
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ కేసు విచారణలో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తాను నేరం చేసినట్లుగా విచారణలో డాక్టర్ నమ్రత ఒప్పుకున్నారు. వందల మంది పిల్లలను సరోగసితో పుట్టారని బాధిత దంపతులకు ఇచ్చినట్టు తెలిపారు. వారి వద్ద నుంచి 30 లక్షల వరకు వసూలు చేశామని అంగీకరించారు.
సృష్టి ఫెర్టిలిటీ కేసులో భాగంగా డాక్టర్ నమ్రత క్రిమినల్ కన్ఫెషన్ రిపోర్టులో కీలక అంశాలు బయటకు వచ్చాయి. డాక్టర్ నమ్రత అసలు పేరు అట్లూరి నీరజ అని విచారణలో వెల్లడైంది. డాక్టర్ నమ్రత పేరుతో అట్లూరి నీరజ సరోగసి వ్యవహారాలన్నీ నడిపించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఆమె మెడిసిన్ చేసినట్లుగా గుర్తించారు. ఇదే కాలేజీలో 1988 బ్యాచ్ మేట్స్‌తో సైతం ఆమె సరోగసి దందా చేయించినట్లుగా బహిర్గమైంది. నకిలీగా పెట్టుకున్న నమ్రత పేరుతో ఆమె ఈ అక్రమాలకు పాల్పడినట్లుగా తేలింది. 2007లో సికింద్రాబాద్ ఫెర్టిలిటీ సెంటర్స్ ప్రారంభించినట్టు తెలిపారు.
ఏజెంట్ల ద్వారా పిల్లలను కొనుగోలు చేసినట్లుగా అంగీకరించారు. తమ దగ్గరికి వచ్చిన దంపతుల వద్ద సరోగసి పేరిట రూ.30 లక్షల వరకు వసూలు చేశామని స్టేట్‌మెంట్ ఇచ్చింది. అదేవిధంగా అబార్షన్ కోసం వచ్చే గర్భిణులను డబ్బు ఆశ చూపామని.. ప్రసవం అయ్యాక వారి నుంచి పిల్లలను కొనుగోలు చేసినట్లుగా తెలిపింది. అలా ఎంతోమంది పిల్లలు లేని దంపతులను మోసం చేశామని.. సరోగసి ద్వారానే పిల్లలను పుట్టించినట్లుగా నమ్మించామని డాక్టర్ నమ్రత వాంగ్మూలం ఇచ్చింది. పిల్లల కొనుగోలులో సంజయ్‌తో పాటు.. సంతోషీ కీలకంగా వ్యవహరించినట్లుగా తెలిపింది. తన రెండో కుమారుడు లీగల్‌గా సహకరించే వాడని నమ్రత వెల్లడించింది. విశాఖపట్నంలో ఆసుపత్రి ప్రారంభించి పిల్లలు లేని దంపతుల నుండి 20-30 లక్షలు వసూళ్లు చేసినట్లు అంగీకరించారు.

అయితే, ఇప్పటికే ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)కి నార్త్ జోన్ పోలీసులు బదిలీ చేసిన విషయం విదితమే. మరోవైపు ఇప్పటికే అట్లూరి నీరజ అలియాస్ నమ్రతపై 15 కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.