ఫొటోలకు ప్రాణం పోసేలా వీడియో.. గ్రోక్‌ ఏఐ కొత్త ఫీచర్‌ | Grok AI Image to Video feature transforms static photos into videos | Sakshi
Sakshi News home page

ఫొటోలకు ప్రాణం పోసేలా వీడియో.. గ్రోక్‌ ఏఐ కొత్త ఫీచర్‌

Oct 9 2025 1:20 PM | Updated on Oct 9 2025 3:02 PM

Grok AI Image to Video feature transforms static photos into videos

ఎక్స్‌ఏఐ (xAI) రూపొందించిన గ్రోక్‌ఏఐ (GrokAI) యాప్‌లో కొత్త ఫీచర్‌ ప్రవేశపెట్టినట్లు ఎలాన్‌మస్క్‌ తెలిపారు. పాత, కొత్త ఫొటోలను అప్‌లోడ్ చేసి కేవలం 20 సెకన్లలో వాటిని వీడియోలుగా మార్చేయవచ్చని చెప్పారు. ఈ నూతన సాంకేతికత కృత్రిమ మేధ (Artificial Intelligence) ద్వారా కేవలం ఒక చిత్రాన్ని తీసుకొని దానికి కదలిక (Motion), అనుగుణమైన శబ్దం (Audio) జోడించి 20 సెకన్లలో 6 నుంచి 15 సెకన్ల నిడివి గల వాస్తవిక దృశ్యం (Photorealistic video)లాగా మార్చగలుగుతోంది. గ్రోక్‌ఏఐ ‘గ్రోక్ ఇమాజిన్’ (Grok Imagine) ఫీచర్ ద్వారా చారిత్రక చిత్రాలు, ఫ్యామిలీ ఫొటోలు లేదా కార్టూన్ పాత్రలను సజీవంగా మార్చవచ్చని కంపెనీ చెబుతుంది.

బనానా ఏఐ

ఫొటోలు అప్‌లోడ్‌ చేసి వీడియోలు మార్చే క్రమంలో గ్రోక్‌ఏఐ ముందున్నా, ఇదే తరహా కృత్రిమ మేధ సామర్థ్యాలను బనానా ఏఐ (Banana AI) కలిగి ఉంది. ఇది గూగుల్ జెమిని 2.5 ఫ్లాష్ ఇమేజ్ (Gemini 2.5 Flash Image) మోడల్‌కు చెందింది. బనానా ఏఐ ప్రధానంగా ఫోటోలను మెరుగుపరచడం, వాటిని మార్చడం, కొత్త చిత్రాలను సృష్టించడం (Text-to-Image) వంటి వాటికి ప్రసిద్ధి చెందింది.

ప్రస్తుతం బనానా ఏఐ ఫోటో-టు-వీడియో ఫీచర్ కాకుండా ఫొటో ఎడిటింగ్ వంటి వాటిలో వినియోగదారులకు సహాయపడుతుంది. ఉదాహరణకు వినియోగదారులు తమ సాధారణ ఫొటోలను ‘రెట్రో చీరలు ధరించిన వింటేజ్ ఫొటోలు’గా మార్చడానికి దీన్ని వాడుతున్నారు. ఈ రెండు కంపెనీలు (గ్రోక్, గూగుల్) వేర్వేరు మార్గాల్లో కంటెంట్ సృష్టికి కొత్త దిశానిర్దేశం చేస్తున్నాయి.

మానసిక స్వాంతన

తమ పాత ఫొటోకు ప్రాణం పోసినప్పుడు నెజిజన్లకు అపూర్వమైన భావోద్వేగ అనుభూతి కలుగుతుంది. దశాబ్దాల నాటి కుటుంబ ఫొటోలు, గతించిపోయిన ప్రియమైన వారి చిత్రాలు వీడియోలుగా మారినప్పుడు గతాన్ని మళ్లీ అనుభూతి చెందే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ వల్ల సంతోషం, సంతృప్తి, లోతైన భావోద్వేగ బంధం ఏర్పడతాయి. తమ ఊహలకు రూపం ఇచ్చేందుకు, పాత కథలకు దృశ్యరూపం కల్పించేందుకు ఈ ఫీచర్ వీలు కల్పిస్తుంది. ఈ సృజనాత్మకత ఒక విధమైన మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది.

వ్యాపార అవకాశాలు

ఏఐ ఆధారిత ఫోటో-టు-వీడియో టెక్నాలజీ కేవలం వ్యక్తిగత భావోద్వేగాలకే పరిమితం కాకుండా కంపెనీలకు వ్యాపార అవకాశాలను సృష్టిస్తోంది. గ్రోక్‌ఏఐ ఈ అధునాతన ఫీచర్‌ను సాధారణంగా ‘సూపర్ గ్రోక్’ (Super Grok) వంటి పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల్లో అందిస్తుంది. దీని ద్వారా వినియోగదారుల నుంచి స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. అధిక నాణ్యత (High-quality), ఎక్కువ నిడివి గల వీడియోల కోసం ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

కంటెంట్ క్రియేటర్ల మార్కెట్

నేటి సోషల్ మీడియా యుగంలో కంటెంట్ క్రియేటర్లకు వీడియో అత్యంత ముఖ్యమైన సాధనం. ఈ ఏఐ టూల్స్ ద్వారా నిమిషాల్లో ప్రొఫెషనల్ స్థాయి వీడియోలను సృష్టించవచ్చు. దీనివల్ల సోషల్ మీడియా మార్కెటింగ్, యాడ్స్, షార్ట్ ఫిల్మ్‌ల తయారీకి అయ్యే ఖర్చు, సమయం గణనీయంగా తగ్గుతుంది. ఈ విధంగా కంటెంట్ తయారీ ప్లాట్‌ఫామ్‌లు (FlexClip వంటివి) కూడా ఏఐ ఆధారిత ఫీచర్లను తమ వ్యాపారంలో భాగం చేసుకుంటున్నాయి.

ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూనే కోట్లు సంపాదించే మార్గాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement