ఆడియోలు వినిపిస్తూ... పత్రాలు చూపిస్తూ! | SIT moving forward strategically in phone tapping case | Sakshi
Sakshi News home page

ఆడియోలు వినిపిస్తూ... పత్రాలు చూపిస్తూ!

Jun 26 2025 2:55 AM | Updated on Jun 26 2025 5:22 AM

SIT moving forward strategically in phone tapping case

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న సిట్‌

నిందితులు, బాధితులను ఎదురెదురుగా పెట్టి వాంగ్మూలాల నమోదు

సాక్షి, హైదరాబాద్‌/బంజారాహిల్స్‌: అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. బాధితుల్ని సాక్షులుగా పరిగణిస్తూ వారి­నుంచి వాంగ్మూలాలు సేకరించడంతో పాటు వాళ్లు కచ్చితంగా న్యాయస్థానం వరకు వచ్చి సాక్ష్యం చెప్పేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వారి ఫోన్లు ఎలా ట్యాప్‌ అయ్యాయో చూపిస్తోంది. నేతలతో పాటు వారి కుటుంబీకులు, అనుచరుల సంభాషణల ఆడియో­లను వినిపిస్తూ, సంబంధిత పత్రాలను చూపిస్తూ వాంగ్మూలాలు తీసుకుంటోంది. 

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 2023 నవంబర్‌ 15 నుంచి 30 మధ్యే ప్రభాకర్‌రావు నేతృత్వంలోని ఎస్‌ఐబీ 4,013 ఫోన్లపై నిఘా ఉంచినట్లు సిట్‌ గుర్తించింది. వీటిలో 618 రాజకీయ నాయకులకు సంబంధించినవిగా తేల్చింది. మరోపక్క కేసులో మరో నింది­తుడు ప్రణీత్‌రావు ఫోన్‌ నుంచి సిట్‌ అధికారులు కొన్ని ఆడియోలు సేకరించారు. వాస్తవానికి రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ప్రభాకర్‌రావుతో పాటు ఆయన టీమ్‌ మొత్తం తమ ఫోన్లలో ఉన్న డేటాను డిలీట్‌ చేయడంతో పాటు ఫోన్లను ధ్వంసం చేసింది. 

అయితే ప్రణీత్‌కు సంబంధించిన ఓ ఫోన్‌లో మాత్రం డేటా డిలీట్‌ కాకపోవడంతో అది సిట్‌ చేతికి చిక్కింది. రాజకీయ నాయకులతో పాటు వారి సంబంధీకుల ఫోన్లను ట్యాప్‌ చేసిన ప్రణీత్‌ ఆ ఆడియోలను ‘పెద్దలకు’ షేర్‌ చేసినట్లు సిట్‌ అనుమాని­స్తోంది. ప్రస్తుతం సిట్‌ సాక్షులకు ఈ ఆడియోలను వినిపించడంతో పాటు వివిధ లేఖల్ని చూపిస్తోంది. ఆ తర్వాతే వివిధ అంశాలను ప్రశ్నిస్తూ వారి వాంగ్మూలం నమోదు చేస్తోంది. కొందరు సాక్షులు, నిందితుల్ని ఎదురెదురుగా పెట్టి స్టేట్‌మెంట్లు తీసుకుంటోంది. 

అప్పటి ప్రభుత్వం దిగజారి వ్యవహరించింది..
ప్రణీత్‌రావు బుధవారం మరోసారి సిట్‌ ఎదుట హాజర­య్యారు. తెలంగాణ వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఫహీమ్‌ ఖురేషీ, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌లతో పాటు కామారెడ్డికి చెందిన వివిధ పార్టీల నేతలు సిట్‌ ఎదుట హాజరై వాంగ్మూలాలు ఇచ్చారు. కాగా ఫహీమ్‌ ఖురేషీ మీడియాతో మాట్లాడుతూ.. ‘నా ఫోన్‌ ట్యాప్‌ అయిందని డీసీపీ నుంచి సమాచారం అందింది. నా ఫోన్‌తో పాటు నా భార్య, డ్రైవర్‌ ఫోన్లనూ ట్యాప్‌ చేశారు. అధికారం కోసం నీచానికి దిగజారారు. బహుశా ట్యాపింగ్‌ ద్వారా తెలుసుకున్న సమాచారంతోనే ఎన్నికల ముందు నాపై చాలా ఒత్తిడి తెచ్చారు..’ అని చెప్పారు. 

బల్మూరి వెంకట్‌ మాట్లాడుతూ..‘బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాజకీయాల కోసం నీచానికి దిగజారింది. తల్లి, పిల్ల అనే తేడా లేకుండా అందరి ఫోన్లు ట్యాప్‌ చేసింది. మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసింది..’ అని చెప్పారు. కాగా 2023 ఎన్నికల సమయంలో ప్రభాకర్‌రావు కామారెడ్డిలో ప్రత్యేకంగా ఓ మినీ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి మరీ ట్యాపింగ్‌ చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బుధవారం వరకు దాదాపు 235 మంది వాంగ్మూలాలను సిట్‌ నమోదు చేసినట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement