
పిల్లలు పుట్టలేదని సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లిన మహిళకు భర్త శుక్రకణాలతో కాకుండా వేరే వ్యక్తి శుక్రకణాలతో సంతానం కలిగించిన ఘటన సికింద్రాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం ‘సృష్టి’ంచింది. ఇటీవలి కాలంలో జంటల్లో సంతాన సాఫల్యత తగ్గడమే.. ఇలాంటి కేంద్రాలు పెరగడానికి కారణం. ఈ సమస్య తీవ్రత ఎంత ఎక్కువంటే... ప్రతి ఆరు వివాహిత జంటల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారని అంచనా. దీంతో పలువురు దంపతులు కృత్రిమ గర్భధారణకు మొగ్గుచూపుతున్నారు. ఈ డిమాండ్‌ను ఆసరా చేసుకున్న కొన్ని ఫెర్టిలిటీ సెంటర్లు దంపతుల పట్ల అనైతికంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృత్రిమ గర్భధారణలో ఐవీఎఫ్ (టెస్ట్‌ట్యూబ్ బేబీ) ప్రాధాన్యమేమిటి? అది ఎప్పుడు, ఎందుకు చేస్తారు? దంపతులు ఎక్కడ మోసపోయే అవకాశం ఉంటుంది? ప్రభుత్వం నియమ నిబంధనలూ, మార్గదర్శకాలు ఏమిటి?
సాక్షి, ఫీచర్స్ – హెల్త్ డెస్క్
.
ఇటీవల మనదేశంలో సంతానలేమితో బాధపడుతున్నవారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీనికి ప్రధానంగా రెండు రకాల కారణాలున్నాయి.
మొదటిది.. సామాజిక కారణాలు. యువత పై చదువుల కోసం, మంచి ఉద్యోగాలంటూ తమ కెరీర్ కోసం ఎక్కువ సమయం కేటాయించడం; ఉద్యోగాల్లో తీవ్రమైన ఒత్తిడి, వేళాపాళా లేని పనివేళలు, మారుతున్న ఆహారపు అలవాట్లు, వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం; అధిక బరువు (స్థూలకాయం), మద్యపానం, పొగతాగడం, డ్రగ్స్ వంటి అనారోగ్యకర అలవాట్లు. ఇక రెండోది ఆరోగ్యపరమైనవి.. మహిళల్లోని హార్మోన్లలో అసమతౌల్యత, ఇన్ఫెక్షన్లు, స్త్రీలలో పుట్టుకతోనే అండాల సంఖ్య తక్కువగా ఉండటం; మగవారిలో వీర్యకణాల సంఖ్య, కదలిక తక్కువగా ఉండటం,
నాణ్యతలేమి.
ఐవీఎఫ్ : ‘ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్’కు సంక్షిప్త రూపమే ఐవీఎఫ్. జనసామాన్యంలో దీనికి ‘టెస్ట్‌ట్యూబ్ బేబీ’ అని పేరు. స్త్రీ, పురుషులిద్దరిలోనూ ఫలదీకరణ విషయంలో సమస్యలు ఉన్నప్పుడు ఈ మార్గాన్ని సూచిస్తారు.
ఇందులో ముందుగా మహిళలో అండాలు పెద్దమొత్తంలో పెరిగేందుకు మందులిస్తారు. అలా పెరిగిన అండాల్లోంచి ఆరోగ్యంగా ఉన్న కొన్నింటిని సేకరించి, పురుషుడి నుంచి సేకరించిన వీర్యకణాలతో ల్యాబ్‌లోని ‘టెస్ట్‌ట్యూబ్’లో ఫలదీకరణం చేస్తారు. ఇందులో కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ పిండాలు పెరగవచ్చు (అందుకే ఈ పద్ధతిలో చాలామందిలో కవలలు పుడుతుంటారు). ఇలా రూపొందించిన వాటిల్లో ఆరోగ్యకరమైన పిండాలను మళ్లీ మహిళ గర్భంలోకి ప్రవేశపెడతారు.
రెండువారాలకు నిర్ధారణ పరీక్షలు చేస్తారు. నాలుగు వారాల తర్వాత అల్ట్రాసౌండ్ పరీక్ష చేసి, గర్భం నిలిచిందా లేదా అన్నది నిర్ధారణ చేసుకుంటారు. గర్భం నిలవకపోతే కారణాలను విశ్లేషించి, మళ్లీ కొన్ని నెలలు ఆగి ప్లాన్ చేస్తారు. ఇలా రెండుమూడు సార్లు ప్రయత్నిస్తారు.
ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ఐసీఎస్‌ఐ): పురుషుల్లో సమస్య ఉంటే అనుసరించే మార్గమిది. మగవారి నుంచి ఎంపిక చేసుకున్న ఆరోగ్యంగా ఉన్న శుక్రకణాన్ని నేరుగా అండంలోకి ప్రవేశపెడతారు.
పిండాలను భద్రపరిచి..: ఐవీఎఫ్ ప్రక్రియలో రూపొందిన పిండాల సంఖ్యను బట్టి, ఒకసారి ఒకటి లేదా రెండు పిండాలను గర్భాశయంలోకి పంపి, మిగతా వాటిని ‘విట్రిఫికేషన్’ అనే పద్ధతి ద్వారా ఫ్రీజ్ చేసి భద్రపరుస్తారు. ఐవీఎఫ్ ప్రక్రియ మొదటిసారి సఫలం కానప్పుడు, అలా భద్రపరచిన పిండాలను తీసుకొని మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. లేదా ఇంకొకసారి గర్భం దాల్చాలనుకున్నప్పుడు కూడా వాడుకోవచ్చు. పరిశోధనలకు ఇవ్వవచ్చు. లేదా వాటిని నిర్జీవపరచమని కోరవచ్చు. క్లినిక్‌లు వీటిలో ఏది చేయాలన్నా దంపతుల అనుమతితోనే చేయాలి. ఈ విషయంపై కూడా దంపతులకు పూర్తి అవగాహన లేకపోవడం వల్ల మోసాలు జరిగే అవకాశం ఉంది.
ఐవీఎఫ్ ఎవరి కోసమంటే..
సాధారణ చికిత్సలతో గర్భం రాక.. ఇంకా వేచిచూసేంత ఓపిక లేనివాళ్లకి.
వయసు 38 – 40 ఏళ్లు దాటిన వారికి
అండాల సంఖ్య, నాణ్యత బాగా తగ్గిపోతున్నవారికి
వీర్యకణాల సంఖ్య, కదలిక, నాణ్యత బాగా తక్కువగా ఉన్నప్పుడు.
భార్య లేదా భర్తలో ఏవైనా జన్యుపరమైన సమస్య ఉండి, అది పిల్లలకూ వచ్చే అవకాశం ఉన్నప్పుడు, ఐవీఎఫ్ ద్వారా తయారైన పిండాలనుంచి ఒక దాన్ని తీసి, ప్రీ–ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నసిస్ (పీజీడీ) ద్వారా పరీక్ష చేసి, జన్యు సమస్య లేని పిండాలను వేరుపరచి, తల్లి గర్భాశయంలోకి పంపిస్తారు.కొందరు కెరీర్ కోసమో లేదా వ్యక్తిగత కారణాల వల్లో గర్భధారణను వాయిదా వేస్తారు. వాళ్లలో కొందరు ముందుగానే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా తయారైన పిండాలను భద్రపరచుకొని, ఆ తర్వాత వీలైనప్పుడు ఫ్రోజెన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ ద్వారా గర్భాశయంలోకి ప్రవేశింపచేయడం ద్వారా గర్భం ధరిస్తారు. ఈ సందర్భంలో కూడా దంపతులు అప్రమత్తంగా ఉండాలి. పిండాలు మారిపోయే అవకాశం ఇక్కడ కూడా ఉంటుంది.
ఇవీ నియమ నిబంధనలు
కృత్రిమ గర్భధారణ విషయంలో ఇన్‌ఫెర్టిలిటీ కేంద్రాలకూ, అలాగే ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ‘ద ఏఆర్‌టీ (అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్) యాక్ట్ ఆఫ్ 2021’, అలాగే ‘సరోగసీ యాక్ట్ ఆఫ్ 2021’ వంటి చట్టాలు చేసింది. ఇన్‌ఫెర్టిలిటీ క్లినిక్‌లు ఈ నియమ నిబంధనలను పాటించాలి. దంపతులు కూడా ఈ చట్టాలపై కొంత అవగాహన కలిగి ఉంటే మంచిది.
దేశంలోని ప్రతి ఐవీఎఫ్ సెంటర్.. కేంద్ర, రాష్ట్ర ఏఆర్‌టీ బోర్డు కింద నమోదు చేసుకుని ఉండాలి.
ఐవీఎఫ్ చికిత్సకు తాము అంగీకరిస్తున్నట్టుగా దంపతులు ఆమోదపత్రం ఇవ్వాలి. ఈ ప్రక్రియ నిర్వహిస్తున్న నిపుణులు.. ఐవీఎఫ్ ప్రక్రియ గురించి పూర్తి వివరాలు దంపతులకు తెలియజేయాలి.
తమ దగ్గర చికిత్స తీసుకుంటున్న దంపతుల వివరాలను, వారి మెడికల్ రికార్డులను క్లినిక్‌లు గోప్యంగా ఉంచాలి.
తమకు జరుగుతున్న చికిత్స, వైద్యపరీక్షల వంటి పూర్తి వివరాలు పేషెంట్లు తెలుసుకోవచ్చు. క్లినిక్ నిర్వాహకులు / డాక్టర్లు అన్ని వివరాలనూ పేషెంట్లకు వివరించాలి. చికిత్సకు సంబంధించిన అన్ని రికార్డులూ పేషెంట్లకు ఇవ్వాలి.
తమకు కలిగే అసౌకర్యాల విషయంలో ఫిర్యాదు చేసేందుకు ప్రతి క్లినిక్ తమ దగ్గర ఓ ఫిర్యాదుల కేంద్రాన్ని (గ్రీవెన్స్ సెల్) ఏర్పాటు చేయాలి.
దాతలకు నియమ నిబంధనలివి..
కేంద్ర / రాష్ట్ర ఏఆర్‌టీ బోర్డు ఆధ్వర్యంలో నమోదు చేసుకున్న ఏఆర్‌టీ బ్యాంకుల నుంచే క్లినిక్‌లు అండాలను / శుక్రకణాలను స్వీకరించాలి.
ఇటీవల ఎవరో బిచ్చగాళ్లు, ఆరోగ్యం సరిగా లేనివారిని దాతలుగా కొన్ని సంస్థలు శాంపిళ్లు సేకరించినట్లు వార్తలొచ్చాయి. ఇది కఠిన శిక్షార్హమైన నేరం. దాతల ఎంపికకూ, అండాలు ఇచ్చే మహిళా దాతలుగానీ లేదా శుక్రకణాలను ఇచ్చే పురుషుల అర్హతల గురించీ స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి.
దాతల నుంచి అండాలు లేదా శుక్రకణాలను స్వీకరించే సమయంలో స్వీకర్తలకు దాతల గురించి, ఈ విషయంపై ఉన్న నియమ నిబంధనలూ తెలుపుతూ కౌన్సెలింగ్ చేయాలి.
– డాక్టర్ ప్రీతీ రెడ్డి, సంతాన సాఫల్య నిపుణురాలు, హైదరాబాద్
ఐవీఎఫ్ పేరిట క్లినిక్‌ల నయా మోసాలు
దాతల విషయంలో అప్రమత్తత అవసరం
చట్టాలపై అవగాహనతో అక్రమాలకు అడ్డుకట్ట
వివరాలన్నీ క్లినిక్‌లు దంపతులకు చెప్పాల్సిందే
పేషెంట్ల వివరాలు గోప్యంగా ఉంచాల్సిందే
ఐవీఎఫ్ విజయావకాశాలు
ఇవి ప్రధానంగా మహిళ వయసు మీద ఆధారపడి ఉంటాయి. 40 ఏళ్లు దాటాక.. వయసు పెరిగే కొద్దీ సక్సెస్ రేటు తగ్గుతుంది. అండాలు, పిండం నాణ్యత తక్కువగా ఉంటే ఆ మేరకు సక్సెస్ రేటూ తగ్గిపోతుంది.
దంపతుల జీవనశైలి కూడా ప్రభావం చూపుతుంది. ధూమపానం, మద్యపానం అలవాటున్నవారు, ఊబకాయం ఉన్నవారిలో అండాల సంఖ్య, నాణ్యత సహజంగా తక్కువగా ఉండవచ్చు. దాంతో సక్సెస్‌రేటూ తగ్గుతుంది.