రైతులకు ‘సౌర’ పంట! | Solar power plants Setting up on farmers own lands | Sakshi
Sakshi News home page

రైతులకు ‘సౌర’ పంట!

Jan 30 2025 2:18 AM | Updated on Jan 30 2025 2:18 AM

Solar power plants Setting up on farmers own lands

సొంత భూముల్లో సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటు  

సాక్షి, హైదరాబాద్‌: ప్రధానమంత్రి కిసాన్‌ ఉర్జా సురక్షా ఏవం ఉత్థాన్‌ మహాభియాన్‌ (పీఎం–కుసుమ్‌) పథకం కింద 4 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్కో) ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానించింది. రైతులు, రైతు సంఘాలు, సహకార సంఘాలు, పంచాయతీలు, రైతుల గ్రూపులు, నీటి వినియోగ సంఘాలు, డెవలపర్లు, ఎస్‌హెచ్‌జీల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరింది. రైతులు, ఇతరుల ఆధ్వర్యంలో 3 వేల మెగావాట్లు.. ఎస్‌హెచ్‌జీల ఆధ్వర్యంలో 1,000 మెగావాట్ల సామర్థ్యంగల ప్లాంట్ల ఏర్పాటుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.   

సొంత భూముల్లో కరెంటు ఉత్పత్తి 
ఎస్‌హెచ్‌జీలు, రైతులు వ్యక్తిగతంగా లేదా ఇతరులతో కలిసి తమ పొలాల్లో 0.5 మెగావాట్లు నుంచి 2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్‌ పవర్‌ ప్లాంట్లను నెలకొల్పటానికి అవకాశం కల్పించారు. ఆర్థిక స్తోమత లేకుంటే డెవలపర్లకు తమ భూములను లీజుకు ఇచ్చి ప్లాంటు పెట్టించవచ్చు. లీజుకు ఇస్తే లీజు డబ్బును డిస్కంలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తాయి. ఒక మెగావాట్‌ సౌర విద్యుత్‌ ప్లాంటు ఏర్పాటుకు 4 ఎకరాల స్థలం అవసరం. ఈ ప్లాంట్లు ఉత్పత్తి చేసే విద్యుత్‌ను రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు 25 ఏళ్ల పాటు కొనుగోలు చేస్తామని హామీ ఇస్తూ ఒప్పందం చేసుకోనున్నాయి. 

రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ) నిర్ణయించిన ధర ప్రకారం యూనిట్‌ విద్యుత్‌కు రూ.3.13 చొప్పున రైతులు, ఎస్‌హెచ్‌జీలకు డిస్కంలు చెల్లిస్తాయి. భవిష్యత్తులో ఈఆర్సీ నిర్ణయం మేరకు ఈ ధరల్లో మార్పులుంటాయి. ఒక మెగావాట్‌ సౌర విద్యుత్‌ ప్లాంటు ద్వారా ఏటా సగటున 15–16 లక్షల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. వ్యవస్థాపకులకు రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేశారు.  

ఎస్‌హెచ్‌జీలకు భూములు, 90% రుణాలు.. 
సౌర విద్యుత్‌ ప్లాంటు ఏర్పాటుకు ఒక మెగావాట్‌కు రూ.2.97 కోట్ల వ్యయం అవుతుందని రెడ్కో అంచనా వేసింది. ఎస్‌హెచ్‌జీలు 10 శాతం వాటా భరిస్తే, మిగిలిన 90 శాతాన్ని బ్యాంకులు రుణంగా ఇస్తాయి. అంటే, మెగావాట్‌ ప్లాంటు ఏర్పాటుకు ఎస్‌హెచ్‌జీలు రూ.29.7 లక్షలు పెట్టుబడి పెడితే, బ్యాంకులు రూ.2.61 కోట్లు రుణంగా ఇవ్వనున్నాయి. ప్లాంట్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఎస్‌హెచ్‌జీలకు ప్రభుత్వ, అటవీ, దేవాదాయ భూములను లీజుకు ఇవ్వనుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) ఆధ్వర్యంలో అత్యుత్తమ పనితీరు కలిగిన ఎస్‌హెచ్‌జీలను ఎంపిక చేసి, వారితో సౌర విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటుచేయిస్తారు. 

ఇక రైతులు 30 శాతం పెట్టుబడి పెట్టుకుంటే, మిగిలిన 70 శాతం మూలధనాన్ని బ్యాంకులు రుణంగా ఇవ్వనున్నాయి. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు 6 శాతం వడ్డీకే రూ.2 కోట్ల వరకు రుణం ఇచ్చేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ముందుకొచి్చంది. రూ.2 కోట్లకు మించిన రుణానికి 9 శాతం వడ్డీ వసూలు చేయనుంది. ఎస్‌బీఐ అధికారులతో బుధవారం ఇంధన శాఖ, సెర్ప్‌ అధికారులు జరిపిన చర్చల సందర్భంగా ఈ మేరకు నిర్ణయించారు.  

ఏడాదిలోగా పూర్తి చేయాలి.. 
రాష్ట్రంలోని ఒక్కో 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌ పరిధిలో ఎంత సామర్థ్యం మేరకు సోలార్‌ పవర్‌ ప్లాంట్లు పెట్టే అవకాశం ఉందో డిస్కంలు ప్రకటించాయి. దీని ఆధారంగా రైతులు ప్లాంటు ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మెగావాట్‌కు రూ.5,000 దరఖాస్తు ఫీజును 18 శాతం జీఎస్టీతో కలిపి చెల్లించాలి. ప్లాంట్‌ కెపాసిటీ మెగావాట్‌కు మించితే రూ.10,000 దరఖాస్తు ఫీజుతో పాటు 18 శాతం జీఎస్టీ చెల్లించాలి. ఎంపికైన వ్యవస్థాపకులు లెటర్‌ ఆఫ్‌ అవార్డు (ఎల్‌ఓఏ) జారీ చేసిన 10 రోజుల్లోగా బ్యాంకు గ్యారెంటీగా మెగావాట్‌కు రూ.5 లక్షల చొప్పున డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. 

ప్లాంట్ల నిర్మాణం ఈ ఏడాది డిసెంబర్‌ 31లోగా పూర్తి చేయాలని నిబంధనల్లో పేర్కొన్నారు. ప్లాంటు నుంచి సబ్‌ స్టేషన్‌ వరకు వ్యవస్థాపకులే ప్రత్యేక విద్యుత్‌ సరఫరా లైన్‌ వేసుకోవాలి. సబ్‌ స్టేషన్‌కు 5 కి.మీల పరిధిలోపల ప్లాంటు పెట్టుకునే వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఒకే సబ్‌ స్టేషన్‌ పరిధిలో ఒకరి కంటే ఎక్కువ మంది ప్లాంట్లు ఏర్పాటుచేస్తే.. అందరూ కలిసి ఒకే సరఫరా లైన్‌ వేసుకోవచ్చు. కొనుగోలు చేసే ప్రతి యూనిట్‌ విద్యుత్‌కు 40 పైసల చొప్పున ఐదేళ్ల పాటు డిస్కంలకు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ (ఎంఎన్‌ఆర్‌ఈ) ప్రోత్సాహకంగా అందిస్తుంది. మెగావాట్‌కు మొత్తం రూ.6.6 లక్షలకు మించకుండా ఈ ప్రోత్సాహం ఉంటుంది.  

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ 
దరఖాస్తుదారులు పీఎం కుసుమ్‌ తెలంగాణ వెబ్‌సైట్‌ www.pmkusum.telangana.gov.in లో ఫిబ్రవరి 28లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఏదైనా సబ్‌స్టేషన్‌ పరిధిలో సామర్థ్యానికి మించి ప్లాంట్ల ఏర్పాటుకు దరఖాస్తులు వస్తే రాష్ట్ర ప్రభుత్వ టెండర్ల వెబ్‌సైట్‌  https://eprocurement.telangana.gov.in  ద్వారా రివర్స్‌ బిడ్డింగ్‌ ప్రక్రియ నిర్వహిస్తారు. ఎవరు ప్లాంట్‌ నిర్మించి తక్కువ ధరకు విద్యుత్‌ విక్రయించేందుకు ముందుకు వస్తే వారినే ఎంపిక చేస్తారు. ఎస్‌హెచ్‌జీల నుంచి దరఖాస్తులను స్వీకరించడం లేదు. పనితీరు ఆధారంగా సెర్ప్‌ అధికారులే వారిని ఎంపిక  చేస్తున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement