సాక్షి, సికింద్రాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తుగ్లక్ పాలన చేస్తూ పేర్లు మార్పు చేస్తున్నారు అని ఆరోపించారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు పోరాటం తప్పదు అంటూ వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మొదట ర్యాలీకి అనుమతి ఇచ్చిన పోలీసులు రాత్రి 10.40కి అనుమతి రద్దు చేశారు. సికింద్రాబాద్ పేరు మార్చడం లేదని సీఎం చెబుతూనే మల్కాజిగిరి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. రెండేళ్లుగా ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. తుగ్లక్ పాలన చేస్తూ పేర్లు మార్పు చేస్తున్నారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు పోరాటం తప్పదు. నిన్న ఎన్ని విధాలు ప్రయత్నించినా వాళ్ళు ఫెయిల్ అయ్యారు మనం సక్సెస్ అయ్యాం. మొదటి వారంలో కోర్టు అనుమతితో వేలాది మందితో ర్యాలీ చేస్తాం. కలిసి వచ్చే పార్టీలు కలిసి రావాలని కోరాం. ర్యాలీకి మద్దతు ఇచ్చిన వారికి ధన్యవాదాలు. ఈసారి జరిగే ర్యాలీని ఎవరూ అడ్డుకోలేని విధంగా నిర్వహిస్తాం. మన రక్తంలోనే భయమన్న మాట లేదు.. కేసులకు భయపడేది లేదు అంటూ హెచ్చరించారు.
కాగా, సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం బీఆర్‌ఎస్.. శనివారం పోరుబాట పట్టిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. మాజీ మంత్రి తలసాని ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు భారీ శాంతి ర్యాలీకి పిలుపునిచ్చారు. అయితే.. ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ జిల్లా సాధన సమితి పేరుతో ర్యాలీకి అనుమతి అడిగారని.. అయితే నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ కారణంతో ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని చెప్పారు. ర్యాలీలో పాల్గొనేందుకు వస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.


