
ఎస్‌ఈసీ నోట్‌ఫైల్ సిద్ధం.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు జిల్లాల రిజర్వేషన్ల జాబితాను అందజేసిన పీఆర్‌ఆర్‌డీ డైరెక్టర్
జెడ్పీ సీఈవోలు, డీపీఓల నుంచి పీఆర్ కమిషనరేట్‌కు చేరిన రిజర్వేషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ సోమవారం విడుదల కానున్నట్టు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌కు స్థానిక సంస్థల్లో సీట్ల రిజర్వేషన్ల జాబితాను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్ డా.జి.సృజన అందజేశారు. రాష్ట్రంలోని 31 జిల్లాలకు (హైదరాబాద్, మేడ్చల్ మల్కా జిగిరి అర్బన్ మినహాయించి) సంబంధించిన జిల్లా ప్రజా పరిషత్ (జెడ్పీ), ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరా రు నివేదికను సమరి్పంచారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా స్థానిక సంస్థల నిర్వహణకు ముందుకెళ్లాలంటూ ఎస్‌ఈసీకి ‘కాన్సెంట్’చేరినట్టుగా చెబుతున్నారు. ఎస్‌ఈసీకి ప్రభుత్వం నుంచి బీసీ రిజర్వేషన్ల ఖరారు జీఓ, పంచాయతీరాజ్ శాఖ నుంచి స్థానిక సంస్థల్లో ఆయా స్థానాలకు రిజర్వేషన్ల ఖరారు జాబితా, రాబోయే 15 నుంచి 18 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయా లంటూ ఆదేశాలు అందినట్టుగా అధికారవర్గాల్లో చర్చసాగుతోంది. ఈ పరిస్థితుల్లో సోమవారం నోటిఫికేషన్ విడుదల చేస్తే, వెంటనే మూడురోజుల్లో అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు సమాచారం. మొదట రెండు దశల్లో (గతంలో మూడు దశల్లో) ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తిచేసి, ఆ తర్వాత వారం, పదిరోజుల అంతరంలోనే మూడు దశల్లో (గతంలోనూ మూడు దశల్లో) గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని నిర్ణయించినట్టు తెలిసింది.
సోమవారం ఎస్‌ఈసీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికలపై రిటరి్నంగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు పీఆర్ కమిషనరేట్ కార్యాలయంలో అన్ని జిల్లాలకు సంబంధించి మూడేసీ చొప్పున రిజర్వేషన్ల ఖరారు సైన్డ్ కాపీలు చేరాయి. వీటిని ఎన్నికల కమిషనర్‌కు పీఆర్ డైరెక్టర్ చేరవేశారు. జిల్లా పరిషత్‌ల స్థాయిలో జెడ్పీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (సీఈఓ), మండల, గ్రామ పంచాయతీల పరిధిలోని స్థానాల రిజర్వేషన్లను జిల్లా పంచాయతీ అధికారులు (డీపీఓ)లు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఖరారు చేసిన విషయం తెలిసిందే.
పీఆర్ డైరెక్టర్ సమరి్పంచిన రిజర్వేషన్ల జాబితాలపై రాత్రి పొద్దుపోయే దాకా ఎస్‌ఈసీ అధికారులు, సిబ్బంది జిల్లాల వారీగా అందిన రిజర్వేషన్ల సమాచారాన్ని క్రోడీకరించినట్టు తెలుస్తోంది. ఈ డేటా ఆధారంగా మండల, జిల్లా పరిషత్, గ్రామపంచాయతీ ఎన్నికల స్థానాలు, ఎన్ని దశల్లో నిర్వహణ, తదితర అంశాలపై నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి ఎస్‌ఈసీ అధికారులు నోట్ ఫైల్ కూడా సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ ఫైల్‌పై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సంతకం కాగానే వెంటనే సోమవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు సమాచారం. అయితే 31 జిల్లాల నుంచి రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి స్కాన్డ్ కాపీలను ఎస్‌ఈసీ కోరడంతో...అర్ధరాత్రి దాకా ఈ పనిలో పీఆర్ అధికారులు నిమగ్నమైనట్టు సమాచారం.నోటిఫికేషన్ జారీకి ముందే ఎస్‌ఈసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. దీనిపై లేదు. స్పష్టత కొరవడింది.