని త్రిదండి చిన్న జీయర్‌ స్వామి ట్రస్ట్‌ ప్రాంగణం లో ఆవిష్కరించనున్న రామానుజుల విగ్రహం రాబోయే రోజుల్లో ప్రపంచ పర్యాటక ప్రాంతంగా మారుతుందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. ఆదివారం సంక్రాంతి సందర్భంగా ట్రస్ట్‌ ప్రాంగణాన్ని సందర్శించిన మంత్రులు.. రామానుజుల విగ్రహావిష్కరణ కోసం ప్రత్యేకంగా వేస్తున్న రోడ్ల పనులను పరిశీలించారు.

ప్రాంగణంలోని దేవాలయాన్ని, రామానుజుల భారీ విగ్రహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక హబ్‌గా మారిన రాష్ట్రానికి రామానుజుల విగ్రహం మకుటాయమానం కానుందని చెప్పారు. సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రులతో పాటు చినజీయర్‌ స్వామి, మై హోమ్స్‌ అధినేత రామేశ్వర్‌ రావు, ఏపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరో యాదాద్రిగా జోగుళాంబ
ఆలంపురం జోగుళాంబ పుణ్య క్షేత్రాన్ని మరో యాదాద్రిగా తీర్చిదిద్దుతామని టూరిజం, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆలయ ఈవో పురేందర్‌ కుమార్, ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్‌ శర్మలు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ క్షేత్రంలో పర్యాటకుల సౌకర్యాల కోసం మొదటి విడతగా రూ.36 కోట్లతో పనులు చేపడుతున్నామని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top