కేంద్రం తెలంగాణ పథకాల్ని కాపీ కొడుతోంది.. అందుకే మోదీ రోజులు లెక్కపెడుతున్నారు: అఖిలేశ్‌

SP Chief Akhilesh Yadav Speech At BRS Party Khammam Public Meet - Sakshi

సాక్షి, ఖమ్మం:  ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇంకా 400 రోజులే మిగిలి ఉన్నాయి. రోజులు లెక్కపెడుతోందంటే ఆ ప్రభుత్వం ఇక ఉండదని అర్థమవుతోంది. బీజేపీ బ్రహ్మజన్‌ పార్టీ. పని తక్కువ.. ప్రచారం ఎక్కువ’ అని యూపీ మాజీ సీఎం సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం పని ఎక్కువ చేసి.. తక్కువ ప్రచారం చేసుకుంటోందన్నారు. కేంద్రంలో కేసీఆర్‌తో కలిసి కొత్త సర్కార్‌ ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తంచేశారు. బుధవారం ఖమ్మంలో జరిగిన బీఆర్‌ఎస్‌ సభలో ఆయన ప్రసంగించారు.

‘బీజేపీ ప్రభుత్వం దేశంలోని విపక్ష ప్రభుత్వాలన్నింటినీ ఇబ్బందిపెడుతోంది. ఇక్కడ బీఆర్‌ఎస్‌ సర్కార్‌ను కూడా ఇబ్బందుల పాలుచేస్తోంది. నాయకులను ఆందోళనకు గురిచేస్తూ కుట్రలకు పాల్పడుతూ ఒత్తిడికి గురిచేస్తోంది. న్యాయవ్యవస్థలు, దర్యాప్తు సంస్థలను నిర్వీర్యం చేస్తోంది. ఖమ్మం బహిరంగ సభ దేశానికి దిశానిర్దేశం చూపుతుంది. తెలంగాణ ప్రజలు ఉద్యమాలతో చరిత్ర సృష్టించారు. దేశ యువత నిరుద్యోగంతో ఇబ్బందులుపడుతుండగా, రైతులు నష్టాల పాలవుతున్నారు. గుజరాత్‌ నుంచి యూపీకి వచ్చి ప్రధానమంత్రి అయిన మోదీ.. యూపీకి ఏమీ చేయలేదు. ఇక్కడి ప్రజలను మోసం చేశారు.

గంగానది ప్రక్షాళన ఎక్కడి గొంగళి ఆక్కడే అన్నట్లు ఉంది. తెలంగాణలో బీజేపీని తరిమికొట్టండి. యూపీలో కూడా ఆ పార్టీని వెళ్లగొడతాం. సీఎం కేసీఆర్‌ అమలుచేసే ఇంటింటికీ తాగునీరు, పంటలకు సాగునీరు వంటి మంచి పథకాలను కేంద్రం కాపీ కొడుతోంది. బీజేపీ చెప్పింది చేయకపోగా అభివృద్ధిని వెనకకు తీసుకెళ్తోంది. దేశాన్ని బీజేపీ నుంచి రక్షించే కొత్త ప్రభుత్వం కోసం మేమంతా కలిసి పనిచేస్తాం. సీఎం కేసీఆర్‌.. భగవాన్‌ విష్ణు నర్సింహస్వామి ఆలయా (యాదాద్రి)న్ని అద్భుతంగా నిర్మించారు. ఖమ్మం బహిరంగ సభలో ఎక్కడ చూసినా జనమే కనిపిస్తున్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా కేసీఆర్‌కు బ్రహ్మరథం పడుతున్నారు’ అని అఖిలేశ్‌ యాదవ్‌ చెప్పారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top