
40 శాతం మంది దంపతుల్లో ఫెర్టిలిటీ సమస్య
సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తున్న వైనం
‘క్యాష్’ చేసుకుంటున్న కొందరు వైద్యులు
టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ల అడ్డగోలు వైద్యం
తాజాగా సికింద్రాబాద్‌లో ‘సృష్టి’ ఘటనతో వెలుగులోకి
సాక్షి, హైదరాబాద్: ఆలస్యపు పెళ్లిళ్లు.. మారిన జీవనశైలి.. ఆహారపు అలవాట్లు.. పని ఒత్తిడి.. రోజంతా ల్యాప్‌టాప్‌లను ఒడిలో పెట్టుకుని కూర్చోవడం.. వెరసీ.. దాదాపు 40 శాతం దంపతుల్లో సంతాన లేమి సమస్య తలెత్తుతోంది. చికిత్సల కోసం ఫెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. సంతానం కోసం తపించే దంపతుల బలహీనతను కొంతమంది వైద్యులు ‘క్యాష్’ చేసుకుంటున్నారు. ఇందుకోసం అడ్డదారులు తొక్కుతున్నారు. తక్కువ కాలంలోనే ఎక్కువ మొత్తంలో సంపాదించే అవకాశం ఉండటంతో కనీస అనుభవం, అర్హత లేకపోయినా.. ఫెర్టిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసి గుట్టుగా చికిత్సలు చేస్తున్నారు. దంపతులకు అనుమానం రాకుండా ఇతరుల నుంచి సేకరించిన శుక్రకణాలు, అండాలను ల్యాబ్‌లో ఫలదీకరించి, అండాశయంలో ప్రవేశపెడుతున్నారు. తీరా బిడ్డ పుట్టిన తర్వాత రంగు, ముఖ కవళికలు, ఆరోగ్య పరిస్థితులు భిన్నంగా ఉండటంతో అనుమానం వచ్చి డీఎన్‌ఏ టెస్టులకు వెళ్తున్నారు. తాజాగా సికింద్రాబాద్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లోనూ ఇదే తరహా సంఘటన వెలుగు చూడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
పాతికేళ్ల యువత నుంచి సేకరణ..
ఆరోగ్య రాజధానిగా గుర్తింపు పొందిన గ్రేటర్‌లో ఫెర్టిలిటీ సెంటర్లు భారీగా పుట్టుకొస్తున్నాయి. హైదరాబాద్ జిల్లాలో సుమారు 50, రంగారెడ్డిలో 39, మేడ్చల్ జిల్లాలో 30 వరకు సెంటర్లు ఉన్నాయి. అనధికారికంగా మరికొన్ని కేంద్రాలు ఉన్నాయి. ఐయూఎఫ్, ఐవీఎఫ్ చికిత్సల పేరుతో ఒక్కో జంట నుంచి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. చికిత్సలు, మందులు వాడినా ఫలితం లేకపోవడంతో చివరకు అడ్డదారులు తొక్కుతున్నాయి. ఫెర్టిలిటీ సెంటర్లలోనే శుక్రకణాలు, అండాల నిధిని ఏర్పాటు చేసుకుంటున్నాయి. వందశాతం సక్సెస్ రేటు కోసం 25 ఏళ్లలోపు యువతీ, యువకుల నుంచి సేకరించిన శుక్రకణాలు, అండా లను పిల్లల కోసం పరితపించే జంటలకు గుట్టుగా అంటగడుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు.
అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ
సికింద్రాబాద్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఘటనతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ సెంటర్‌కు అనుసంధానంగా కొనసాగుతున్న మరికొన్ని సెంటర్లపై దాడులు చేపట్టింది. కొండాపూర్‌లోని ‘హెలే’ క్లినిక్‌లో రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఇక్కడ ఓపీ సేవలు మినహా ఇతర చికిత్సలు లేనట్లు గుర్తించారు. ఈ ఆస్పత్రిలో అనుమతి లేని స్కానింగ్ సెంటర్‌ను సీజ్ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సైతం అప్రమత్తయ్యారు. ఆయా ప్రాంతాల్లోని ఫెర్టిలిటీ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సంతాన సాఫల్య కేంద్రాలపై చర్యలకు సిఫార్సు చేస్తుండటంతో ఫెర్టిలిటీ సెంటర్ల నిర్వాహకులు అప్రమత్తమయ్యారు.
రిజిస్ట్రీ నుంచి తొలగిస్తాం
వైద్య సేవల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదు చేస్తే ఎథిక్స్ అండ్ మాల్ ప్రాక్టీసెస్ కమిటీ ఆధ్వర్యంలో విచారణ చేపడతాం. మెడికల్ నిర్లక్ష్యం ఉందని తేలితే మెడికల్ రిజిస్ట్రీ నుంచి వైద్యుల పేర్లను తొలగిస్తాం. సికింద్రాబాద్‌లో జరిగిన సంఘటనకు
సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
– డాక్టర్ శ్రీనివాస్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు