
ఖమ్మం జిల్లా: పాము కాటు వేసిందనే భయంతో.. ఒక వ్యక్తి ఆ పామును చంపి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామంలో శుక్రవారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. నందనం గ్రామానికి చెందిన ఉల్లెంగుల రాజు ప్రస్తుతం అదే మండలం రాంనగర్ పంచాయతీలో కారోబార్‌గా పనిచేస్తున్నాడు. స్వగ్రామంలోని ఇంటి వద్ద పాము తన కాలు మీదుగా వెళ్లడంతో భయాందోళనకు గురయ్యాడు.
కాటు వేసిందో.. లేదో తెలియక అయోమయానికి గురైన రాజు.. ఆ పామును చంపాడు. అనంతరం ప్లాస్టిక్ కవర్‌లో పామును భద్రపరచి.. సహచర సిబ్బందితో కలిసి వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. ప్లాస్టిక్ కవర్‌లో పామును చూసిన వైద్యులు ఆశ్చర్యపోయారు. రాజును పరీక్షించి అతని శరీరంపై ఎలాంటి పాము కాటు వేయలేదని నిర్ధారించారు. ప్రథమ చికిత్స చేసి అతన్ని ఇంటికి పంపారు.