breaking news
test tube baby center
-
సృష్టి కేసులో మరో ట్విస్ట్.. అసలు పేరు నీరజ.. 1988 బ్యాచ్‌తో కలిసి..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ కేసు విచారణలో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తాను నేరం చేసినట్లుగా విచారణలో డాక్టర్ నమ్రత ఒప్పుకున్నారు. వందల మంది పిల్లలను సరోగసితో పుట్టారని బాధిత దంపతులకు ఇచ్చినట్టు తెలిపారు. వారి వద్ద నుంచి 30 లక్షల వరకు వసూలు చేశామని అంగీకరించారు.సృష్టి ఫెర్టిలిటీ కేసులో భాగంగా డాక్టర్ నమ్రత క్రిమినల్ కన్ఫెషన్ రిపోర్టులో కీలక అంశాలు బయటకు వచ్చాయి. డాక్టర్ నమ్రత అసలు పేరు అట్లూరి నీరజ అని విచారణలో వెల్లడైంది. డాక్టర్ నమ్రత పేరుతో అట్లూరి నీరజ సరోగసి వ్యవహారాలన్నీ నడిపించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఆమె మెడిసిన్ చేసినట్లుగా గుర్తించారు. ఇదే కాలేజీలో 1988 బ్యాచ్ మేట్స్‌తో సైతం ఆమె సరోగసి దందా చేయించినట్లుగా బహిర్గమైంది. నకిలీగా పెట్టుకున్న నమ్రత పేరుతో ఆమె ఈ అక్రమాలకు పాల్పడినట్లుగా తేలింది. 2007లో సికింద్రాబాద్ ఫెర్టిలిటీ సెంటర్స్ ప్రారంభించినట్టు తెలిపారు.ఏజెంట్ల ద్వారా పిల్లలను కొనుగోలు చేసినట్లుగా అంగీకరించారు. తమ దగ్గరికి వచ్చిన దంపతుల వద్ద సరోగసి పేరిట రూ.30 లక్షల వరకు వసూలు చేశామని స్టేట్మెంట్ ఇచ్చింది. అదేవిధంగా అబార్షన్ కోసం వచ్చే గర్భిణులను డబ్బు ఆశ చూపామని.. ప్రసవం అయ్యాక వారి నుంచి పిల్లలను కొనుగోలు చేసినట్లుగా తెలిపింది. అలా ఎంతోమంది పిల్లలు లేని దంపతులను మోసం చేశామని.. సరోగసి ద్వారానే పిల్లలను పుట్టించినట్లుగా నమ్మించామని డాక్టర్ నమ్రత వాంగ్మూలం ఇచ్చింది. పిల్లల కొనుగోలులో సంజయ్‌తో పాటు.. సంతోషీ కీలకంగా వ్యవహరించినట్లుగా తెలిపింది. తన రెండో కుమారుడు లీగల్‌గా సహకరించే వాడని నమ్రత వెల్లడించింది. విశాఖపట్నంలో ఆసుపత్రి ప్రారంభించి పిల్లలు లేని దంపతుల నుండి 20-30 లక్షలు వసూళ్లు చేసినట్లు అంగీకరించారు.అయితే, ఇప్పటికే ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)కి నార్త్ జోన్ పోలీసులు బదిలీ చేసిన విషయం విదితమే. మరోవైపు ఇప్పటికే అట్లూరి నీరజ అలియాస్ నమ్రతపై 15 కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
‘టెస్ట్ ట్యూబ్’లో.. మీ ‘బేబీ’యేనా?
పిల్లలు పుట్టలేదని సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లిన మహిళకు భర్త శుక్రకణాలతో కాకుండా వేరే వ్యక్తి శుక్రకణాలతో సంతానం కలిగించిన ఘటన సికింద్రాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం ‘సృష్టి’ంచింది. ఇటీవలి కాలంలో జంటల్లో సంతాన సాఫల్యత తగ్గడమే.. ఇలాంటి కేంద్రాలు పెరగడానికి కారణం. ఈ సమస్య తీవ్రత ఎంత ఎక్కువంటే... ప్రతి ఆరు వివాహిత జంటల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారని అంచనా. దీంతో పలువురు దంపతులు కృత్రిమ గర్భధారణకు మొగ్గుచూపుతున్నారు. ఈ డిమాండ్‌ను ఆసరా చేసుకున్న కొన్ని ఫెర్టిలిటీ సెంటర్లు దంపతుల పట్ల అనైతికంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృత్రిమ గర్భధారణలో ఐవీఎఫ్ (టెస్ట్‌ట్యూబ్ బేబీ) ప్రాధాన్యమేమిటి? అది ఎప్పుడు, ఎందుకు చేస్తారు? దంపతులు ఎక్కడ మోసపోయే అవకాశం ఉంటుంది? ప్రభుత్వం నియమ నిబంధనలూ, మార్గదర్శకాలు ఏమిటి?సాక్షి, ఫీచర్స్ – హెల్త్ డెస్క్ .ఇటీవల మనదేశంలో సంతానలేమితో బాధపడుతున్నవారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీనికి ప్రధానంగా రెండు రకాల కారణాలున్నాయి. మొదటిది.. సామాజిక కారణాలు. యువత పై చదువుల కోసం, మంచి ఉద్యోగాలంటూ తమ కెరీర్ కోసం ఎక్కువ సమయం కేటాయించడం; ఉద్యోగాల్లో తీవ్రమైన ఒత్తిడి, వేళాపాళా లేని పనివేళలు, మారుతున్న ఆహారపు అలవాట్లు, వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం; అధిక బరువు (స్థూలకాయం), మద్యపానం, పొగతాగడం, డ్రగ్స్ వంటి అనారోగ్యకర అలవాట్లు. ఇక రెండోది ఆరోగ్యపరమైనవి.. మహిళల్లోని హార్మోన్లలో అసమతౌల్యత, ఇన్ఫెక్షన్లు, స్త్రీలలో పుట్టుకతోనే అండాల సంఖ్య తక్కువగా ఉండటం; మగవారిలో వీర్యకణాల సంఖ్య, కదలిక తక్కువగా ఉండటం, నాణ్యతలేమి.ఐవీఎఫ్ : ‘ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్’కు సంక్షిప్త రూపమే ఐవీఎఫ్. జనసామాన్యంలో దీనికి ‘టెస్ట్‌ట్యూబ్ బేబీ’ అని పేరు. స్త్రీ, పురుషులిద్దరిలోనూ ఫలదీకరణ విషయంలో సమస్యలు ఉన్నప్పుడు ఈ మార్గాన్ని సూచిస్తారు. ఇందులో ముందుగా మహిళలో అండాలు పెద్దమొత్తంలో పెరిగేందుకు మందులిస్తారు. అలా పెరిగిన అండాల్లోంచి ఆరోగ్యంగా ఉన్న కొన్నింటిని సేకరించి, పురుషుడి నుంచి సేకరించిన వీర్యకణాలతో ల్యాబ్‌లోని ‘టెస్ట్‌ట్యూబ్’లో ఫలదీకరణం చేస్తారు. ఇందులో కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ పిండాలు పెరగవచ్చు (అందుకే ఈ పద్ధతిలో చాలామందిలో కవలలు పుడుతుంటారు). ఇలా రూపొందించిన వాటిల్లో ఆరోగ్యకరమైన పిండాలను మళ్లీ మహిళ గర్భంలోకి ప్రవేశపెడతారు. రెండువారాలకు నిర్ధారణ పరీక్షలు చేస్తారు. నాలుగు వారాల తర్వాత అల్ట్రాసౌండ్ పరీక్ష చేసి, గర్భం నిలిచిందా లేదా అన్నది నిర్ధారణ చేసుకుంటారు. గర్భం నిలవకపోతే కారణాలను విశ్లేషించి, మళ్లీ కొన్ని నెలలు ఆగి ప్లాన్ చేస్తారు. ఇలా రెండుమూడు సార్లు ప్రయత్నిస్తారు.ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ఐసీఎస్ఐ): పురుషుల్లో సమస్య ఉంటే అనుసరించే మార్గమిది. మగవారి నుంచి ఎంపిక చేసుకున్న ఆరోగ్యంగా ఉన్న శుక్రకణాన్ని నేరుగా అండంలోకి ప్రవేశపెడతారు.పిండాలను భద్రపరిచి..: ఐవీఎఫ్ ప్రక్రియలో రూపొందిన పిండాల సంఖ్యను బట్టి, ఒకసారి ఒకటి లేదా రెండు పిండాలను గర్భాశయంలోకి పంపి, మిగతా వాటిని ‘విట్రిఫికేషన్’ అనే పద్ధతి ద్వారా ఫ్రీజ్ చేసి భద్రపరుస్తారు. ఐవీఎఫ్ ప్రక్రియ మొదటిసారి సఫలం కానప్పుడు, అలా భద్రపరచిన పిండాలను తీసుకొని మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. లేదా ఇంకొకసారి గర్భం దాల్చాలనుకున్నప్పుడు కూడా వాడుకోవచ్చు. పరిశోధనలకు ఇవ్వవచ్చు. లేదా వాటిని నిర్జీవపరచమని కోరవచ్చు. క్లినిక్‌లు వీటిలో ఏది చేయాలన్నా దంపతుల అనుమతితోనే చేయాలి. ఈ విషయంపై కూడా దంపతులకు పూర్తి అవగాహన లేకపోవడం వల్ల మోసాలు జరిగే అవకాశం ఉంది.ఐవీఎఫ్ ఎవరి కోసమంటే..సాధారణ చికిత్సలతో గర్భం రాక.. ఇంకా వేచిచూసేంత ఓపిక లేనివాళ్లకి. వయసు 38 – 40 ఏళ్లు దాటిన వారికి అండాల సంఖ్య, నాణ్యత బాగా తగ్గిపోతున్నవారికివీర్యకణాల సంఖ్య, కదలిక, నాణ్యత బాగా తక్కువగా ఉన్నప్పుడు. భార్య లేదా భర్తలో ఏవైనా జన్యుపరమైన సమస్య ఉండి, అది పిల్లలకూ వచ్చే అవకాశం ఉన్నప్పుడు, ఐవీఎఫ్ ద్వారా తయారైన పిండాలనుంచి ఒక దాన్ని తీసి, ప్రీ–ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నసిస్ (పీజీడీ) ద్వారా పరీక్ష చేసి, జన్యు సమస్య లేని పిండాలను వేరుపరచి, తల్లి గర్భాశయంలోకి పంపిస్తారు.కొందరు కెరీర్ కోసమో లేదా వ్యక్తిగత కారణాల వల్లో గర్భధారణను వాయిదా వేస్తారు. వాళ్లలో కొందరు ముందుగానే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా తయారైన పిండాలను భద్రపరచుకొని, ఆ తర్వాత వీలైనప్పుడు ఫ్రోజెన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ద్వారా గర్భాశయంలోకి ప్రవేశింపచేయడం ద్వారా గర్భం ధరిస్తారు. ఈ సందర్భంలో కూడా దంపతులు అప్రమత్తంగా ఉండాలి. పిండాలు మారిపోయే అవకాశం ఇక్కడ కూడా ఉంటుంది.ఇవీ నియమ నిబంధనలుకృత్రిమ గర్భధారణ విషయంలో ఇన్ఫెర్టిలిటీ కేంద్రాలకూ, అలాగే ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ‘ద ఏఆర్టీ (అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్) యాక్ట్ ఆఫ్ 2021’, అలాగే ‘సరోగసీ యాక్ట్ ఆఫ్ 2021’ వంటి చట్టాలు చేసింది. ఇన్ఫెర్టిలిటీ క్లినిక్‌లు ఈ నియమ నిబంధనలను పాటించాలి. దంపతులు కూడా ఈ చట్టాలపై కొంత అవగాహన కలిగి ఉంటే మంచిది.దేశంలోని ప్రతి ఐవీఎఫ్ సెంటర్.. కేంద్ర, రాష్ట్ర ఏఆర్టీ బోర్డు కింద నమోదు చేసుకుని ఉండాలి. ఐవీఎఫ్ చికిత్సకు తాము అంగీకరిస్తున్నట్టుగా దంపతులు ఆమోదపత్రం ఇవ్వాలి. ఈ ప్రక్రియ నిర్వహిస్తున్న నిపుణులు.. ఐవీఎఫ్ ప్రక్రియ గురించి పూర్తి వివరాలు దంపతులకు తెలియజేయాలి. తమ దగ్గర చికిత్స తీసుకుంటున్న దంపతుల వివరాలను, వారి మెడికల్ రికార్డులను క్లినిక్‌లు గోప్యంగా ఉంచాలి. తమకు జరుగుతున్న చికిత్స, వైద్యపరీక్షల వంటి పూర్తి వివరాలు పేషెంట్లు తెలుసుకోవచ్చు. క్లినిక్ నిర్వాహకులు / డాక్టర్లు అన్ని వివరాలనూ పేషెంట్లకు వివరించాలి. చికిత్సకు సంబంధించిన అన్ని రికార్డులూ పేషెంట్లకు ఇవ్వాలి. తమకు కలిగే అసౌకర్యాల విషయంలో ఫిర్యాదు చేసేందుకు ప్రతి క్లినిక్ తమ దగ్గర ఓ ఫిర్యాదుల కేంద్రాన్ని (గ్రీవెన్స్ సెల్) ఏర్పాటు చేయాలి.దాతలకు నియమ నిబంధనలివి..కేంద్ర / రాష్ట్ర ఏఆర్టీ బోర్డు ఆధ్వర్యంలో నమోదు చేసుకున్న ఏఆర్టీ బ్యాంకుల నుంచే క్లినిక్‌లు అండాలను / శుక్రకణాలను స్వీకరించాలి.ఇటీవల ఎవరో బిచ్చగాళ్లు, ఆరోగ్యం సరిగా లేనివారిని దాతలుగా కొన్ని సంస్థలు శాంపిళ్లు సేకరించినట్లు వార్తలొచ్చాయి. ఇది కఠిన శిక్షార్హమైన నేరం. దాతల ఎంపికకూ, అండాలు ఇచ్చే మహిళా దాతలుగానీ లేదా శుక్రకణాలను ఇచ్చే పురుషుల అర్హతల గురించీ స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. దాతల నుంచి అండాలు లేదా శుక్రకణాలను స్వీకరించే సమయంలో స్వీకర్తలకు దాతల గురించి, ఈ విషయంపై ఉన్న నియమ నిబంధనలూ తెలుపుతూ కౌన్సెలింగ్ చేయాలి.– డాక్టర్ ప్రీతీ రెడ్డి, సంతాన సాఫల్య నిపుణురాలు, హైదరాబాద్ఐవీఎఫ్ పేరిట క్లినిక్‌ల నయా మోసాలుదాతల విషయంలో అప్రమత్తత అవసరంచట్టాలపై అవగాహనతో అక్రమాలకు అడ్డుకట్టవివరాలన్నీ క్లినిక్‌లు దంపతులకు చెప్పాల్సిందేపేషెంట్ల వివరాలు గోప్యంగా ఉంచాల్సిందేఐవీఎఫ్ విజయావకాశాలుఇవి ప్రధానంగా మహిళ వయసు మీద ఆధారపడి ఉంటాయి. 40 ఏళ్లు దాటాక.. వయసు పెరిగే కొద్దీ సక్సెస్ రేటు తగ్గుతుంది. అండాలు, పిండం నాణ్యత తక్కువగా ఉంటే ఆ మేరకు సక్సెస్ రేటూ తగ్గిపోతుంది. దంపతుల జీవనశైలి కూడా ప్రభావం చూపుతుంది. ధూమపానం, మద్యపానం అలవాటున్నవారు, ఊబకాయం ఉన్నవారిలో అండాల సంఖ్య, నాణ్యత సహజంగా తక్కువగా ఉండవచ్చు. దాంతో సక్సెస్రేటూ తగ్గుతుంది. -
Test Tube Center: బిర్యానీ ఇచ్చి వారి నుంచి...!
-
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో సంచలన విషయాలు
-
ఫెర్టి.. పిటీ..
సాక్షి, హైదరాబాద్: ఆలస్యపు పెళ్లిళ్లు.. మారిన జీవనశైలి.. ఆహారపు అలవాట్లు.. పని ఒత్తిడి.. రోజంతా ల్యాప్‌టాప్‌లను ఒడిలో పెట్టుకుని కూర్చోవడం.. వెరసీ.. దాదాపు 40 శాతం దంపతుల్లో సంతాన లేమి సమస్య తలెత్తుతోంది. చికిత్సల కోసం ఫెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. సంతానం కోసం తపించే దంపతుల బలహీనతను కొంతమంది వైద్యులు ‘క్యాష్’ చేసుకుంటున్నారు. ఇందుకోసం అడ్డదారులు తొక్కుతున్నారు. తక్కువ కాలంలోనే ఎక్కువ మొత్తంలో సంపాదించే అవకాశం ఉండటంతో కనీస అనుభవం, అర్హత లేకపోయినా.. ఫెర్టిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసి గుట్టుగా చికిత్సలు చేస్తున్నారు. దంపతులకు అనుమానం రాకుండా ఇతరుల నుంచి సేకరించిన శుక్రకణాలు, అండాలను ల్యాబ్‌లో ఫలదీకరించి, అండాశయంలో ప్రవేశపెడుతున్నారు. తీరా బిడ్డ పుట్టిన తర్వాత రంగు, ముఖ కవళికలు, ఆరోగ్య పరిస్థితులు భిన్నంగా ఉండటంతో అనుమానం వచ్చి డీఎన్ఏ టెస్టులకు వెళ్తున్నారు. తాజాగా సికింద్రాబాద్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లోనూ ఇదే తరహా సంఘటన వెలుగు చూడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పాతికేళ్ల యువత నుంచి సేకరణ.. ఆరోగ్య రాజధానిగా గుర్తింపు పొందిన గ్రేటర్లో ఫెర్టిలిటీ సెంటర్లు భారీగా పుట్టుకొస్తున్నాయి. హైదరాబాద్ జిల్లాలో సుమారు 50, రంగారెడ్డిలో 39, మేడ్చల్ జిల్లాలో 30 వరకు సెంటర్లు ఉన్నాయి. అనధికారికంగా మరికొన్ని కేంద్రాలు ఉన్నాయి. ఐయూఎఫ్, ఐవీఎఫ్ చికిత్సల పేరుతో ఒక్కో జంట నుంచి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. చికిత్సలు, మందులు వాడినా ఫలితం లేకపోవడంతో చివరకు అడ్డదారులు తొక్కుతున్నాయి. ఫెర్టిలిటీ సెంటర్లలోనే శుక్రకణాలు, అండాల నిధిని ఏర్పాటు చేసుకుంటున్నాయి. వందశాతం సక్సెస్ రేటు కోసం 25 ఏళ్లలోపు యువతీ, యువకుల నుంచి సేకరించిన శుక్రకణాలు, అండా లను పిల్లల కోసం పరితపించే జంటలకు గుట్టుగా అంటగడుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ సికింద్రాబాద్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఘటనతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ సెంటర్‌కు అనుసంధానంగా కొనసాగుతున్న మరికొన్ని సెంటర్లపై దాడులు చేపట్టింది. కొండాపూర్‌లోని ‘హెలే’ క్లినిక్‌లో రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఇక్కడ ఓపీ సేవలు మినహా ఇతర చికిత్సలు లేనట్లు గుర్తించారు. ఈ ఆస్పత్రిలో అనుమతి లేని స్కానింగ్ సెంటర్‌ను సీజ్ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సైతం అప్రమత్తయ్యారు. ఆయా ప్రాంతాల్లోని ఫెర్టిలిటీ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సంతాన సాఫల్య కేంద్రాలపై చర్యలకు సిఫార్సు చేస్తుండటంతో ఫెర్టిలిటీ సెంటర్ల నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. రిజిస్ట్రీ నుంచి తొలగిస్తాం వైద్య సేవల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదు చేస్తే ఎథిక్స్ అండ్ మాల్ ప్రాక్టీసెస్ కమిటీ ఆధ్వర్యంలో విచారణ చేపడతాం. మెడికల్ నిర్లక్ష్యం ఉందని తేలితే మెడికల్ రిజిస్ట్రీ నుంచి వైద్యుల పేర్లను తొలగిస్తాం. సికింద్రాబాద్‌లో జరిగిన సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. – డాక్టర్ శ్రీనివాస్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు -
పిల్లలు కావాలని వెళ్తే ఇంత మోసమా..?
-
భర్తవి కాకుండా ఇతరుల శుక్ర కణాలతో ‘సృష్టి’!
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): పిల్లలు పుట్టలేదని సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లిన మహిళకు భర్త శుక్ర కణాలతో కాకుండా వేరే వ్యక్తి శుక్ర కణాలతో సంతానం కలిగించిన ఘటన సికింద్రాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఇటీవల బాలుడి ఆరోగ్యంపై అనుమానంతో దంపతులు డీఎన్ఏ టెస్టు నిర్వహించగా ఈ విషయం బయటపడింది. దీంతో వారు రెజిమెంటల్ బజార్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం నుంచి ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్, సికింద్రాబాద్ ఆర్డీవో సాయిరాం, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ వెంకటితో పాటు క్లూస్ టీం, వైద్య బృందాలు సెంటర్లో తనిఖీలు చేపట్టారు.విశ్వసనీయ సమాచారం మేరకు.. నగరానికి చెందిన ఓ జంట పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టక పోవడంతో రెండేళ్ల క్రితం సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వహిస్తున్న డాక్టర్ నమ్రతను ఆశ్రయించారు. అక్కడ ఐవీఎఫ్ ప్రక్రియ అనంతరం వారికి మగబిడ్డ పుట్టా డు. అయితే ఇటీవల బాబు అనారోగ్యానికి గురికావడంతో వైద్యులను సంప్రదించారు. వివిధ రకాల పరీక్షల తర్వాత బాబుకు క్యాన్సర్ ఉందని తేలడంతో ఆ దంపతులు నిర్ఘాంతపోయారు. తమ తల్లిదండ్రులతో పాటు కుటుంబీకులు ఎవరికీ క్యాన్సర్ చరిత్ర లేకపోవడంతో, అనుమానం వచ్చి డాక్టర్ నమ్రతను గట్టిగా నిలదీశారు. ఆమె సరైన సమాధానం చెప్పకపోవడంతో బాబుకు డీఎన్ఏ టెస్టు లు చేయించగా.. ఆ దంపతుల డీఎన్ఏతో మ్యాచ్ కాలేదు. దీంతో డాక్టర్ నమ్రత తమను మోసం చేసిందని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలిసి పరారీలో ఉన్న డాక్టర్ నమ్రతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. లోతుగా దర్యాప్తు: డీసీపీ రష్మీ పెరుమాళ్ సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. లోతైన దర్యాప్తు కోసం పోలీసులతో పాటు మెడికల్, రెవెన్యూ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అంత ర్రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. విశాఖ కేసులో లైసెన్సు రద్దు చేసినా.. డాక్టర్ నమ్రత హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో సంతాన సాఫల్య కేంద్రాలను నిర్వహిస్తున్నారు. పదేళ్ల క్రితం విశాఖపట్నంలో పేద మహిళలకు డబ్బు ఆశ చూపి సరోగసికి ఒప్పించి, పిల్లలు లేని వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్టు చేయడంతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమె లైసెన్సును రద్దు చేసినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఇక్కడ నడుస్తున్న టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో ఇతర డాక్టర్ల లైసెన్సుల ద్వారా వైద్యం అందిస్తున్నట్లు తెలిసింది. కాగా కేపీహెచ్‌బీలోని టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్లో కూడా ఇలాగే అక్రమ సరోగసీ కేసు నమోదైనట్లు సమాచారం. విశాఖలో తాజాగా మేనేజర్ అరెస్టు ప్రస్తుత కేసుకు సంబంధించి హైదరాబాద్ గోపాలపురం పోలీసులు విశాఖ జిల్లా పరిషత్ ప్రాంతంలో ఉన్న సృష్టి బేబీ సెంటర్లో తనిఖీలు చేపట్టారు. ఈ సెంటర్ ద్వారా ఇప్పటివరకు ఎంతమందికి ఐవీఎఫ్ చికిత్స అందించారన్న వివరాలపై ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. ఒక మహిళా మేనేజర్‌ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. -
సంతానం కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయిన మహిళ
-
సంతానం కలిగిస్తామని..మోసం చేశారు
కరీంనగర్: కరీంనగర్‌లోని పద్మజ సంతాన సాఫల్య కేంద్రం వివాదాల్లోకెక్కింది. సంతానం కలిగిస్తామంటూ తమవద్ద లక్షలాది రూపాయలు వసూలు చేసిన డాక్టర్ పద్మజ ఫలితం చూపకపోగా, ఇదేమిటని ప్రశ్నించినందుకు తుపాకీ ఉందని బెదిరించారని వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన బలిజ శశికళ దంపతులు ఆరోపించారు. తమను సెక్యూరిటీ సిబ్బందితో ఆసుపత్రి నుంచి బయటకు గెంటి వేయించారని పేర్కొంటూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. మరోవైపు తమపై వచ్చిన ఆరోపణలను డాక్టర్ పద్మజ కొట్టిపారేశారు. శశికళ దంపతులకు మూడుసార్లు పరీక్షలు చేయాల్సి ఉండగా, ఒకేసారి పరీక్షలు చేయించుకుని వెళ్లారని తెలిపారు. మరోసారి వస్తే గర్భం వచ్చే అవకాశాలున్నాయని చెప్పినా వినకుండా డబ్బులివ్వాలంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇదే అంశంపై ఇటీవల తాము న్యాయస్థానం ద్వారా పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఈ వ్యవహారంపై కరీంనగర్ టూ టౌన్ పోలీసులు స్పందించారు. శశికళ దంపతులను స్టేషన్‌కు పిలిపించి వారి నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. అదే సమయంలో ఆసుపత్రి నిర్వాహకుల నుంచి శశికళ దంపతులకు నిర్వహించిన పరీక్షల రిపోర్టులను తెప్పించుకుని నిజనిర్దారణ కోసం నిపుణుల కమిటీకి పంపించారు. కమిటీ వెల్లడించే నివేదిక మేరకు తగిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ టూ టౌన్ పోలీసులు తెలిపారు. శశికళ దంపతులు, పోలీసులు, డాక్టర్ పద్మజ తెలిపిన మేరకు వివరాలు.. ఆస్తి అమ్మి డబ్బులు చెల్లించాం బలిజ శశికళ, శ్రీనివాస్ దంపతులు మీడియాతో మాట్లాడుతూ ‘మాది వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తాటికొండ గ్రామం. 13 ఏళ్లుగా సంతానం కలగడం లేదు. డాక్టర్ పద్మజ సంతాన సాఫల్యం ప్రకటనలు చూసి గత జూన్‌లో అక్కడికి వెళ్లాం. పరీక్షలు నిర్వహించిన డాక్టర్ పద్మజ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా సంతానం పొందడానికి దంపతులిద్దరికీ అవకాశాలున్నాయని చెప్పింది. అందుకు మూడున్నర లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపింది. గర్భం దాల్చే ప్రక్రియ విజయవంతం కాకపోతే మూడుసార్లు ఉచితంగా చేస్తామని, తప్పకుండా గర్భం వస్తుందని హామీ ఇవ్వడంతో మూడున్నర లక్షలు చెల్లించాం. వైద్యసేవలు అందిస్తున్న సమయంలో అదనంగా మరో లక్షన్నర విలువైన మందులు రాశారు. మొదటి సారి గర్భం దాల్చే ప్రక్రియ విజయవంతం కాలేదు. రెండవసారి చేయడానికి అండాలు చెడిపోయాయని, వాటికి మరో యాభైవేలు చెల్లించాలని తెలిపారు. పిల్లల కోసం ఉన్న ఆస్తితోపాటు పుస్తెల తాడు కూడా తాకట్టు పెట్టామని, ఇక డబ్బులివ్వలేమని చెప్పినా వినిపించుకోలేదు. సమయానికి ఇవ్వాల్సిన ఇంజక్షన్ ఇవ్వలేదు. దీంతో నా పూర్తిగా ఆరోగ్యం పాడైంది. గిట్లయిందేందని అడిగితే డాక్టరమ్మ ‘నువ్వెక్కువగా మాట్లాడుతున్నవని తిట్టింది. మీలాంటి వారికోసమే తుపాకీ లెసైన్స్ తీసుకున్నాం.. మా ఆయన వద్ద ఆ తుపాకీ ఉంది’ అంటూ బెదిరించింది. ‘ఏం చేసుకుంటావో చేసుకో, ఎవరూ ఏమీ చేయలేరు. మాకు మంత్రులు, ఎస్పీ వంటి వారు తెలుసు’ అంటూ సెక్యూరిటీతో బయటకు గెంటేయించింది. ఏం చేయాలో తెలియక మేం డీఎంహెచ్‌వో కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసినం. వినియోగదారుల మండలిని కూడా ఆశ్రయించినం. మీరైనా మాకు న్యాయం జరిగేలా చేయండి* అంటూ వేడుకున్నారు. వాళ్లే మమ్నుల్ని బెదిరించారు.. - డాక్టర్ పద్మజ వివరణ సంతాన సాఫల్య కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్ పద్మజ సాక్షితో మాట్లాడుతూ ‘శశికళ దంపతులకు ఐవీఎఫ్ ద్వారా ఇప్పటికీ గర్భం వచ్చే అవకాశం ఉంది. అందుకోసం గరిష్టంగా మూడుసార్లు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పాం. కానీ వాళ్లు ఒక్కసారి మాత్రమే పరీక్షలు నిర్వహించుకున్నారు. రెండోసారి పరీక్షలు నిర్వహిస్తుండగా మధ్యలోనే మానేశారు. పైగా పరీక్షల కోసం ఖర్చయిన డబ్బు మొత్తం ఇవ్వాలని లేనిపక్షంలో, ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. ఇతరుల ద్వారా ఫోన్లు చేయించి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయిస్తామని వేధించారు. దీంతో మేమే ఈ విషయంపై న్యాయస్థానం ద్వారా పోలీస్‌స్టే షన్ను ఆశ్రయించాం’ అని వివరించారు. వాస్తవానికి సంతానం కోసం తమ వద్దకు వచ్చేవాళ్లలో ఎనభై శాతం మంది ఫలితం పొందుతున్నారని, మొత్తం రూ.1.5 లక్షల నుంచి రూ.1.70 లక్షలు మాత్రమే ఇందుకు ఖర్చవుతోందని వెల్లడించారు. లెసైన్స్డ్ తుపాకీ అంశాన్ని ప్రస్తావించగా ‘మావద్ద లెసైన్స్డ్ గన్ ఉన్న మాట వాస్తవమే. ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. ఎవరినీ బెదిరించలేదు’ అని పేర్కొన్నారు. కేసును విచారిస్తున్నాం శశికళ దంపతులు తమను బెదిరిస్తున్నారని డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం నిర్వాహకులు న్యాయస్థానం ద్వారా ఫిర్యాదు చేశారు. అందులో భాగంగా శశికళ దంపతులను పిలిచి వారి స్టేట్మెంట్ తీసుకున్నాం. అదే సమయంలో ఆ దంపతులకు నిర్వహించిన వైద్యపరీక్షల పత్రాలను సంబంధిత ఆసుపత్రి నుంచి సేకరించాం. నిజనిర్దారణ కోసం వైద్యనిపుణుల కమిటీకి పంపించాం. కమిటీ వెల్లడించే నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటాం... - కరీంనగర్ టూటౌన్ సీఐ హరిప్రసాద్ మేం చేసేదేమీ లేదు ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యసేవలు పొందడం రోగి, డాక్టర్ మధ్య ఒప్పందం ప్రకారం జరుగుతుంటుంది. ఇందులో డీఎంహెచ్ఓ చేసేదేమీ లేదు. ఆస్పత్రి రిజిస్ట్రేషన్, అర్హులైన డాక్టర్, ఆస్పత్రిలో వైద్యసేవలు, సౌకర్యాలు వంటివి రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం ఉన్నాయా లేదా అనేది మేం పరిశీలిస్తాం. రోగికి డాక్టర్ అందించిన సేవలపై అనుమానం ఉంటే చట్టాన్ని ఆశ్రయించవచ్చు. ప్రభుత్వ పరంగా ఫీజు, వైద్యసేవల ఖర్చులు వంటి వివరాలు అడిగే హక్కు మాకు లేదు. ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ చట్టం 2002 ప్రకారం నిబంధనలు అమలయ్యేలా మాత్రమే చూడడం మా పని. -డీఎంహెచ్ఓ అలీమ్ నోటీసు పంపిస్తున్నాం బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పద్మజ సంతాన సాఫల్య కేంద్రం డాక్టర్ పద్మజకు నోటీసు పంపిస్తున్నాం. నోటీసులో బాధితురాలు చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని, వైద్యం వల్ల కలిగిన అనారోగ్యానికి కొంత సొమ్ము చెల్లించాలని కోరాం. ఆస్పత్రి నుంచి ఇచ్చిన బిల్లులు కూడా ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించేలా ఉన్నాయి. బిల్లు కింద అడ్రస్ మాత్రమే ఉంది. -ఎన్.శ్రీనివాస్, వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మార్చిలోనూ ఇదే తరహా ఫిర్యాదు పద్మజ సంతాన సాఫల్య కేంద్రంపై గత మార్చిలోనూ ఇదే తరహా ఫిర్యాదు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ)కు అందింది. ఈ ఏడాది మార్చి 2న ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌కు చెందిన చీనూరి రాజబాబు, రమ దంపతులు పద్మజ సంతాన సాఫల్య కేంద్రంపై ఫిర్యాదు చేశారు. సంతానం కలిగిస్తామంటూ తమవద్ద రూ.2లక్షలు వసూలు చేసిన డాక్టర్ మిగిలిన రూ.1.75 లక్షలు సకాలంలో ఇవ్వలేదనే కారణంతో తమను దుర్భాషలాడటమే కాకుండా, మీలాంటి వాళ్లను తుపాకీతో కాల్చిపారేయాలని, రూంలో పడేసి తన్నాలంటూ బెదిరింపులకు గురిచేస్తూ ఆసుపత్రి నుంచి గెంటేయించారని రాజబాబు దంపతులు ఐఎంఏకు ఫిర్యాదు చేశారు.