
నిష్ణాతులైన వైద్యులు ఇతర ఆసుపత్రులకు బదిలీ
వైద్యులు, ఫార్మసిస్టులు, నర్సింగ్ సిబ్బంది కొరత
పెరిగిన ఔట్ పేషెంట్లు.. సరిగా అందని వైద్యసేవలు
హైదరాబాద్: అది ఆసియాలోనే పేరున్న ఆసుపత్రి.. నిష్ణాతులైన వైద్యులకు నిలయం.. శస్త్రచికిత్సలకు ప్రసిద్ధి. కానీ, ఇటీవల వైద్యులు, ఫార్మసిస్టుల కొరత పీడిస్తోంది. ఉన్న సిబ్బందిపై పనిభారం తీవ్రమైంది. శస్త్ర చికిత్సలకు కనీసం మూడు నెలలపాటు వేచి చూడాల్సిందే. ఇదీ కోఠి ఈఎన్‌టీ (ముక్కు, చెవి, గొంతు) ఆసుపత్రి పరిస్థితి. కొంతకాలంగా వైద్యులు, ఫార్మసిస్టులు, నర్సులు, సిబ్బంది కొరత కారణంగా రోగులకు సరైన వైద్యం అందడం లేదు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో నిష్ణాతులైన వైద్యులు ఇతర ఆసుపత్రులకు బదిలీ కావడంతో ఇక్కడ ప్రతినిత్యం జరిగే శస్త్రచికిత్సలకు తీవ్ర జాప్యం ఏర్పడుతోంది.
రోజూ వెయ్యిమందికిపైగా ఓపీ రోగులు
తెలంగాణ (Telangana) నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఎంతో మంది రోగులు ఈ ఆసుపత్రికి వచ్చి వైద్య సేవలు పొందుతారు. ఈ ఆసుపత్రికి ప్రతి రోజు వెయ్యి నుంచి 1300 మంది ఔట్ పేషెంట్లు వస్తున్నారు. 200 నుంచి 300 వరకు ఇన్ పేషంట్లు వివిధ యూనిట్లలో చికిత్సలు పొందుతుంటారు. ఇటీవల కాలంలో ఓపీ రోగులు పెరుగుతుండటంతో సరైన వైద్య సేవలు అందటంలేదు. బదిలీలు అయిన వైద్యుల స్థానంలో కొత్తవారిని ప్రభుత్వం నియమించకపోవడంతో ఈ ఆసుపత్రిలో వైద్యం అంతంత మాత్రమే ఉంది.
తీవ్రంగా వైద్యుల కొరత..
కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిలో మొత్తం ఐదు మంది ప్రొఫెసర్లు ఉండాలి. ఇటీవల ముగ్గురు ప్రొఫెసర్లు బదిలీ కావడంతో ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఐదుగురు అసోసియేట్ ప్రొఫెసర్లకుగాను ఇద్దరు బదిలీకావడంతో ముగ్గురే సేవలందిస్తున్నారు. 14 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకుగాను నలుగురు మాత్రమే ఉన్నారు. వైద్యుల కొరత కారణంగా రోగులకు అవసరమైన శస్త్ర చికిత్సలు సకాలంలో అందడంలేదు. నెలలపాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ విషయమై పలుమార్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభుత్వానికి నివేదికలు పంపినా ఫలితం శూన్యమని చెప్పవచ్చు. కేవలం ఒక ఫార్మసిస్టు మాత్రమే వందల మంది రోగులకు మందులు అందిస్తున్నారు. దీంతో ఆ ఫార్మసిస్టుపై పనిభారం ఎక్కువై ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఫార్మసిస్టును వెంటనే భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు.
మందులతోనే సరి..
వివిధ జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చే రోగులకు సరైన సమయంలో వైద్యం అందక పోవడంతో వారు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఔట్ పేషెంటు రోగులకు పీజీ వైద్యులు కేవలం మందులు రాసి సరిపెడుతున్నారు. ఒక్కప్పుడు ఇదే ఆసుపత్రిలో ప్రతి రోజు 20 నుంచి 30 శస్త్ర చికిత్సలు జరిగేవి. ఇప్పుడు శస్త్రచికిత్సలకు కనీసం మూడు నెలలు ఎదురుచూడాల్సి వస్తోంది. ఈ ఆసుపత్రిలో సిబ్బందితో పాటు సరైన సౌకర్యాలు సైతం లేకపోవడంతో ఆసుపత్రి అధ్వానంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆసుపత్రికి సరైన వైద్యులు, ఫార్మసిస్ట్‌లు, నర్సింగ్ సిబ్బందిని సమకూర్చాలని పలువురు రోగులు కోరుతున్నారు.
చదవండి: హైదరాబాద్‌లో చిరుత పులి.. పక్షం రోజులు దాటినా దొరకని జాడ