
పోలీసుల విచారణలో‘సృష్టి’ డాక్టర్ నమ్రత
తొలిరోజుఏ వివరాలూ రాబట్టలేకపోయిన పోలీసులు
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): సృష్టి ఆస్పత్రి కేసు వ్యవహారంలో కీలకమైన ఏ1 ముద్దాయి డాక్టర్ నమ్రత పోలీసుల విచారణలో నోరు విప్పడం లేదు. పిల్లలు లేరని తన దగ్గరకు వచి్చన మహిళకు తాను కేవలం బాబును దత్తత ఇప్పించానని పోలీసులకు ఇచి్చన వాంగ్మూలంలో చెప్పినట్లు తెలిసింది. అది తప్ప ఇక ఏ విషయంలోనూ ఆమె నోరు విప్పకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఈ కేసులో డాక్టర్ నమ్రతను శుక్రవారం నుంచి ఐదు రోజులపాటు పోలీసులు విచారించేందుకు కోర్టు నుంచి కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే.
ఉత్తర మండలం డీసీపీ కార్యాలయంలో డీసీపీ, ఏసీపీతో పాటు గోపాలపురం పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. మొదటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీసులు వివిధ అంశాల గురించి ఆమెను గుచి్చగుచ్చి ప్రశ్నించినా ఏ ప్రశ్నకూ సమాధానం ఇవ్వలేదని తెలిసింది. తను ఎలాంటి తప్పూ చేయలేదని, తనకు బిడ్డ కావాలని, తన భర్త విదేశాల్లో ఉంటారని ఓ మహిళ తన దగ్గరకు రాగా దత్తత ఇప్పించానని మాత్రమే సమాధానం చెప్పినట్లు తెలిసింది.
అంతకుమించి ఆమె నుంచి ఎటువంటి వివరాలూ పోలీసులు రాబట్టలేకపోయారు. ఆస్పత్రినుంచి సేకరించిన రికార్డుల్లో అనుమానం వచ్చిన కేసుల గురించి ప్రశ్నించినా డాక్టర్ నమ్రత తనకు గుర్తు లేదని చెప్పినట్లు తెలిసింది. ఇక్కడ సరోగసీ పేరుతో శిశువుల అక్రమ రవాణా మాత్రమే జరగడంతో చాలా కేసులు రికార్డుల్లోకి ఎక్కలేదు. ఇంకా నాలుగు రోజులపాటు పోలీసులు డాక్టర్ నమ్రతను విచారించనున్నారు.
పోలీసు కస్టడీకి మరో ఇద్దరు నిందితులు
ఈ కేసులో మరో ఇద్దరు నిందితులను కోర్టు పోలీసు కస్టడీకి అనుమతించింది. శుక్రవారం వైజాగ్‌కు చెందిన ఏ3–కల్పన, అమీర్‌పేట్‌కు చెందిన ఏ6 సంతోషిలను పోలీసు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. శనివారం వారిని పోలీసులు విచారించనున్నారు. బాబును అసలైన తల్లిదండ్రుల నుంచి తీసుకుని వచ్చి రాజస్తాన్‌కు చెందిన దంపతులకు అందించడంలో ఈ ఇద్దరూ కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది.