‘‘అందుకే హైడ్రా గురించి ‘హిట‍్లర్‌’ అంటూ రేవంత్‌ మాట్లాడారు’’ | Sridhar Babu says Congress Positioning and Farmer Centric Policies | Sakshi
Sakshi News home page

‘‘అందుకే హైడ్రా గురించి ‘హిట‍్లర్‌’ అంటూ రేవంత్‌ మాట్లాడారు’’

Jun 8 2026 4:31 PM | Updated on Jun 8 2026 4:42 PM

 Sridhar Babu says Congress Positioning and Farmer Centric Policies

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌పై తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కబ్జాదారుల గుండెల్లో హైడ్రా గుబులు పుట్టిస్తోందని, దీన‍్ని ఓర్వలేకే కొంతమంది దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని చెప్పారు.

‘‘సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరులో జరిగిన ‘The Hindu Conclave’లో ఏ ఉద్దేశంతో మాట్లాడారో పూర్తిగా వినకుండా కేవలం ఒక పదాన్ని పట్టుకుని కొందరు బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేయడం అత్యంత సిగ్గుచేటు. అక్కడ సీఎం మాట్లాడిన పరిపాలనా తత్వశాస్త్రం, అడ్మినిస్ట్రేటివ్ డెప్త్ ను అర్థం చేసుకునే ప్రాథమిక మేధో పరిపక్వత వారికి లేదు. సీఎం ప్రస్తావించింది కేవలం Execution Speed, Decisiveness గురించి మాత్రమే తప్ప... హిట్లర్ హింసా సిద్ధాంతాలను కాదు.

హైదరాబాద్‌లోని చెరువులు, కుంటలను కబ్జాదారుల నుంచి కాపాడాలంటే ఆ మాత్రం ఉక్కు సంకల్పం ఉండాలనే ఉద్దేశంతోనే ‘హిట్లర్’ గురించి సీఎం చెప్పారు. తెలంగాణలో ఓ సామెత ఉంది... ‘తాపీ మేస్త్రీకి తలపోటు వస్తే... గోడ కూల్చినట్టుంది’ అని. అచ్చం కేటీఆర్ వ్యవహార శైలి కూడా అలానే ఉంది. అక్కడ చర్చ జరిగిన సందర్భం ఏంటో తెలియదు, ఆ సదస్సు సారాంశం ఏంటో తెలియదు. కానీ.. ‘హిట్లర్’ ఒక పదాన్ని పట్టుకుని ప్రభుత్వం మీద బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు.

హైడ్రా స్పీడ్ కు కబ్జాదారుల గుండెల్లో పుడుతున్న వణుకు చూసి... తట్టుకోలేక... ఓర్వలేక... ఎక్కడ ఏడ్వాలో తెలియక... ఈ ‘హిట్లర్’ ముసుగు వేసుకుని కొందరు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు. కేటీఆర్ నోట ప్రజాస్వామ్య విలువలు అనే మాట వింటే... ‘గురివింద గింజ తన కింద నలుపు ఎరుగదు’  అన్న సామెత గుర్తొస్తుంది.

హైడ్రా చట్టపరిధిలోనే పనిచేస్తోంది, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారమే నోటీసులు ఇస్తోంది. కాకపోతే, గతంలో లాగా కబ్జాదారులకు కొమ్ము కాయకుండా, వారితో కుమ్మక్కు అవ్వకుండా... ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తోంది. ఈ మార్పు తెలంగాణకు అవసరం. దీన్ని ప్రతి మేధావీ, ప్రతి సామాన్యుడూ స్వాగతిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హిట్లర్ క్రూరత్వాన్ని, ఆ హింసాత్మక ఫాసిజాన్ని ఎప్పటికీ సమర్థించదు. అది మా డీఎన్‌ఏలోనే లేదు’’ అని తెలిపారు.

‘వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే’ అనడమేంటి? 
హరీశ్‌ రావుపై కూడా శ్రీధర్‌ బాబు మండిపడ్డారు. ‘‘మీ గత ప్రభుత్వ హయాంలో పదేళ్లలో మీరిచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారు? పదేళ్లలో బీఆర్ఎస్ చేయలేనిది, కాంగ్రెస్ ఇప్పుడు చేస్తోందదని హరీశ్‌ రావు ఆందోళనలో ఉన్నారు. బీఆర్ఎస్ భూముల ధరలు కృత్రిమంగా పెంచింది. 

బీఆర్ఎస్ హాయాంలో ప్రగతి భవన్‌లో ఉన్నవారికే ఫ్రెండ్లీ పోలిసింగ్. వచ్చేది మేమే మీ అంతుచూస్తామని కేటీఆర్, హరీశ్‌ రావు బెదిరిస్తున్నారు... మీరు వచ్చేది లేదు, సచ్చేది లేదు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ విషం చిమ్ముతుంది. మీ తాటాకు చప్పుళ్ల కు భయపడేది లేదు. కొత్త డిస్కం వల్ల రైతులకు లాభమే. ధాన్యం కొనుగోలులో మా ప్రభుత్వం రాజీపడదు. 

బీఆర్ఎస్ హాయాంలో పెంచని ఛార్జీలు ఉన్నాయా? అయినా లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. సింగరేణిని బీఆర్ఎస్ నేతలు సర్వం దోచుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణికి రూ.40 వేల కోట్ల అప్పు పెట్టింది. ప్రైవేటు బొగ్గు డిపోలకు పర్మిషన్ ఇచ్చింది బీఆర్ఎస్సే. సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో భయంతో బీఆర్ఎస్ పోటీ చేయలేదు. సింగరేణి విషయంలో హరీశ్‌ రావు ఆరోపణలు తప్పు’’ అని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement