11 ఏళ్ల కిందట సంచలనం.. ఇప్పటి యువ ఐపీఎస్‌లకు పాఠమైంది..

Sircilla Murder Case As Lesson To Trained IPS - Sakshi

సిరిసిల్ల(రాజన్న సిరిసిల్ల): డబ్బుల కోసం వేసిన వలపుగాలానికి సంపన్న వ్యక్తి చిక్కాడు. మహిళతో సుతిమెత్తగా మాట్లాడిస్తూ.. అతడ్ని ట్రాప్‌ చేసి దూర ప్రాంతానికి రప్పించారు. ఓ గదిలో బంధించారు. అతడి కుటుంబానికి ఫోన్‌ చేసి లక్షలు డిమాండ్‌ చేశారు. సొమ్ములిచ్చేంత వరకు ఆ వ్యక్తిని చిత్రహింసలు పెట్టారు. తమను గుర్తు పడితే లైఫ్‌కే ప్రమాదమని చంపేశారు. మృతదేహం వానస రాకుండా ఫ్రిజ్‌లో కుక్కేశారు. పదిరోజులైనా ఆచూకీ లభించలేదు.

కేసును చాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని వినియోగించి ఛేదించారు. నిందితులను పట్టుకుని జైలుకు పంపారు. ఆ హత్యకేసులో ఆరుగురికి యావజ్జీవ శిక్ష పడింది. సిరిసిల్లలో 2011 జూన్‌లో సంచలనం సృష్టించిన ఈ ఘటన ఇప్పుడు హైదరాబాద్‌లోని నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో శిక్షణ  ఐపీఎస్‌లకు పాఠమైంది. మిస్టరీగా మారిన యువకుడి హత్యోదంతాన్ని అన్ని ఆధారాలతో సహా కోర్టు ఎదుట ఉంచడంలో పోలీసులు సక్సెస్‌ అయిన తీరును అకాడమీలో హిస్టరీగా బోధించారు. 11 ఏళ్ల కిందట సంచలనం సృష్టించిన ఆ ఘటనపై ప్రత్యేక కథనం.!

చదవండి👉: బొంగులో చికెన్‌ తెలుసు కానీ.. బొంగులో కల్లు పేరు విన్నారా?

క్రైం నంబరు 173/2011
సిరిసిల్ల పట్టణంలోని సుభాష్‌నగర్‌కు చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపా రి గర్దాస్‌ శ్రీనివాస్‌(42). అతనికి భార్య లలిత, ఇద్దరు పిల్లలు సాయికృష్ణ, శ్రీకాంత్, తల్లిదండ్రులు సునంద, నర్సప్ప ఉన్నారు. సుజాత అనే మహిళ శ్రీనివాస్‌కు ఫోన్లో పరిచయమైంది. హైదరాబాద్‌ రావాల్సిందిగా కోరింది. శ్రీనివాస్‌ 2011 జూన్‌ 20న హైదరాబాద్‌ ఉప్పల్‌లోని ఏఆర్‌కే అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. ఆరుగురు సభ్యులు గల ముఠా పథకం ప్రకారం అతన్ని నిర్బంధించి కుటుంబసభ్యులను రూ.25లక్షలు డిమాండ్‌ చేశారు. శ్రీనివాస్‌ తండ్రి నర్సప్ప నిందితులు సూచించిన బ్యాంకు ఖాతాలో రూ.1.50 లక్షలు వేశాడు. ఆ డబ్బులను వివిధ ఏటీఎంల నుంచి డ్రా చేసుకున్నారు. తమను గుర్తుపడితే సమస్య ఏర్పడుతుందని అదే అపార్ట్‌మెంట్‌లో హత్యచేశారు. ఫ్రిజ్‌లో శవాన్ని మూటకట్టి ఉంచారు. ఈ ఘటనపై సిరిసిల్ల పోలీసులు క్రైం నంబరు 173/ 2011 కేసు నమోదు చేశారు.

పక్కావ్యూహంతో.. వలపు వల
ప్రస్తుత మంచిర్యాల జిల్లాకు చెందిన కొండపాక శ్రీధర్‌ ఉరఫ్‌ శేఖర్‌(30) 2003 నుంచి వివిధ నేరాల్లో జైలుకు వెళ్లాడు. భార్యను హత్య చేసిన కేసులో సిరిసిల్ల తారకరామనగర్‌కు చెందిన మేర్గు చిరంజీవి జైలుకు వెళ్లాడు. వీరిద్దరు అక్కడే పరిచయమయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత శ్రీధర్‌ సిరిసిల్లు మకాం మర్చాడు.

సిరిసిల్లలో ప్రముఖ వస్త్రవ్యాపారి గర్దాస్‌ శ్రీనివాస్‌ ఇంట్లో అద్దెకు ఉండే ఆకులేని ఇందిరతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. భర్తతో విడాకులై ఒంటరిగా ఉంటున్న కొక్కుల సుజాతను వివాహం చేసుకున్నాడు. తనకు పెద్దమొత్తంలో డబ్బులు కావాలని తొలుత పరిచయమైన ఇందిరతో చెప్పాడు.

తమ ఇంటి యజమాని శ్రీనివాస్‌ బాగా ఆస్తిపరుడని అతన్ని ట్రాప్‌ చేస్తే డబ్బులు గుంజవచ్చని ఇందిర సలహా ఇచ్చింది. పథకం ప్రకారం.. హైదరాబాద్‌ ఉప్పల్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో రెండునెలల కోసం ప్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. శ్రీధర్‌ సుజాతతో శ్రీనివాస్‌కు ఫోన్‌ చేయించి ట్రాప్‌ చేశారు.

2011 జూన్‌ 20న శ్రీనివాస్‌ను హైదరాబాద్‌ రావాల్సిందిగా సుజాత కోరగా.. శ్రీనివాస్‌ వెళ్లి అపార్ట్‌మెంట్‌లో బంధి అయ్యాడు. సిరిసిల్లకు చెందిన మేర్గు చిరంజీవి, గూడూరి రాజు సహకారంతో శ్రీధర్‌ శ్రీనివాస్‌ను బంధించాడు. శ్రీనివాస్‌ తండ్రి గడ్దాస్‌ నర్సప్పకు ఫోన్‌ చేసి రూ.25 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేశారు. వాళ్లు చెప్పిన అకౌంటులో నర్సప్ప రూ.1.50 లక్షలు వేయగా.. నిందితులు హైదరాబాద్‌లోని వివిధ ఏటీఎంల నుంచి రూ.1.25 లక్షలు డ్రా చేశారు.

బంధీగా ఉన్న శ్రీనివాస్‌ జూన్‌ 25న పెద్ద ఎత్తున కేకలు వేయడంతో ప్లాట్లోనే అతన్ని హత్య చేశారు. శవం వాసన రాకుండా దాచే ందుకు కొత్త ఫ్రీజ్‌ కొన్నారు. శవాన్ని మూట గా అందులో ఉంచారు. జూన్‌ 26న ఇందిర, కొండ రాజును హైదరాబాద్‌కు పిలిచి రూ.లక్షతో పాటు బైక్‌ ఇచ్చి సిరిసిల్లకు వెళ్లి అక్కడి ఎం జరుగుతుందో ఎప్పటికప్పుడు ఫోన్‌లో చెప్పాల్సిందిగా నిందితులు సూచించారు.

చదవండి👉: కడుపులో 11.57కోట్ల కొకైన్‌..

2017 సెప్టెంబరు 12న శిక్ష
శ్రీనివాస్‌ హత్యకేసులో పోలీసులు శాస్త్రీయంగా విచారించారు. సెల్‌ఫోన్‌ సంభాషణ ఆధారంగా కొండ రాజును ముందుగా పట్టుకున్నారు. అతడ్ని విచారించి అపార్ట్‌మెంటుకు వెళ్లగా.. ఫ్రీజ్‌లో శవం బయటçపడింది. నిందితులు భీవండికి పారిపోగా.. అప్పటి సిరిసిల్ల ఓఎస్డీ ధరావత్‌ జానకీ, ప్రొబేషనరీ డీఎస్పీ శ్రీనివాస్, సిరిసిల్ల టౌన్‌ సీఐ సర్వర్‌ కేసును శాస్త్రీయంగా ఛేదించారు. 2017 సెప్టెంబరు 12న కరీంనగర్‌ న్యాయస్థానం నిందితులు కొండపాక శ్రీధర్, ఆకులేని ఇందిర, కొక్కుల సుజాత, మేర్గు చిరంజీవి, గూడూరి రాజు, కొండ రాజుకు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. చిరంజీవి అప్పటికే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

రెండు నెలలకు చార్జ్‌షీట్‌ 
అప్పుడు నేను సిరిసిల్ల టౌన్‌ సీఐగా ఉన్నాను. ఈ కేసును చాలెంజ్‌గా తీసుకుని నిందితులను పట్టుకున్నాం. అప్పటి పోలీసు ఉన్నతాధికారుల సూచన... సహకారంతో అన్ని జాగ్రత్తలు తీసుకుని, అన్ని ఆధారాలు సేకరించి రెండు నెలల్లో చార్జ్‌షీట్‌ వేశాం. నిందితులకు శిక్ష పడింది. ప్రస్తుతం ఆ కేసును శిక్షణ ఐపీఎస్‌లకు ఇటీవల పాఠంగా బోధించారు. 
– సర్వర్, ఎస్‌బీ, సీఐ, సిరిసిల్ల  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top