ఎస్‌ఎల్‌బీసీలో క్లిష్ట దశను అధిగమించాం | SLBC tunnel project moves beyond geological challenge: Uttam Kumar Reddy | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎల్‌బీసీలో క్లిష్ట దశను అధిగమించాం

Oct 5 2026 5:00 AM | Updated on Oct 5 2026 5:00 AM

SLBC tunnel project moves beyond geological challenge: Uttam Kumar Reddy

మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్‌. చిత్రంలో రఘువీర్, అనిల్, వీరేశం, సామేల్, అయిలయ్య తదితరులు

బలహీన శిలల జోన్‌ను దాటిన సొరంగ తవ్వకాలు 

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి 

కార్మీకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచన 

గత ఐదారు నెలల్లో 700 మీటర్ల మేర పురోగతి సాధించామన్న ప్రాజెక్టు బృందం 

ఉమ్మడి నల్లగొండ జిల్లా కీలక నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనుల్లో అత్యంత క్లిష్టమైన భూగర్భ పరిస్థితులను అధిగమించి కీలక ముందడుగు వేశామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. గతంలో ప్రమాదం జరిగిన ప్రాంతంలోని బలహీన శిలల జోన్‌ను దాటి ముందుకు వెళ్లడంతో పనుల వేగం పెంచేందుకు మార్గం సుగమమైందన్నారు. అదనపు యంత్రాలను రంగంలోకి దించాలని, తవ్విన రాళ్లు, మట్టిని బయటకు తరలించే వ్యవస్థను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.

పనుల్లో వేగంతో పాటు కార్మీకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా కీలక నీటిపారుదల ప్రాజెక్టులపై ఆదివారం ఆయన సమీక్షించారు. గత ఐదారు నెలల్లో 700 మీటర్ల మేర సొరంగం తవ్వకాలు జరిగాయని ప్రాజెక్టు అధికారులు మంత్రికి వివరించారు.

అవుట్‌లెట్‌ వైపు నుంచి 450 మీటర్లు, ఇన్‌లెట్‌ వైపు నుంచి 250 మీటర్ల మేర తవ్వకాలు జరిగాయని చెప్పారు. మొత్తం 43.968 కిలోమీటర్ల సొరంగానికి గాను 79 శాతం పనులు పూర్తయ్యాయని, తవ్వకాలు మరో 9.1 కిలోమీటర్ల మేర మిగిలి ఉన్నాయని తెలియజేశారు. క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసిన అధికారులు, కార్మీకులను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.  

ఇకపై సాధారణంగా పనులు 
సొరంగాల నిపుణుడు కల్నల్‌ పరీక్షిత్‌ మెహ్రా ఇన్‌లెట్‌ వద్ద ఎదురైన పరిస్థితులను వివరించారు. బలహీనమైన మట్టి, రాళ్లు ఒక్కసారిగా విరిగిపడే రాక్‌ బర్ట్స్‌ వంటి ప్రమాదకర పరిస్థితుల్లో మరో ప్రమాదం జరగకుండా ప్రారంభంలో తవ్వకాల వేగాన్ని ఉద్దేశపూర్వకంగానే తగ్గించినట్లు తెలిపారు. టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌ (టీబీఎం) చిక్కుకుపోయిన ప్రాంతాన్ని చుట్టి వెళ్లేలా చేపట్టిన మళ్లింపు తవ్వకాల్లో మరింత బలహీనమైన శిలల మండలాన్ని సురక్షితంగా దాటేందుకు 140 మిల్లీమీటర్ల సీమ్‌లెస్‌ పైపులతో తవ్వకాలు జరిగే భాగానికి ముందుగా గొడుగు మాదిరి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

బలమైన రిబ్‌లను అమర్చడం, దశలవారీగా తవ్వడం, ముందున్న శిలల పరిస్థితిని తెలుసుకునేందుకు డ్రిల్లింగ్‌ పరీక్షలు చేయడం, అదనపు రక్షణ ఏర్పాట్లతో ప్రమాదాలను నియంత్రిస్తూ ముందుకు సాగినట్లు చెప్పారు. ప్రస్తుతం శిలల పరిస్థితి మెరుగుపడుతుండటంతో సాధారణంగా పనులు సాగించే అవకాశం ఏర్పడుతోందని తెలిపారు. 

2028లో ప్రధాన సొరంగం అనుసంధానం లక్ష్యం 
టన్నెల్‌–1లో రెండు వైపుల నుంచి సాగుతున్న తవ్వకాలు 2028 మే–జూన్‌ నాటికి కలిసే దశకు చేరుకుంటాయని మంత్రి ఉత్తమ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాన సొరంగం, టన్నెల్‌–2, బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్, ఇతర అనుబంధ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. సమీక్షలో ఎంపీలు కె. రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మందుల సామేల్, కె. జైవీర్‌రెడ్డి, వేముల వీరేశం, అనిల్‌ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌ నాయక్‌  తదితరులు పాల్గొన్నారు.

రోజుకు 8 మీటర్ల మేర.. 
ప్రస్తుతం రెండు వైపులా కలిపి రోజుకు సుమారు 8 మీటర్ల మేర సొరంగం తవ్వాలు జరిపినట్టు ప్రాజెక్టు బృందం తెలిపింది. ఒకట్రెండు రోజులు అది పది మీటర్లకు కూడా చేరిందని వివరించింది. అవుట్‌లెట్‌ వద్ద మూడు డ్రిల్లింగ్‌ భుజాలున్న బూమర్‌ యంత్రం ఇప్పటికే పనిచేస్తోందని, అక్కడి పనులు అవసరమైన వేగానికి చేరువలో ఉన్నాయని తెలిపింది.

ఇన్‌లెట్‌ వద్ద ఇదే తరహా మరో యంత్రం అక్టోబర్‌లో అందుబాటులోకి రానుందని చెప్పింది. జర్మనీ నుంచి తెప్పిస్తున్న రైలు ఇంజిన్‌ (లోకోమోటివ్‌) అక్టోబర్‌ నెలాఖరుకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అక్టోబర్‌ చివరి లేదా నవంబర్‌ ప్రారంభం నుంచి పనుల వేగం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement