సాక్షి, రంగారెడ్డి జిల్లా : సివిల్ వివాదంలో జోక్యం చేసుకుని ఓ బాధితురాలిని అక్రమంగా నిర్బంధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మొయినాబాద్ పోలీసుల వ్యవహారంపై నివేదిక ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించిన చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్‌కు జిల్లా పోలీసు కంప్లైట్స్ అథారిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గుడిమల్కాపూర్‌కు చెందిన ప్రమీల తన విల్లా విక్రయ వివాదంలో మొయినాబాద్ పీఎస్‌కు వెళ్లగా, పోలీసులు ఆమె ఫిర్యాదు తీసుకోకుండా రోజంతా స్టేషన్‌లో నిర్బంధించి బెదిరించారు.
దీనిపై బాధితురాలు హైదరాబాద్ రీజియన్ జిల్లా పోలీసు కంప్లైట్స్ అథారిటీని ఆశ్రయించింది. విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరుతూ ఫిబ్రవరిలో జారీ చేసిన ప్రధాన నోటీసుతో పాటు మూడు రిమైండర్లకు డీసీపీ స్పందించలేదు. దీంతో ఉదాశీనంగా ఉన్న డీసీపీపై ఎందుకు ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని అథారిటీ చైర్మన్, మాజీ సెషన్స్ జడ్జ్ కె.సుదర్శన్ ఆదేశించారు.


