
వీటి ద్వారానే కాస్మెటిక్ చార్జీల వినియోగం
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు స్మార్ట్ కార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. డిజిటల్ లావాదేవీలు, డెబిట్ కార్డుల వినియోగంపై అవగాహన పెంచేందుకు ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కాస్మెటిక్ చార్జీల కింద నగదును అందిస్తోంది. వసతిగృహ సంక్షేమాధికారికి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఈ నిధిని విడుదల చేస్తోంది. ఆ నిధి నుంచి విద్యార్థులకు చెల్లిస్తున్నారు. ఇకపై కాస్మెటిక్ చార్జీలను నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థికి బ్యాంకు ఖాతాను తెరవనుంది. బ్యాంకు ఖాతాలో జమ అయిన సొమ్ము నుంచి విద్యార్థి అవసరాలకు అనుగుణంగా స్మార్ట్ కార్డు ద్వారా ఖర్చు చేసే వెసులుబాటు కల్పించనుంది.
ఈ స్మార్ట్ కార్డు డెబిట్ కార్డు మాధిరి పనిచేస్తుంది. ఈ కార్డుల వినియోగం వల్ల విద్యార్థులకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన పెరగడమే కాకుండా డిజిటల్ లావాదేవీల పైన చైతన్యం కలిగించినట్లవుతుంది. ఈ దిశగా కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు మంగళవారం ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలోని తన చాంబర్‌లో సంక్షేమ వసతి గృహాల నిర్వహణపై ఆయన సమీక్ష నిర్వహించారు.
విద్యార్థులకు అవసరమైన సబ్బులు, షాంపూలు ఇతర వస్తువులను కొనుగోలు చేసేందుకు స్మార్ట్ కార్డులను వినియోగించేలా వెసులుబాటు కల్పించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. మహిళా సంఘాలు నిర్వహిస్తున్న మొబైల్ కేంద్రాల ద్వారా కాస్మెటిక్ వస్తువులను కొనుగోలు చేసేవిధంగా సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. వసతిగృహాలకు సరఫరా చేసే సరుకుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంలు, బెడ్‌షిట్లు, కార్పెట్, బ్యాగులు తదితర సామగ్రి కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్, ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి, సెర్ప్ సీఈఓ దివ్య తదితరులు పాల్గొన్నారు.